ఎంతో సంతోషంతో నిశ్చితార్థం వేడుకలకు అనంతపురం జిల్లా ధర్మవరం నుంచి తిరుచానూరుకు వెళుతున్న బృందం ప్రమాదానికి గురై ఎనిమిదిమంది ప్రాణాలు కోల్పోవడం, మరో 54 మంది తీవ్రంగా గాయపడడం మనసును తీవ్రంగా కలచి వేసిందని అన్నారు జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్. గాయపడినవారిలో కొందరి పరిస్థితి ఆందోళకరంగా ఉండడం మరింత విషాదకరం. శనివారం రాత్రివేళ చిత్తూరు జిల్లా భాకరాపేట ఘాట్ రోడ్డులో పెళ్లి బృందం ప్రయాణిస్తున్న ప్రైవేట్ బస్సు లోయలోకి బోల్తా కొట్టి ప్రమాదం సంభవించగా… చాలా సేపటి వరకు ఈ ప్రమాదాన్ని ఎవరూ గుర్తించలేదని తెలిసి భాద అనిపించింది.
ఆ సమయంలో సహాయం అందక క్షతగాత్రులు ఎంత వేదన అనుభవించారో ఊహిస్తేనే గుండె భారంగా మారుతోంది. బస్సు అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. ఇది దురదృష్టకరం. ఇటువంటి బస్సుల యాజమాన్యంపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి, లేనిపక్షంలో మరిన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. బస్సులకు స్పీడ్ కంట్రోల్స్ ను తక్షణం అమర్చే చర్యలు చేపట్టాలి. ఘాట్ రోడ్లలో రక్షణ గోడలను పటిష్టపరచాలి. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు, గాయపడినవారికి తగినంత నష్టపరిహారాన్ని రాష్ట్రప్రభుత్వం అందివ్వాలి. గాయపడినవారికి మెరుగైన వైద్యం అందించాలి. ఈ ప్రమాదంలో అశువులు బాసిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలి. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను అని అన్నారు పవన్ కళ్యాణ్.