TDP Presentation : నిప్పులాంటి నిజాలు బయటపెట్టిన టీడీపీ.. పట్టాభి పవర్ ఫుల్ ప్రజెంటేషన్

TDP Presentation : ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు, దానికి సంబంధించిన  ఒప్పందాలపై టీడీపీ సీనియర్ నేత కొమ్మారెడ్డి పట్టాభి సవివరమైన ప్రజెంటేషన్ ను ఇచ్చారు.

  • Written By:
  • Publish Date - September 15, 2023 / 12:00 PM IST

TDP Presentation : ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు, దానికి సంబంధించిన  ఒప్పందాలపై టీడీపీ సీనియర్ నేత కొమ్మారెడ్డి పట్టాభి సవివరమైన ప్రజెంటేషన్ ను ఇచ్చారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది రాష్ట్ర యువత పురోగతి కోసం చంద్రబాబు పడిన తాపత్రయం నుంచి ఆవిర్భవించిందని చెప్పారు. సీమెన్స్ సాఫ్ట్ వేర్ కంపెనీపై వైఎస్సార్ సీపీ, సీఐడీ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవికత లేదని పట్టాభి స్పష్టంచేశారు. ‘‘సీమెన్స్ ఇండియాకు అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి ఉంది. అది వివిధ రంగాల  కంపెనీలకు సాఫ్ట్ వేర్ లను తయారు చేసి అందిస్తుంటుంది. దానికి  నిపుణులైన మానవ వనరులు కావాలి. ఆ మానవ వనరులను క్రియేట్ చేసుకునే క్రమంలోనే ఏపీ ప్రభుత్వాన్ని సీమెన్స్ సంప్రదించింది. సీమెన్స్ ఉన్నతాధికారులు చంద్రబాబును కలిసి ఆసక్తిని చూపడం వల్లే ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటైంది’’ అని ఆయన వివరించారు. రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదిరిన విషయం సీమెన్స్ కంపెనీకే తెలియదని వైఎస్సార్ సీపీ చేస్తున్న ఆరోపణలన్నీ పచ్చి అబద్ధాలు అని పట్టాభి స్పష్టం చేశారు.

సీమెన్స్ ఉన్నతాధికారుల పర్యవేక్షణలోనే ఒప్పందం.. 

‘‘సీమెన్స్ కంపెనీ సౌత్ ఈస్ట్ ఆసియా ఉన్నతాధికారి పీట్ క్యారియర్ నుంచి ఈ ఒప్పందానికి అప్రూవల్ వచ్చింది. ఆయన స్వయంగా ఆనాటి రాష్ట్ర ప్రభుత్వానికి మెయిల్స్ పంపారు. దానికి ఆధారాలు ఉన్నాయి.  సీమెన్స్ కంపెనీకి తెలియకుండా ఈ డీల్ జరిగిందని అనడం సరికాదు. సీమెన్స్ ఇండియా ఉన్నతాధికారి సునీల్ మాధుర్ వచ్చి చంద్రబాబుతోనూ భేటీ అయ్యారు’’ అని ఆయన గుర్తు చేశారు.  ‘‘స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రాజెక్టు అమలులో డిజైన్ టెక్ కంపెనీ కూడా భాగస్వామిగా ఉంది. ఆ కంపెనీ ఉన్నతాధికారి వికాస్ కన్విల్కర్ కూడా నాటి రాష్ట్ర సర్కారుకు అంగీకారం తెలిపే మెయిల్స్ పంపారు. అధికారికంగానే ఒప్పందాలు జరిగాయి. ఇందులో దాగుడుమూతలు ఏమీలేవు’’ అంటూ పట్టాభి రుజువులను మీడియాకు చూపించారు. ‘‘ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కోసం సీమెన్స్ వాళ్లు 90 శాతం వాటా.. రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం గ్రాంట్ సమకూరుస్తారనే  ప్రస్తావన ఒప్పంద పత్రాల్లో స్పష్టంగా ఉంది. అమెరికాలోని చాలా యూనివర్సిటీలకు సీమెన్స్ కంపెనీ స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టుల కోసం వందల కోట్ల గ్రాంట్లు ఇచ్చింది. అదే క్రమంలో ఆనాడు చంద్రబాబు చొరవతో ఏపీకి సైతం గ్రాంట్స్ ను మంజూరు చేసింది’’ అని ఆయన తెలిపారు. ‘‘స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా శిక్షణ కార్యక్రమాల నిర్వహణలో సీమెన్స్, డిజైన్ టెక్ సంస్థలు కలిసి పనిచేస్తాయని ఆనాడు చంద్రబాబు హయాంలో క్యాబినెట్ మీటింగ్ లో నిర్ణయాలు తీసుకున్నారు. ఆ తర్వాత రిలీజ్ చేసిన జీవో నంబర్ 4లో కూడా సీమెన్స్ వాళ్లు 90 శాతం వాటా.. రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం గ్రాంట్ ఇస్తారనే విషయాన్ని ప్రస్తావించాం. జగన్ మీడియా ఈ వివరాలను ప్రపంచానికి చూపించడం లేదు’’ అని పట్టాభి (TDP Presentation) మండిపడ్డారు.

Also read : Kapu Community Reaction : టిడిపి తో జనసేన పొత్తు ఫై కాపు సామాజిక వర్గం రియాక్షన్ ఏంటి..?

వైఎస్సార్ కూడా గంటా సుబ్బారావుకు పదవులిచ్చారు

‘‘గంటా సుబ్బారావుకు నాలుగు పదవులు ఎందుకు ఇచ్చారని అడగడం సబబు కాదు.. ప్రపంచంలోనే పేరుగాంచిన ఐటీ ప్రొఫెషనల్ గంటా సుబ్బారాకు పదవులు ఇవ్వడంలో తప్పేం లేదు.  దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా గంటా సుబ్బారావుకు పదవులిచ్చారు. స్పెషల్ సెక్రటరీ టు చీఫ్ మినిస్టర్ పదవిని కూడా గంటా సుబ్బారావుకు ఇచ్చారు.దీనికి వైఎస్సార్ సీపీ నేతలు సమాధానం చెప్పాలి. అర్హత ఉన్నందు వల్లే గంటా సుబ్బారావుకు పదవుల కేటాయింపు జరిగింది’’ అని టీడీపీ నేత పట్టాభి స్పష్టం చేశారు.

ప్రేమ్ చంద్రారెడ్డి, అజయ్ కల్లాం రెడ్డి, అజయ్ జైన్, షంషేర్ రావత్ సంగతేంటి ?

‘‘2015 డిసెంబరు 4న ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున  సీమెన్స్ తో అగ్రిమెంట్ కుదుర్చుకున్న ఉన్నతాధికారి ప్రేమ్ చంద్రారెడ్డి ని జగన్ సర్కారు ఎందుకు ప్రశ్నించడం లేదు. అజయ్ కల్లాం రెడ్డి, అజయ్ జైన్, షంషేర్ రావత్ వంటి పెద్దపెద్ద అధికారులు కూడా ఆనాడు స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కు సంబంధించిన ఒప్పందాల్లో కీలక పాత్ర పోషించారు. వారంతా ఇప్పుడు జగన్ సర్కారులో కీలక స్థానాల్లో ఉన్నారు. వారిని ఎందుకు ప్రశ్నించడం లేదు’’ అని పట్టాభి ప్రశ్నలు లేవనెత్తారు.