PK:’ఆంధ్రప్రదేశ్’ రాజధాని ‘అమరావతే’… వచ్చేది ‘జనసేన’ ప్రభుత్వమే – ‘పవన్ కళ్యాణ్

అధికార మదంతో కొట్టుకుంటున్న వైసీపీ మహిషానికి కొమ్ములు విరగ్గొట్టి కింద కూర్చోబెడతామని, వైసీపీని గద్దెదించి జనసేన పార్టీని అధికారంలోకి తీసుకువస్తామని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

  • Written By:
  • Publish Date - March 15, 2022 / 09:09 AM IST

అధికార మదంతో కొట్టుకుంటున్న వైసీపీ మహిషానికి కొమ్ములు విరగ్గొట్టి కింద కూర్చోబెడతామని, వైసీపీని గద్దెదించి జనసేన పార్టీని అధికారంలోకి తీసుకువస్తామని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై చిత్తశుద్ధితో యుద్ధం చేసేందుకు సన్నద్దమవుతున్నట్లు తెలిపారు. అందుకోసం బీజేపీ అగ్రనాయకత్వం రోడ్ మ్యాప్ ఇస్తానందనీ, అది ఇస్తే ఈ ప్రభుత్వాన్ని కూల్చేందుకు పని చేస్తామని వెల్లడించారు. రోడ్ మ్యాప్ కోసం ఎదురు చూస్తున్నామనీ, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి రావడమే జనసేన పార్టీ లక్ష్యం.. ఉద్దేశమని పేర్కొన్నారు. వైపీపీ వ్యతిరేక ఓటును చీల్చే ప్రసక్తే లేదనీ, రాష్ట్ర భవిష్యత్తు కోసం అవసరం అయితే పొత్తుల గురించి ఎన్నికల సమయంలో ఆలోచిస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాధ్యతను పవన్ కళ్యాణ్ స్వీకరిస్తాడన్నారు. ఆత్మగౌరవానికీ, ఆధిపత్య అహంకారానికి మధ్య జరుతున్న పోరులో జనసేన పార్టీ విజయం సాధించడం ఖాయమన్నారు. అమరావతి, మంగళగిరి నియోజకవర్గం పరిధిలోని ఇప్పటం గ్రామంలో జరిగిన జనసేన పార్టీ 9వ ఆవిర్భావసభలో ఆశేష జనవాహినిని ఉద్దేశించి ప్రసగించారు జనసేనాని పవన్ కళ్యాణ్.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ లోకహితం కోరుకునే గో బ్రాహ్మణులకు, అల్లా చల్లని చూపు అందరి మీద ప్రసరించాలని ప్రార్ధించే ఇస్లాం మత పెద్దలకు, నిరంతరం ఏసుప్రభు త్యాగాలను ప్రపంచానికి తెలియపర్చే క్రైస్తవ మత గురువులకు, సర్వజన హితం కోరే బౌద్ద సన్యాసులకు, లోక సౌభాగ్యాన్ని ఆకాంక్షించే సిక్కు, జైన మత గురువులకు, లోక కళ్యాణం కోసం నిరంతరం రామ కోటి రాసే తల్లులకు, పెద్దలకు అందరికీ పేరు పేరునా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. రాష్ట్రం నలు మూలల నుంచి ఆంధ్ర రాష్ట్ర నలు మూలల నుంచి, తెలంగాణ రాష్ట్రం నుంచి జనసేన 9వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆంధ్రా రాజధాని అమరావతిలోని మంగళగిరి నియోజకవర్గం, తాడేపల్లి మండలంలోని ఇప్పటం గ్రామ పంచాయితీలో శ్రీ దామోదరం సంజీవయ్య గారి సభా ప్రాంగణానికి విచ్చేసిన కొదమసింహాల్లాంటి జనసైనికులకు, ఆడ బెబ్బులి లాంటి వీర మహిళలకు, ధైర్యంతో, సౌర్యంతో స్థానిక పంచాయితీ ఎన్నికల్లో పోటీ చేసిన సరికొత్తతరం.. పంచాయితీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్ధులకు, పోటీ చేసిన వారికి, గెలిచిన వారికి ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక నమస్కారాలు.

ఇప్పటం గ్రామాభివృద్ధికి రూ. 50 లక్షలు:
ఈ సభను జరుపుకునేందుకు అనుమతిచ్చి మా పొలాల్లో సభను చేసుకోమని చెప్పిన ఇప్పటం గ్రామ రైతు సోదరులకు ముందుగా కృతజ్ఞతలు. మీరు చూపించిన ఈ ప్రేమ, సభ పెట్టుకోండని అండగా నిలబడ్డందుకు మీకు మాటిస్తున్నాను. ఇప్పటం గ్రామ అభివృద్ధికి వ్యక్తిగతంగా నా ట్రస్టు నుంచి 50 లక్షల రూపాయలు ఇస్తున్నాను. మా జనసేన నాయకుల ద్వారా మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి, పంచాయతీకి రైతు పెద్దల ద్వారా గ్రామ పంచాయితీకి అందచేస్తాను అని అన్నారు పవన్ కళ్యాణ్.

