భారతదేశ చరిత్రలో చిరంతనంగా నిలిచిపోయే మహానుభావుడు భారతరత్న శ్రీ బి. ఆర్.అంబేడ్కర్ గారు. ఈ దేశానికి దిశానిర్దేశం చేసిన ఆ జ్ఞాన సంపన్నుడి 131వ జయంతి సందర్భంగా నా పక్షాన, జనసేన పార్టీ పక్షాన ఆయనకు ప్రణామాలు అర్పిస్తున్నాను. శ్రీ అంబేడ్కర్ అందరివాడు. నిత్య ఆరాధనీయుడు. ఈనాడు మన దేశం ఆర్థికంగా, సామాజికంగా వర్ధిల్లుతుందంటే అందుకు కారణం శ్రీ అంబేడ్కర్ ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న పటిష్టమైన రాజ్యాంగమే.
ప్రపంచ గొప్ప మేధావులలో ఒకరిగా, ప్రపంచానికే స్ఫూర్తిప్రదాతగా నిలిచిన శ్రీ అంబేడ్కర్ భారతీయునిగా జన్మించడం భారతీయులు చేసుకున్న అదృష్టం. లండన్ లో శ్రీ అంబేడ్కర్ నివసించిన గృహాన్ని, లక్నోలో ఆయన పేరిట ఏర్పాటైన స్మారక మందిరాన్ని సందర్శించినప్పుడు నేను పొందిన అనుభూతి మాటలలో చెప్పలేను. ఈ దేశంలోని సంపద, విజ్ఞానం, సామాజిక న్యాయం, అందరికీ సమానంగా అందాలని శ్రీ అంబేడ్కర్ ప్రవచించిన ఆదేశిక సూత్రాలకు అనుగుణంగానే జనసేన పార్టీ ఆవిర్భవించింది. ఆయన చూపిన మార్గాన్ని సదా అనుసరిస్తూ నాదైన సేవను ఈ దేశ ప్రజలకు అందచేస్తానని ఈ పుణ్యదినం సందర్భంగా పునరుద్ఘాటిస్తూ ఆయనకు జేజేలు పలుకుతున్నాను.