JanaSena: పొత్తులపై పవన్ శపథం

ఏపీలో ప్రజా ప్రభుత్వాన్ని 2024లో స్థాపించే దిశగా పనిచేయాలని జనసేనాని దిశానిర్దేశం చేశాడు. బీజేపీ ఇచ్చే రోడ్ మాప్ కు అనుగుణంగా నడుచుకుంటామని తేల్చి చెప్పాడు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా నిర్ణయాలు ఉంటాయని పరోక్షంగా పొత్తుల గురించి పవన్ శపథం చేసాడు.

Published By: HashtagU Telugu Desk
jansena

janasena

ఏపీలో ప్రజా ప్రభుత్వాన్ని 2024లో స్థాపించే దిశగా పనిచేయాలని జనసేనాని దిశానిర్దేశం చేశాడు. బీజేపీ ఇచ్చే రోడ్ మాప్ కు అనుగుణంగా నడుచుకుంటామని తేల్చి చెప్పాడు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా నిర్ణయాలు ఉంటాయని పరోక్షంగా పొత్తుల గురించి పవన్ శపథం చేసాడు. దాదాపు రెండు గంటలు జనసేనాని చేసిన ప్రసంగంలో జగన్ సర్కార్ మీద గంటకుపైగా ఆక్రోశం వెళ్లగక్కాడు. వ్యక్తిగతంగా ఎలాంటి ద్వేషం లేదంటూనే వైసీపీ అధికార మదాన్ని దించుతానంటూ జగన్ పై పరోక్షంగా ఘాటుగా హెచ్చరించాడు.
వైసీపీ నేతలు అంబటి రాంబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి పేర్లను ప్రస్తావిస్తూ కులాలు గురించి హితబోధ చేసాడు. రెండున్నర ఏళ్ల జగన్ పాలన ప్రజా వేదిక కూల్చి వేతతో ప్రారంభం అయిన విషయాన్ని గుర్తు చేసాడు. ఆనాటి నుంచి వ్యవస్థలను జగన్ ఎలా కూల్చాడో తనదైన పంథాలో ఏకిపారేశాడు. జై తెలంగాణ జై ఆంధ్రా, జై భారత్ అంటూ ఆవిర్భావ సభ స్పీచ్ ప్రారంభించి ఉభయ రాష్ట్రాల్లోని పార్టీ అధిపతులకు నమస్కారాలు చెప్తూ వైసిపి చీఫ్ జగన్ కు కూడా నమస్కారం చేయటం తన సంస్కారం అంటూ జగన్ సర్కార్ పై గంటన్నర పాటు నిప్పులు చెరిగాడు. ఇసుక, మద్యం,ఇళ్ల స్థలాలు, సీపీఎస్ తదితరాలు గురించి ప్రస్తావించాడు.
రాష్ట్రం 7 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్న విషయాన్ని చెబుతూ అధికారం ఇస్తే అప్పుల్లేని రాష్ట్రం గా మారుస్తామని హామీ ఇచ్చాడు. తెల్ల కార్డ్ ఉన్న వాళ్లకు ఇసుక ఫ్రీ చేస్తానని ప్రామిస్ చేసాడు. సీపీఎస్ రద్దు చేయటం ఖాయమని హామీ ఇచ్చాడు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయడంతో పాటు నిరుద్యోగులకు 10లక్షల సహాయం చేస్తామని ప్రమాణం చేసాడు. రైతులకు గిట్టుబాటు ధర, ఉద్యోగులకు పీఆర్స్ అమలు చేస్తాను అని భరోసా ఇచ్చాడు.
అమరావతి రాజధాని గా ఉంటుందని శపథం చేసాడు. విశాఖను విశ్వ నగరం గా, విజయవాడ, తిరుపతి ని హైటెక్ నగరాలు గా తయారు చేస్తాను అని హామీ ఇచ్చాడు. వచ్చే ఎన్నికల్లో రాజ్యాధికారం లక్ష్యంగా పని చేయాలి అని జనసైనికులకు పవన్ పిలుపు ఇచ్చాడు.
జగన్ సర్కార్ ప్రజా వ్యతిరేక పాలనపై చేసిన పోరాటాలను అవలోకనం చేసాడు. రాష్ట్రంలోని జగన్ ప్రభుత్వ గుండాయిజం గురించి వివరించారు. భయపడకుండా పని చేయాలి అని ఆదేశించాడు. వైసీపీ వ్యతిరేక శక్తులను కూడ గడతామని చెప్తూ బీజేపీ రోడ్ మాప్ కోసం చూస్తున్నామని ముక్తాయించటం పవన్ స్పీచ్ లోని కొస మెరుపు.

  Last Updated: 14 Mar 2022, 09:21 PM IST