తోటి భీమ్లానాయక్ లకు నమస్కారాలు:
సభ నిర్వహణకు అనుమతిచ్చిన పోలీసు అధికారులకు, ట్రాఫిక్ నియంత్రించిన అధికారులకు, సోదరులైన మా తోటి కానిస్టేబుళ్లకు, తోటి భీమ్లా నాయక్ లు అయిన ఎస్సైలకు అందరికీ పేరు పేరునా నమస్కారాలు ధన్యవాదాలు. పార్టీకి మొదటి నుంచి నిలకడగా వెన్నంటి పార్టీ కార్యక్రమాలు చూసుకుంటున్న పార్టీ ప్రోగ్రామ్స్ కమిటీ చైర్మన్ కేకే కి, 12 కమిటీల సభ్యులకు, నెల రోజుల నుంచి పడిన కష్టానికి సహకరించిన వాలంటీర్లకు, ఆడపడుచులకు, నాయకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. మీ కష్టాన్ని నేను మర్చిపోను. రాష్ట్ర క్షేమం, అభివృద్ధి బాగుండాలని నిరంతరం కృషి చేస్తున్న పత్రికాధిపతులకు, పాత్రికేయులకు నా హృదయ పూర్వక కృతజ్నతలు తెలియచేసుకుంటున్నాను. ఎలక్ట్రానిక్ మీడియా రంగానికి, సామాజిక మాధ్యమాల్లో నిస్పక్షపాతంగా అభిప్రాయాలు, సూచనలు తెలియచేస్తున్న రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులకు నమస్కారాలు. జనసేన మద్దతుదారులు, ఆశేష ప్రజానీకానికి, సామాజిక మాద్యమాల్లో ప్రపంచ వ్యాప్తంగా సభను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికీ పేరు పేరునా హృదయ పూర్వక నమస్కారాలు. పార్టీ నిర్మాణం ఎలా ఉంటుంది అని ఎప్పుడూ ప్రశ్నించే వారు. ఈ రోజున ప్రతి జిల్లాలో, మండలాల్లో అధ్యక్షులు, కార్యవర్గానికి పేరు పేరునా నమస్కారాలు. పీఏసీ సభ్యులకు సమస్కారాలు. రాజకీయాల పట్ల అవగాహన, దేశభక్తి పెంపొందించుకోవాల్సిన సమయంలో నాలో బలమైన మార్పు దారిచూపిన మా సోదరులు, ఈ రోజున రాజకీయ పాలసీలు మాట్లాడడానికి కారకులు మా సోదరులు నాగబాబు. నెల్లూరు వీఆర్ లా కాలేజీలో చదువుకుంటున్నప్పుడు ఆయనిచ్చిన ‘వుయ్ ద పీపుల్.. వి ద నేషన్’ అనే పుస్తకం నాకు ప్రేరణ. అది నాకు ఒక బైబిల్ అయిపోయింది. దాని స్ఫూర్తే ఈ రోజు మీ ముందుకు ఉండడానికి కారణం అయిన సోదరులు నాగబాబుకి హృదయపూర్వక నమస్కారాలు. గెలిచినా ఓడినా జనసేనతోనే ప్రయాణం అని చెప్పిన ఉమ్మడి రాష్ట్ర మాజీ సభాపతి, పీఏసీ చైర్మన్, పార్టీ సీనియర్ నాయకులు నాదెండ్ల మనోహర్ కి హృదయపూర్వక నమస్కారాలు. పార్టీ పెట్టినప్పటి నుంచి, పార్టీ పెట్టక ముందు 2008 నుంచి వెన్నంటే ఉన్న హనీఫ్ కి, శంకర్ గౌడ్ కి, పార్టీ ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డికి, తెలంగాణ కార్యవర్గానికి, విద్యార్ధి విభాగం అధ్యక్షులు సంపత్ నాయక్ కి, తెలంగాణ జనసైనికులకు హృదయపూర్వక నమస్కారాలు తెలిపారు పవన్ కళ్యాణ్.

మగవాళ్లకు గుండెల్లో ధైర్యం నింపాల్సింది వీర మహిళలే:
9వ ఆవిర్భావ సభ ముఖ్యాంశాల్లోకి వెళ్లే ముందు మన గురించి మనం విశ్లేషించుకుందాం. ఈ సందేశం జనసైనికులు, క్రియాశీలక కార్యకర్తలు, వీర మహిళల కోసం. మనం ప్రేమించే వ్యక్తి మీద ప్రేమ పక్క వారికి ఇబ్బంది కలిగించకుండా ఉండాలి. ఆ వ్యక్తి మీద ప్రేమ మీ తల్లిదండ్రులకు బరువు కారాదు. ఆ వ్యక్తి మీద ప్రేమ దేశం వైపు సమాజం వైపు మళ్లించండి. ఆదిశక్తిని ఆరాధించే వాడిని కాబట్ట మహిళా విభాగానికి వీర మహిళా విభాగం అని పేరు పెట్టాను. పురాణాలలో కామ క్రోధ లోభ మధమాత్సర్యం తలకెక్కిన పురుష దేవతలను ఓడించి, చివరికి శరణు వేడుకుంటే తిరిగి పురుష దేవతలకు శక్తులిచ్చింది ఆ ఆదిశక్తే. అలాంటి ఆదిశక్తి ప్రతిరూపాలయిన వీర మహిళలు, ఆడపడుచుకులకు హృదయపూర్వక నమస్కారాలు. చరిత్రలో ఖడ్గ తిక్కన గురించి చదువుకున్నాం. ఆయన యుద్ధం నుంచి పారిపోతే తల్లి, భార్య ఇద్దరు పసుపు, గాజులు ఇచ్చి పంపుతారు. మగ వాళ్లు మగవాళ్లుగా ప్రవర్తించకపోతే వీర మహిళలే వారి గుండేల్లో ధైర్యం నింపాలి. మార్పు తీసుకురావాలి. అలాంటి వీరత్వం చూపించే ఆడపడుచులకు నా గుండె లోతుల్లో నుంచి కృతజ్నతలు తెలియ చేసుకుంటున్నాను.

