India 2nd Test: ఇక గెలుపు లాంఛనమే

పింక్ బాల్ టెస్టులో రెండోరోజూ భారత్ ఆధిపత్యం కొనసాగింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అదరగొట్టిన రోహిత్‌సేన ఇక విజయాన్ని అందుకోవడమే లాంఛనమే.

  • Written By:
  • Updated On - March 13, 2022 / 10:13 PM IST

పింక్ బాల్ టెస్టులో రెండోరోజూ భారత్ ఆధిపత్యం కొనసాగింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అదరగొట్టిన రోహిత్‌సేన ఇక విజయాన్ని అందుకోవడమే లాంఛనమే. 86 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ కొనసాగించిన లంక ఆలౌటయ్యేందుకు ఎంతోసేపు పట్టలేదు. మరో 23 పరుగులు చేసి మిగిలిన 4 వికెట్లు చేజార్చుకుంది. లంక 109 పరుగులకే కుప్పకూలడంతో భారత్‌కు 143 పరుగుల భారీ ఆధిక్యం దక్కింది. లంక ఇన్నింగ్స్‌లో మాథ్యూస్ 43 రన్స్‌తో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత పేసర్ బుమ్రా 5 వికెట్లతో లంక పతనాన్ని శాసించాడు. షమీ 2, అశ్విన్ 2 , అక్షర్ పటేల్ 1 వికెట్ పడగొట్టారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ దూకుడుగానే ఆడింది. ఓపెనర్లు తొలి వికెట్‌కు 42 పరుగులు జోడించగా… మయాంక్ 22 , రోహిత్ 46 రన్స్‌కు ఔటయ్యారు. తర్వాత కోహ్లీ 13, విహారీ 35 పరుగులు చేయగా… రెండో ఇన్నింగ్స్‌లో పంత్, శ్రేయాస్ అయ్యర్ బ్యాటింగ్ హైలెట్‌గా నిలిచాయి.

టీ ట్వంటీ తరహాలో రెచ్చిపోయిన పంత్ కేవలం 28 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. లంక బౌలర్లపై ఎదురుదాడికి దిగిన ఈ యువవికెట్ కీపర్ భారీ షాట్లతో అలరించాడు. ఈ క్రమంలో పంత్‌ మరో అరుదైన రికార్డు సాధించాడు. టెస్ట్‌ల్లో టీమిండియా తరఫున ఫాస్టెస్ట్‌ ఫిఫ్టీ కొట్టిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. శ్రీలంకతో జరుగుతున్న పింక్‌బాల్‌ టెస్ట్‌ రెండో ఇన్నింగ్స్‌లో పంత్‌ కేవలం 28 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో ఈ ఘనత సాధించాడు. గతంలో కపిల్‌ పేరిట ఉన్న రికార్డును ఈ యువ వికెట్ కీపర్ బద్దలు కొట్టాడు. అటు శ్రేయాస్ అయ్యర్ కూడా ధాటిగా ఆడాడు. 87 బంతుల్లో 9 ఫోర్లతో 67 పరుగులు చేయగా… జడేజా 22 రన్స్ చేశాడు. దీంతో భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 9 వికెట్లకు 303 పరుగులకు డిక్లేర్ చేసింది. తర్వాత 447 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన శ్రీలంక రెండో బంతికే తిరిమన్నే వికెట్ చేజార్చుకుంది. రెండోరోజు ఆటముగిసే సమయానికి శ్రీలంక 1 వికెట్ కోల్పోయి 28 పరుగులు చేసింది. పిచ్ బౌలర్లకు అనుకూలిస్తున్న నేపథ్యంలో 3 రోజుల ఆట మిగిలి ఉండగా.. భారత్ గెలుపు లాంఛనమే.

Photo Courtesy- BCCI/Twitter