ఐపీఎల్ 15వ సీజన్‌లో పరుగుల వరద పారుతోంది. అంచనాలు పెట్టుకున్న బ్యాటర్లే కాదు బౌలర్లు కూడా బ్యాట్‌తో విరుచుకుపడుతున్నారు. పుణే వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ పేసర్ పాట్ కమ్మిన్స్ విధ్వంసకర బ్యాటింగే దీనికి ఉదాహరణ. కమ్మిన్స్ మెరుపు హాఫ్ సెంచరీతో ముంబైకి హ్యాట్రిక్ ఓటమి తప్పలేదు. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇన్నింగ్స్ పడుతూ లేస్తూ సాగింది. రోహిత్ శర్మతో పాటు ఇషాన్ కిషన్ మరోసారి నిరాశపరిచారు.
బేబీ ఏబీడీగా పిలుస్తున్న బ్రెవిస్ తొలి మ్యాచ్‌లోనే ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. 19 బంతుల్లో 29 పరుగులు చేయగా.. చివర్లో సూర్యకుమార్ యాదవ్ మెరుపు ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. సూర్యకుమార్ 36 బంతుల్లో 52 రన్స్ చేయగా.. తిలక్ వర్మ 27 బంతుల్లో 38, పొల్లార్డ్ 5 బంతుల్లో 22 పరుగులతో సత్తా చాటారు. దీంతో ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 161 పరుగులు చేసింది. నిజానికి 15వ ఓవర్ వరకూ అసలు ముంబై స్కోర్ 120 కూడా దాటుతుందా అనిపించింది. సూర్యకుమార్‌తో పాటు తిలక్ వర్మ, పొల్లార్డ్ ఆడకుంటే ఈ స్కోర్ వచ్చేది కాదు. అటు ముంబై బౌలర్లలో కమ్మిన్స్ 2, ఉమేశ్ యాదవ్ 1 , చక్రవర్తి 1 వికెట్ పడగొట్టారు.
162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా కూడా వేగంగా ఆడలేకపోయింది.రహానే, శ్రేయాస్ అయ్యర్, శామ్ బిల్లింగ్స్ తక్కువ పరుగులకే ఔటయ్యారు. వెంకటేశ్ అయ్యర్ క్రీజులో ఉన్నా సాధించాల్సిన రన్‌రేట్ ఎక్కువగా ఉండడంతో ముంబై గెలుస్తుందనిపించింది. దీనికి తోడు రస్సెల్ కూడా 5 బంతుల్లో 11 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ దశలో కోల్‌కతా ఓటమి ఖాయమైపోయినట్టేనని భావించగా… కమ్మిన్స్ రాకతో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. విధ్వంసకర బ్యాటింగ్‌తో అనూహ్యంగా రెచ్చిపోయిన కమ్మిన్స్ మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చేశాడు. బుమ్రా, డానియల్ శామ్స్ బౌలింగ్‌ను ఉతికారేశాడు. కేవలం 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో కోల్‌కతా 16 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. డానియల్ శామ్స్ వేసిన 16వ ఓవర్లో కమ్మిన్స్ అభిమానులకు సిక్సర్ల ఫీస్ట్ చూపించాడు. ఏకంగా 35 రన్స్ బాదేశాడు. ముంబై బౌలర్లతో పాటు కెప్టెన్ రోహిత్‌శర్మ కమ్మిన్స్ ఇన్నింగ్స్‌కు షాక్ అయ్యారు. పాక్ టూర్ నుంచి నేరుగా ఐపీఎల్ ఆడేందుకు వచ్చిన కమ్మిన్స్ బౌలింగ్‌లో 2 వికెట్లు తీసినా భారీగానే పరుగులు ఇచ్చాడు. అయితే బ్యాట్‌తో విధ్వంసం సృష్టించి కోల్‌కతాను గెలిపించాడు. ఈ సీజన్‌లో ముంబైకి ఇది వరుసగా మూడో ఓటమి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆ జట్టు కింది నుంచి రెండో స్థానంలో కొనసాగుతోంది.
Photo Courtesy: IPL/Twitter
WHAT. A. KNOCK 🔥#KKRHaiTaiyaar #KKRvMI #IPL2022pic.twitter.com/RmLZjZdzl3
— KolkataKnightRiders (@KKRiders) April 6, 2022