తెలంగాణ నాయకత్వానికి నమస్కారాలు:
స్వాతంత్రోద్యమ స్ఫూర్తితో, తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చిన వాడిని. అణగారిన వర్గాలకు అండగా నిలబడిన వాడిని. అందుకే అందరూ మర్చిపోయినా అణగారిన వర్గాల నాయకుడు శ్రీ దామోదరం సంజీవయ్య గారి పేరు ఈ వేదికకు పెట్టాం. అందరూ మర్చిపోయినా మేము మర్చిపోం. ఆయన్ను మా గుండెల్లో పెట్టుకుంటాం. ఆయన స్ఫూర్తితోనే రాజకీయాలు చేస్తాం. అణగారిన వర్గాలకు అండగా ఉండే వాడిని. అన్ని వర్గాల వారి అభివృద్దికి చేదోడు వాదోడుగా ఉండే వాడిని. అందరూ బాగుండాలని కోరుకునే వాడిని. తెలంగాణ సంస్కృతిలో భాగమైన అలాయ్ బలాయ్ సంస్కృతిని గౌరవించే వాడిని. దసరా రోజున జమ్మి చెట్టు ఆకులిచ్చి ఆత్మీయాలింగనం చేసుకుంటాం. రాజకీయాలలో కూడా ప్రజాసమస్యల పరిష్కారం కోసం కొన్నిసార్లు మాట మాట అనుకుంటాం. స్థాయి దాటే మాటలు అనుకుంటాం. అలా అనుకున్నప్పుడు రాజకీయపరమైన విబేధాలు తప్ప వ్యక్తిగత ద్వేషాలు ఉండరాదని నమ్మిన వాడిని. నాలో అలాయ్ బలాస్ స్ఫూర్తిని నింపిన సీనియర్ రాజకీయ నాయకులు, మాజీ కేంద్ర మంత్రి, హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయకి హృదయ పూర్వక నమస్కారాలు. ఉభయ రాష్ట్రాల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు సోము వీర్రాజుకి, బండి సంజయ్ కి నమస్కారాలు తెలియచేసుకుంటున్నాను. ఉభయ రాష్ట్రాల్లోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు నమస్కారాలు. సీపీఐ, సీపీఎం నాయకులు మధు, రామకృష్ణకి, సోదరులు, మంత్రివర్యులు కల్వకుంట్ల తారకరామారావుకి, టిఆర్ఎస్ అధినాయకత్వానికి హృదయ పూర్వక నమస్కారాలు. తెలంగాణ రాష్ట్ర సాధనలో క్రియాశీలకంగా వ్యవహరించిన మాజీ మంత్రివర్యులు, తెలుగు ప్రజల మంచిని కోరే డాక్టర్ విజయరామారావుకి నా నమస్కారాలు. ఉత్పత్తి కులాలనైన బీసీ కులాలు పరిపుష్టంగా ఉండాలని మాకు చెప్పిన మాజీ మంత్రి బూర నరసన్న గౌడ్ కి నా నమస్కారాలు. తెలంగాణ, ఆంధ్ర మేధావులు, సామాజిక కార్యకర్తలకు నా నామస్కారం.

నా సంస్కారం వైసీపీ వారికీ నమస్కారం పెట్టమంటోంది:
అలాగే టీడీపీ నాయకులు, సీనియర్ రాజకీయ నాయకులు, మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకి హృదయపూర్వక నమస్కారాలు. తెలుగు దేశం నాయకులు, కార్యకర్తలకు నమస్కారాలు. నా సంస్కారం వైసీపీ వారికి కూడా నమస్కారం పెట్టమంటోంది. వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు కూడా జనసేన పార్టీ 9వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నా హృదయపూర్వక నమస్కారాలు. వైసీపీలో చాలా మంచి నాయకులు ఉన్నారు. వైసీపీ అనగానే మనకు కనిపించే బూతులు తిట్టే మంత్రులు మాత్రమే కాకుండా మంచి నాయకులు కూడా ఉన్నారు. దురదృష్టవశాత్తు ఈ మధ్య చనిపోయిన మంత్రి మేకపాటి గౌతం రెడ్డి, ఆయన తండ్రి మేకపాటి రాజమోహన్ రెడ్డికి కూడా నమస్కారాలు. వైసీపీ నెల్లూరు జిల్లా నాయకులు ఆనం రామనారాయణ రెడ్డికి హృదయపూర్వక నమస్కారాలు. నాకు చిన్నప్పటి నుంచి తెలిసిన మాగుంట శ్రీనివాసుల రెడ్డికి, కళా బంధు మాజీ ఎంపీ సుబ్బిరామిరెడ్డికి నా నమస్కారం.

150 మందితో మొదలై.. 5 లక్షల క్రియాశీలక సభ్యుల వైపు:
నమస్కారాల పర్వం పూర్తయ్యింది. ఇంత మందికి నమస్కారాలు పెట్టాము అంటే అది జనసేన సంస్కారం. ఒక పార్టీని నడపడం అంటే ఏంటి? పార్టీని నడపడం అంటే వేల కోట్లు ఉండాలా? నా దృష్టిలో ఒక బలమైన సైద్ధాంతిక బలం ఉండాలి. ఆ సిద్ధాంతాన్ని బతికించే వ్యక్తుల సమూహం ఉండాలి. అది ఎప్పుడూ ఒకరిద్దరితోనే మొదలవుతుంది. బలమైన సిద్ధాంతాన్ని పట్టుకుని ఉండడం, పట్టుకుని ఉన్న ఇన్ని లక్షల మందితో కలసి ఉండడం, వారిని కలిపి ఉంచడం. 2014లో ఏ మాత్రం రాజకీయ అనుభవం లేని ఆరు మంది రాష్ట్ర కార్యవర్గం, 150 మంది క్రియాశీలక కార్యకర్తలు, 2014 మార్చి 14 ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి రాజధానిలో జనసేనను ప్రారంభించాం. నేటికి 8 సంవత్సరాలు పూర్తి చేసుకుని 2022 మార్చ్ 14 నాటికి ఆరు మందితో ప్రారంభమైన రాష్ట్ర కార్యవర్గం ఈ రోజు 76 మందికి చేరింది. లీగల్, చేనేత, మత్స్యకార, ఐటీ,డాక్టర్స్, కార్యక్రమాల విభాగాల్లో 400 మందితో, జిల్లా కార్యవర్గం 330 మందితో, 416 మండలాల్లో మండలాధ్యక్షులతో, 13, 369 పంచాయితీల్లో 12, 200 పంచాయితీల్లో జనసైనికులు రేపు కార్యవర్గంగా మారబోతున్నారు. 150 మంది క్రియాశీలక కార్యకర్తలతో మొదలైన ప్రయాణం నేడు 5 లక్షల మంది దిశగా ముందుకు వెళ్తున్నాం. ఈ రోజున 3, 26,000 క్రియాశీలక కార్యకర్తలు పార్టీకి ఉన్నారు. ఎక్కడ 150 ఎక్కడ 3,26,000. ఈ మొత్తం సాధించడానికి ఎనిమిది సంవత్సరాల కాలం పట్టింది.

ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నాం:
2019 సార్వత్రిక ఎన్నికల్లో ఒక్క ఎమ్మెల్యే సీటు గెలుచుకున్నాం. ఆ వైసీపీ వాళ్లు పట్టుకెళ్లిన సీటు మనదే. 137 స్థానాల్లో పోటీ చేసి సరాసరి 7.24 శాతం ఓటు సాధించాం. పార్టీ గుర్తుల మీద జరిగే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి అది 27.4 శాతానికి పెరిగింది. పంచాయితీ ఎన్నికల్లో 60 శాతం మంది జనసేన మద్దతుతో బరిలో దిగారు. మనం సాధించింది 1209 సర్పంచులు, 1576 ఉప సర్పంచులు, 4456 వార్డు మెంబర్ల గెలుపు. రాష్ట్రవ్యాప్తంగా 2000 ఎంపీటీసీ స్థానాల్లో జనసేన అభ్యర్ధుల్ని బరిలో నిలిపింది. అందులో 180 గెలిచాం. 156 జెడ్పీటీసీ స్థానాల్లో నిలబెట్టి రెండు కైవసం చేసుకున్నాం. విశాఖ మున్సిపల్ కార్పోరేషన్ తో పాటు మిగతా మున్సిపాలిటీలకు పోటీ చేసి కార్పోరేటర్లుగా, వార్డు మెబర్లు గెలుచుకున్నాం. అందులో 28 శాతం ఓటు సాధించగలిగాం. పార్టీ సభ్యత్వం 46 లక్షలకు చేరకుంది. పక్క పార్టీలకు ఇది గొప్ప విజయంగా కనబడకపోవచ్చు. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ కాంగ్రెస్ పార్టీకి ఒక రూపం. ముఖ్యమంత్రి తండ్రి… సీనియర్ కాంగ్రెస్ నాయకులు. తెలుగుదేశం పార్టీ కూడా మూడున్నర దశాబ్దాలుగా ఉంది. జనసేనలో సీనియర్ నాయకులు ఎవరూ లేరు. అందుకే ఈ విజయాన్ని మనం బలంగా గుర్తు పెట్టుకోవాలి. ఎంత సింధువైనా బిందువుతోనే మొదలవుతుంది. ఒక మహా వృక్షమైనా చిన్న విత్తుతో మొదలవుతుంది. ముల్లోకాలను ఏలే వీరుడైనా అమ్మ కడుపు నుంచే పుట్టాలి. ఈ రోజున 7 శాతం నుంచి 27 శాతానికి.. రేపటి రోజున ఆ 27 శాతం ప్రభుత్వాన్ని స్థాపించే స్థాయికి చేరబోతున్నాం అని అన్నారు పవన్ కళ్యాణ్.

నాయకత్వం అంటే.. రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడడం:
ఇక్కడ జనసేనకు నాయకత్వం వహిస్తున్న పెద్దలందరూ నాయకత్వ లక్షణాలు ఎలా ఉండాలో చూపించారు. అత్యంత ప్రతికూల పరిస్థితుల్లోనే వ్యక్తుల తాలూకు వ్యక్తిత్వం బయటపడుతుంది. విజయం వచ్చినప్పుడు ఎలా ఉన్నామన్నది కాదు. అపజయం వచ్చినప్పుడు ఎలా నిలబడ్డాం అన్నదే ముఖ్యం. ఎంత డబ్బుంది.. ఎంత పేరుంది.. ఎంత అధికారం ఉంది అన్న దాని నుంచి నాయకత్వం రాదు. ఎంత ఒత్తిడిని తీసుకోగలం. ఎంత మందిని ప్రభావితం చేయగలం. ఎన్ని అవరోధాలు ఎదురైనా నిర్ధిష్ట లక్ష్యాన్ని చేరుకోగలవా లేదా అన్నదే ముఖ్యం. నాయకత్వం వహించడం అంటే తన సర్వస్వం పోగొట్టుకున్నా తను నమ్మకున్న వారిని గెలిపించడం. మనం ఆచరంచే నీతులే చెప్పడం. తలచిన మాట మీద నిబద్దత కలిగి ఉండడం. కాలక్రమంలో వచ్చే మార్పులకు నిన్ను నువ్వు పోగొట్టుకోకుండా ఎలా నిలబడ్డావు. మనల్ని ద్వేషించే శత్రువుల్ని కూడా ప్రేమించడమే నాయకత్వం. నాయకత్వం అంటే పట్టు విడుపు ఉండడం. నాయకత్వం అంటే ఎదుటి వాడి ఎదుగుదలని సౌభాగ్యాన్ని చూసి కుళ్లిపోకుండా ఉండడం. పక్క వారి ఆస్తులు దోచేయాలి అనుకోకపోవడం. రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడడం. ప్రాధమిక హక్కు అని అరవబోయే ముందు ప్రాథమిక బాధ్యత నిర్వర్తించామా లేదా చూసుకోవడం. మనం చేసే ప్రతి పని దేశ ప్రగతికి ఉపయోగపడుతుందా. సమాజ శ్రేయస్సుని కోరుకుంటునే దిశలో ఉందా లేదా ఆలోచించాలి.

చీకటి పాలన అంతమొందించే అవకాశం వచ్చింది:
క్రియాశీలక కార్యకర్తలుగా 150 మందితో మొదలై త్వరలో 5 లక్షలకు చేరుకోబోతున్నాం. ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి, చీకట్లలోకి వెళ్ల కూడదు అంటే అది ఈ 5 లక్షల మంది జనసేన క్రియాశీలక కార్యకర్తల చేతుల్లో ఉంది. మీ పోరాట పటిమ మీద, మీ గుండె నిబ్బరం మీద ఆధారపడి ఉంది. నేను నడిచి చూపిస్తా మీరు నడవండి. ఒక కొత్త తరం జాతికి నిర్ధేశం చేసే సమయం వచ్చింది. 1970ల్లో ఎమర్జెన్సీ సమయంలో దేశంలో రాజకీయ ఒడిదుడుకులు ఉన్నప్పుడు దేశానికి దిశానిర్ధేశం చేసే అవకాశం యువతకు వచ్చింది. అలాగే 2022లో ఈ చీకటి పాలనను అంతమొందించడానికి అవకాశం వచ్చింది. ఇలాంటి సామాజిక నిర్మాణం చేసే అవకాశం చాలా అరుదుగా దొరుకుతుంది. దాన్ని సద్వినియోగం చేసుకుందాం.

మీ ప్రాణాలకు నా ప్రాణం అడ్డువేస్తా:
జనసైనికులు లేకపోతే జనసేన లేదు. పవన్ కళ్యాణ్ లేడు. వీర మహిళలు లేకపోతే జనసేన లేదు. పవన్ కళ్యాణ్ ఉండడు. మీరందరూ ఉంటేనే మన నాయకులు ఉంటారు. చాలా సభల్లో నన్నడుగుతారు ఎంత సేపు ప్రశ్నించే పార్టీగా ఉండిపోతున్నామని. మనం అధికారం ఎప్పడు చేపడతాం అని. నేను ఒకటే చెబుతున్నా. ప్రశ్నించడం అంటే తేలిగ్గా తీసుకోకండి. ప్రశ్నించడం అంటే గుండె సత్తువ పెంచుకోవడం. ప్రశ్నించడం అంటే పోరాట స్ఫూర్తిని నింపుకోవడం. ప్రశ్నించడం అంటే మార్పుకి శ్రీకారం చుట్టడం. ప్రశ్నిచడం అంటే ఒక రాజ్యస్థాపన చేయడం ద్వారా సుపరిపాలన అందించడం. ప్రశ్నించడం అనేదాన్ని తేలిగ్గా తీసుకోకండి. చాలా బలమైన ఆయుధం అది. నేను పాటించనిది ఏదీ మిమ్మల్ని అడగను. నా వ్యక్తిగత ప్రయోజనాలకు మీ జీవితాలు తాకట్టు పెట్టను. మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేస్తాగానీ ఎప్పడూ మిమ్మల్ని వాడుకోను. 2014లో సూటిగా ప్రశ్నించాం. ప్రభుత్వాన్ని ఎదుర్కొన్నాం. 2019లో బలంగా పోరాటం చేశాం. బరిలో నిలబడి ఉన్నాం. 2024లో గట్టిగా నిలదొక్కుకుంటాం.. ప్రజా ప్రభుత్వాన్ని స్థాపిస్తాం. జై జనసేన.

వైసీపీ కార్యకర్తలూ.. శ్రద్ధగా వినండి:
మనం చేస్తుంది స్వకార్యం కాదు.. ప్రజా కార్యం అది రామకార్యంతో సమానం. రెండున్నరేళ్ల వైసీపీ పాలన గురించి మాట్లాడాలంటే.. మనం ఓడిపోయి కూర్చున్నప్పుడు వైసీపీకి 151 సీట్లొచ్చి ఒక్కొక్కరు మన ముందు తొడగొడుతూ ఉన్నారు. రెండున్నరేళ్ల వైసీపీ పాలన గురించి మాట్లాడబోయే ముందు ముఖ్యంగా జనసైనికులు, జనసేన పార్టీ, ప్రజలతో పాటు వైసీపీ నాయకులు, కార్యకర్తలు శ్రద్దగా ఆలోచించండి. నేను రాకముందే వైసీపీ నాయకులు మంత్రులు తిట్టడం మొదలు పెట్టారని తెలిసింది. అల్లంపల్లో వెల్లంపల్లో ఉన్నారు కదా. వెల్లుల్లిపాయ, బంతి, చామంతి, పూబంతి, గోడకు కొడితే తిరిగిరాని అవంతి. ఏవేవో మాట్లాడుతున్నరని అంటే నేను ఒకటే చెప్పాను. ఇంకా నేను మాట్లాడలేదు కాదా అన్నాను. వైసీపీలో మంచి నాయకులు కూడా ఉన్నారు. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు లాంటి పెద్దలు, మాగుంట శ్రీనివాసులరెడ్డి లాంటి వారు, మేకపాటి కుటుంబ సభ్యులు, ఆనం రామనారాయణ రెడ్డి లాంటి వారు ఉన్నారు. వారిని హర్ట్ చేయడం ఇష్టం లేదు. వైసీపీ కార్యకర్తలను హర్ట్ చేయడమూ ఇష్టం లేదు.. మీరంటే గౌరవం ఉంది. మీ నాయకత్వం151 సీట్లు గెలిస్తే ఎంత బాగా చేస్తారో అని ఎదురు చూశాను. వైసీపీ కార్యకర్తలు కూడా ఆలోచించండి. నాకు వైసీపీ నాయకత్వం పైన గాని, మంత్రుల పైన గాని వ్యక్తిగత ద్వేషాలు ఉండవు. నాకు పాలసీ పరమైన విబేధాలు మాత్రమే ఉంటాయి. ఇసుక పాలసీ సరిగా లేదని మాట్లాడుతాం తప్ప నేను వ్యక్తిగతంగా దాడి చేయను. అది నా తల్లిదండ్రులు నేర్పిన సంస్కారం. మీ నాయకత్వంలో రాష్ట్రం సుభిక్షంగా ఉంటే ఆనందించే వాడిని. ఒక్క మాట మాట్లాడే వాడిని కాదు. నిజంగా రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉంటే అంతకంటే కావాల్సిందేంటి. వైసీపీ కార్యకర్తలు కూడా ఆలోచించండి అని అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.

వైసీపీ అశుభంతో పరిపాలన మొదలు పెట్టింది:
ఏదైనా కొత్త ఇంట్లోకి వెళ్తే శుభంతో మొదలు పెడతారు. కొబ్బరికాయ కొట్టి దీపం వెలిగిస్తాం. కానీ మీ వైసీపీ ప్రభుత్వం కూల్చివేతతో అశుభంతో పరిపాలన మొదలు పెట్టింది. మూడు నెలలకే ఇసుక సమస్య వచ్చింది. ఇసుక పాలసీ రాకపోవడం వల్ల భవన నిర్మాణ కార్మికులు రోడ్డు మీద పడ్డారు. 30 లక్షల పైచిలుకు భవన నిర్మాణ రంగ కార్మికులు, అనుబంధ రంగాల వారి జీవితాలను మీరు ఒక్క ఇసుక పాలసీతో చిందరవందర చేశారు. 32 మంది నిండు ప్రాణాలను మీ నాయకత్వం బలిగొంది. దానికి మీ వైసీపీ కార్యకర్తలు ఏం సమాధానం చెబుతారు. ఇసుక పాలసీకి అసలు సమస్య ఏంటి అంటే ఇసుక కాంట్రాక్టు ఎవరికి ఇవ్వాలి. ఏ పాలసీ తెస్తే మా వైసీపీ నాయకులకు వేల కోట్లు వస్తాయనే ఆ పార్టీ నాయకుల ఆలోచనకు మూల్యమే 32 నిండు ప్రాణాలు. ఆడపడుచుల్ని మీరు విధవల్ని చేశారు గుర్తు పెట్టుకోండి. ఆ రోజు నుంచి వరుస క్రమంలో ఇప్పటి వరకు.. నిన్నటి మన సభకు ఆటంకం కలిగించేంత వరకు చూస్తే ఇంత విధ్వంసపూరితమైన ఆలోచనా విధానం ఏంటిరా బాబు అనిపిస్తుంది.

ఇది వైసీపీ వాళ్ల ప్రతిజ్ఞ:
అసలు వీరు రాజకీయాల్లోకి ఏమనుకుని వచ్చారు. రాజకీయాల్లోకి వస్తున్నారు అంటే సమాజం పట్ల ప్రేమ ఉంటే తప్ప రారు. నేను అలాగే వచ్చాను. నేను చిన్నప్పుడు ఒక ప్రతిజ్ఞ చదువుకున్నాను. శ్రీ పైడిమర్రి సుబ్బారావుగారు రాసిన ప్రతిజ్ఞ, భారత దేశం నా మాతృభూమి. భారతీయులందరూ నా సహోదరులు అని మనం ప్రతిజ్ఞ చేస్తే… రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించడానికి వైసీపీ నాయకులు కూడా బలమైన ప్రతిజ్ఞ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మా సొంత భూమి. ఆంధ్రులందరూ మా బానిసలు. రాజ్యాంగ స్ఫూర్తిని తుంగలో తొక్కుతాం. న్యాయ వ్యవస్థను లెక్కే చేయం. పోలీసులను ప్రైవేటు ఆర్మీగా వాడేస్తాం. ఉద్యోగులను ముప్ప తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తాం. నిరుద్యోగులకు మొండి చేయి చూపిస్తాం. రహదారులను గుంతలమయం చేస్తాం. ప్రజల వెన్నుముకలు విరగొడతాం. పెట్టుబడుల్లో 50 శాతం వాటా లాక్కుంటాం. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరి ఆర్ధిక మూలాలు దెబ్బకొడతాం. రైతులను అప్పుల ఊబిలోకి నెట్టేస్తాం. ఆత్మహత్యలు చేసుకుంటానంటే ప్రోత్సహిస్తాం. ఇసుకను అప్పడంలా నమిలేస్తాం. సహజ వనరులను శాంతానికి వాడేస్తాం. దేవతామూర్తుల విగ్రహాలను అపవిత్రం చేసిన వారిని గుండెల్లో పెట్టుకొని రక్షించుకుంటాం. గజం ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జా చేస్తాం. ప్రభుత్వం స్థలాలు, భవనాలను తాకట్టు పెడతాం. సంపూర్ణ మద్యపాన నిషేధం ద్వారా ప్రజలను చిత్తుగా తాగిస్తాం. వైసీపీ పార్టీ ఆదాయ వనరులను పెంచుకుంటాం. ఎవడైనా గొంతెత్తితే కేసులు పెట్టి లాఠీలతో చితక్కొడతాం. మా వైసీపీ ఎంపీ అయినా సరే. ఒక్క ఛాన్స్ ఇస్తే ఆంధ్రాను 25 ఏళ్లు వెనక్కి తీసుకుపోతాం. ఇంకొక ఛాన్స్ ఇస్తే స్కూలుకు వెళ్లే చిన్నపిల్లల చేతిలో చాక్లెట్లు లాక్కుంటాం. ఇదబ్బా వారి ప్రతిజ్ఞ అని సెటైరికల్ గా చెప్పారు పవన్ కళ్యాణ్.

ముఖ్యమంత్రి మారినప్పుడల్లా పాలసీలు మారవు:
అమరావతే ఆంధ్రప్రదేశ్ రాజధాని అని అందరూ ఒప్పుకున్నారు. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న జగన్ రెడ్డి కూడా ఒప్పుకున్నారు. ఇప్పుడేమో మూడు రాజధానులు అంటున్నారు. అలాగే గత ప్రభుత్వం చేసుకున్న పీపీఎస్ ఒప్పందాలను కూడా రద్దు చేశారు. గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలతో మాకు సంబంధం లేదంటే ఎలా? గవర్నమెంట్ అంటే కంట్యూనిటీ
ఆఫ్ పాలసీ. రాజు మారినప్పుడల్లా రాజధాని మార్చడం, ముఖ్యమంత్రి మారినప్పుడల్లా పాలసీలు మార్చడం సరికాదు. గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాల్లో తప్పొప్పులు ఉంటే సరిచేయాలి తప్ప. మేము చేయం అంటే కుదరదు. ఒప్పందాలపై సంతకాలు పెట్టుకున్న తరువాత దానిని మనం పాటించకపోతే చట్టసభల్లో కూర్చునే అర్హత లేదని సర్ధార్ వల్లభాయ్ పటేల్ గారి మాటలను మనందరం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలని అన్నారు పవన్ కళ్యాణ్.

ఆ రోజు గాడిదలు కాస్తున్నారా?:
ఆ రోజు పెనుమాక, ఉండవల్లి రైతులు రాజధాని కోసం భూములు ఇవ్వడానికి ఇష్టపడకపోతే వారికి అండగా నిలబడ్డాను. నేను మద్దతు ఇచ్చి గెలిపించిన ప్రభుత్వాన్నే ప్రశ్నించాను. అంచెలంచెలుగా రాజధానిని నిర్మించండి అని చెప్పాను. నేను మద్దతు ఇచ్చిన ప్రభుత్వంపైనే గొంతెత్తినప్పుడు. ఆ రోజు మూడు రాజధానులు కావాలని వైసీపీ నాయకులు ఎందుకు మాట్లాడలేదు. గాడిదలు కాస్తున్నారా? ఆ రోజు మీ బుర్ర బుద్ది ఏమైంది? ఆ రోజు వాళ్లమ్మాయి పెళ్లైన పిలిచిన రాంబో రాంబాబు అయినా పక్కకు పలిచి మూడు రాజధానులు మాకు ఇష్టంలేదని చెప్పొచ్చు కదా. ఆ రోజు ముఖ్యమంత్రి అయితే 32 వేల ఎకరాలు కాదు ఇంకో వెయ్యి ఎకరాలు కావాలన్నారు. ఇప్పుడేమయ్యాయి ఆ మాటలు. రాజధానికి భూములు ఇచ్చిన రైతుల్లో 32 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీలే. రూ. 3వేల కోట్లు పై చిలుకు ఖర్చుపెట్టాక ఇప్పుడు మారుస్తామంటే ఎవడబ్బా సొత్తు అది. ప్రశ్నించేవాడు లేకపోతే ఏదైనా చేస్తారా? ఈ రోజు అమరావతి రైతులకు చెబుతున్నాను. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతే. మీ మీద పడ్డ ప్రతి లాఠీ దెబ్బ నా మీద పడ్డట్టే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుంచి రాజధాని కదలదు. చట్టసభల్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకోకపోతే మీ మాట ఎందుకు వినాలని అందరూ ప్రశ్నించండి.

న్యాయ వ్యవస్థను శాసించే హక్కు మీకు లేదు:
అమరావతి నేపథ్యంలో న్యాయ వ్యవస్థనే తప్పు పట్టే స్థాయికి వైసీపీ ప్రభుత్వం వెళ్లింది. మీరు చేసిన చట్టాలనే మీరే పాటించనప్పుడు న్యాయ వ్యవస్థను శాసించే హక్కు మీకే లేదు. వైసీపీ నాయకులు కొందరు ఎంత ఒళ్లు పొగరుగా మాట్లాడుతున్నారంటే… హైకోర్టు ఒక పార్టీ బ్రాంచ్ ఆఫీసుగా మారిందని కామెంట్ చేస్తున్నారు. సోషల్ మీడియా, అమెరికాలో కూర్చొని బూతులు తిట్టించడం. ఏ స్థాయిని వెళ్లిపోయారంటే న్యాయమూర్తుల జీవితాల్లో వెళ్లి తిడుతున్నారు. క్రిమినల్స్ రాజకీయాలు ఏలితే ఇలానే ఉంటుంది. ఈ తప్పును మనందరం కలిపి చేశాం.

వేకెన్సీ రిజర్వ్ లోకి పంపుతారని భయపడుతున్నారు:
పోలీస్ వ్యవస్థను కూడా నలిపేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ తీరుతో ముగ్గురు ఐఏఎస్ అధికారులు కోర్టుల్లో నిలబడి రూల్ బుక్ చదవాల్సి వచ్చింది. వెల్లంపల్లి వెల్లుల్లిపాయకి, అవంతి బంతి చామంతిలకు ఒక ఐఏఎస్ అధికారికి ఉన్న నాలెడ్జ్ ఉంటుందా? మన కర్మ కాకపోతే వీళ్లు మంత్రులయ్యారు. వాళ్లను శాసిస్తున్నారు. అన్ని పనులకు పోలీసులను వాడుకొని వారిని చెడ్డవాళ్లగా చిత్రీకరించారు. జీతభత్యాలు కాదు కదా కరవు భత్యం కూడా ఇవ్వలేదు. అధికారంలోకి వస్తే వారంతరపు సెలవు అన్నారు. వీళ్లు చేసే తప్పుడు పనులకు ఇంకా పని భారం పెరుగుతుంది. 12 గంటల డ్యూటీ కాస్త 24 గంటలైంది. మనం పోలీస్ కానిస్టేబుల్ చొక్కా పట్టుకోగలమా? వైసీపీ నాయకులకు ఆ భయం లేదు. సి.ఐ. ర్యాంకు అధికారిని అయినా చొక్కా పట్టుకుంటారు. చిత్తూరులో ఒక సీఐను కాలర్ పట్టుకున్నారు. విశాఖలో అయితే ఒక మంత్రి చొక్కా విప్పి కొడతామని బెదిరించాడు. కృష్టలంక స్టేషన్ లో ఒక ఎంపీ కానిస్టేబుల్ పై చేయి చేసుకున్నాడు. ఒక్క సంతకం పెడితే జీవితాలు తారుమారవుతాయని భయపడే స్థాయికి పోలీస్ శాఖను తీసకొచ్చారు. ఎదురుతిరిగితే వెకెన్సీ రిజర్వ్ లోకి పంపిస్తారని భయపడుతున్నారు. వేకెన్సీ రిజర్వ్ కు పంపిస్తే జీతాలు ఉండవు. ఇప్పటికే చాలా మంది అధికారులను వేకెన్సీ రిజర్వ్ లోని పంపించారు. పోలీస్ శాఖలో 14వేల 340 ఉద్యోగాలు నియమిస్తామని చెప్పి… ఈ రోజుకి నామ్ కే వాస్తే 400 ఉద్యోగాలు ఇచ్చారు.

రంగులకు ఉన్న డబ్బులు ఫిట్మెంట్ కు లేవా?:
అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తామని ప్రకటించారు. ఇప్పుడేమో విషయ పరిజ్ఞానం లేక ఆ హామీ ఇచ్చారని అంటున్నారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తామని వారి నమ్మకాన్ని సంపాధించి అధికారంలోకి వచ్చాక మెండి చేయి చూపించడం సబబు కాదు. రాజ్యాన్ని ఏలాలి అనుకునేటప్పుడు బాధ్యతతో మాట్లాడాలి. నా వద్దకు ఉద్యోగులు వచ్చినప్పుడు దీనిపై నాకు అవగాహన లేదు. అనుభవజ్ఞులతో మాట్లాడి చెబుతాను అని చెప్పాను. మీ దగ్గర అంతమంది సలహాదారులు ఉన్నారు కదా మీరెందుకు అవగాహన లేకుండా మాటిచ్చారు. ఆ రోజు పొరపాటు చేసి ఉంటే ఎందుకు క్షమించమని అడగరు. ప్రభుత్వ కార్యాలయాలకు మీ పార్టీ రంగులు వేయడానికి రూ. 3వేల కోట్లు, పేపర్లలో ప్రకటనలకు రూ. 400 కోట్లు వృథా చేశారు. వీటన్నింటికి బదులు ఉద్యోగులకు ఫిట్ మెంట్ ఇవ్వొచ్చు కదా? వేతన సవరణ అంటే జీతాలు పెరుగుతాయని అనుకుంటారు. వైసీపీ పాలనలో మాత్రం జీతాలు తగ్గాయని మండిపడ్డారు పవన్ కళ్యాణ్.

8వేల మంది చనిపోయారు:
వైసీపీ నాయకుల మాటలకు అర్ధాలే వేరు. వాళ్లు పెంచుతామంటే తగ్గిస్తామని అర్ధం. మధ్యపాన నిషేధం అంటే ప్రోత్సహిస్తామని అర్ధం. మద్యంపై తెలంగాణ ఆదాయం రూ. 99వేల 900 కోట్లు అయితే మన ఆంధ్రప్రదేశ్ ఆదాయం లక్షా 17వేల 130 కోట్లు. డబ్బు సంపాదన ఉంది కానీ ఎక్కడికి వెళ్తుందో ఎవరీకి తెలియదు. అడిగేవాడు లేడు. రహదారులు గుంతలమయం. గతంతో పోల్చుకుంటే 10 శాతం యాక్సిడెంట్లు పెరిగాయి. 14 శాతం చావులు పెరిగాయి. తీవ్రంగా గాయపడిన వారు 7.94 శాతం పెరిగింది. 2021 లెక్కల ప్రకారం 13 జిల్లాలకు కలిపి ప్రమాదాల్లో 19,729 ప్రమాదాలు జరిగితే 21,169 మందికి తీవ్ర గాయాలయ్యాయి. 8553 మంది చనిపోయారు. ఇదంతా కేవలం రోడ్లు వేయకపోవడం వల్ల జరిగిన నష్టం.

ఏపీని అప్పుల్లోకి నెట్లేశారు:
రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారు. దాదాపు రూ. 7 లక్షల కోట్లు అప్పు ఉంది రాష్ట్రానికి. అప్పు తీర్చడం కాదు కదా వడ్డీలు కూడా కట్టలేని స్థితికి వెళ్లిపోయారు. లక్ష కోట్ల ఆదాయం ఉండి కూడా సద్వినియోగం చేసుకోలేకపోయారు. యువతకు ఉద్యోగాలు లేవు. ఉద్యోగులకు జీతాలు పెరగడం లేదు. పెన్షన్లు తగ్గించారు. కరెంటు బిల్లులు పెంచారు. అమ్మఒడి డబ్బులు ఆగిపోయాయి. ఆరోగ్య శ్రీ పథకాన్ని మంచమెక్కించేశారు. పరిశ్రమలను రాష్ట్రం నుంచి పంపించేసి పెట్టుబడులను చంపేశారు. వేలాది మందికి ఉపాధి కల్పించే అమర్ రాజా బ్యాటరీస్ వంటి సంస్థ వెళ్లిపోయేలా చేశారు. కియా అనుబంధ సంస్థ వైసీపీ నాయకుల గొడవ వల్ల వెళ్లిపోయింది. గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలు ఉల్లంఘిస్తే రాష్ట్రానికి పెట్టుబడులు రావని, తద్వారా ఉపాధి అవకాశాలు కోల్పోతారని జపనీస్ రాయబారి చెప్పినా బుర్రకు ఎక్కించుకోలేదు.

అప్పుల్లేని రాష్ట్రంగా చూసేందుకు షణ్ముఖ వ్యూహం:
ఆంధ్రప్రదేశ్ ని అప్పుల్లేని రాష్ట్రంగా చేయాలన్నదే జనసేన పార్టీ లక్ష్యం. అందుకోసం జనసేన పార్టీ ప్రభుత్వం షణ్ముఖ వ్యూహం అనుసరించనుంది. జనసేన పార్టీ అధికారంలోకి రాగానే బలమైన పారిశ్రామిక విధానాన్ని తీసుకువస్తాం. విశాఖ, విజయవాడ నగరాలను హైటెక్ నగరాలుగా తీర్చిదిద్దుతాం. అమరావతిని అభ్యుదయ రాజధానిగా రూపొందిస్తాం. కర్నూలు జిల్లాకు శ్రీ దామోదరం సంజీవయ్య గారి పేరు పెడతాం. రాయలసీమలో ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తాం. తెల్ల రేషన్ కార్డు దారులందరికీ ఇళ్ల నిర్మాణానికి ఇసుకను ఉచితంగా అందిస్తాం. సులభ్ కాంప్లెక్సుల్లో పని చేసే ఉద్యోగాలు కాకుండా మీ కాళ్ల మీద మీరు నిలబడగలిగేలా ఉపాధి కల్పించి వారికి ప్రభుత్వం తరఫున రూ. 10 లక్షలు అందిస్తాం. వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తాం. వ్యవసాయ ఉత్పత్తుల ఆధారంగా ఆయా ప్రాంతాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తాం. పంట కాల్వలు నిర్మిస్తాం. జనసేన పార్టీ అధికారంలోకి రాగానే నిరుద్యోగ సమస్యను తీరుస్తాం. ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేస్తాం. ప్రైవేటు రంగంలో ఏటా 5 లక్షల ఉద్యగ అవకాశాలు కల్పిస్తాం. ఉద్యోగులకు సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని తీసుకువస్తాం. దీనిపై ఇప్పటికే కేంద్రంలోని పెద్దలతో చర్చించాం. ప్రతి ఒక్క సామాజికవర్గానికీ జనసేన పార్టీ అండగా నిలుస్తుంది అని అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.