Sasikala: శశికళకు క్లీన్ చిట్ ఇవ్వడం వెనుక పన్నీరు సెల్వం స్కెచ్‌ ఏమిటి?

  • Written By:
  • Updated On - March 23, 2022 / 05:48 PM IST

తమిళనాడులో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయా? ఎందుకంటే స్టాలిన్ కు ప్రజాదరణ పెరుగుతుండడంతో అన్నాడీఎంకే డిఫెన్స్ లో పడింది. అందులోనూ జయలలిత మృతి తరువాత ఆమె లేనిలోటు పార్టీలో స్పష్టంగా కనిపిస్తోంది. దానికితోడు ఇప్పుడు జయ మృతి కేసులో నిజానిజాలు నిగ్గు తేల్చడానికి ఆర్ముగస్వామి కమిషన్ ఏర్పాటైంది. దాని ముందు వివరణ ఇస్తున్న ఒక్కొక్కరూ ఒక్కో నిజాన్నిచెబుతున్నారు. పన్నీర్ సెల్వం మాత్రం.. ఈ విషయంలో శశికళకు క్లీన్ చిట్ ఇవ్వడం ఇప్పుడు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

అన్నాడీఎంకేలోకి రావడానికి శశికళ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ పార్టీలో కొన్ని వర్గాలు దీనికి సుముఖంగా లేవు. ఎందుకంటే ఒకసారి ఆమె పార్టీలోకి ప్రవేశిస్తే.. పార్టీ పగ్గాలు ఆమె చేతుల్లోకి వెళ్లిపోతాయని వారి ఆందోళన. అందుకే రాకుండా అడ్డుకుంటున్నారన్న వాదనుంది. దీంతో హస్తిన పెద్దల ద్వారా అన్నాడీఎంకేలోకి ఎంట్రీ కోసం శశికళ రాయబారం నడుపుతున్నారు. ఇంకా అక్కడి నుంచి చిన్నమ్మకు ఎలాంటి భరోసా రాలేదు.

ఇప్పుడు పన్నీర్ సెల్వం చిన్నమ్మకు పరోక్షంగా మద్దతు తెలిపినట్లయింది. నిజానికి శశికళకు వ్యతిరేకంగా తిరుబాటు జెండా ఎగురవేసిన తొలి వ్యక్తి పన్నీరు సెల్వమే. ఆమె జైలుకు వెళ్లిన తరువాత పళనిస్వామితో కలిసి అధికారాన్ని పంచుకున్నారు. కానీ చిన్నమ్మ జైలు నుంచి రావడం, తరువాత డీఎంకే ఎన్నికల్లో గెలిచి అధికారాన్ని హస్తగతం చేసుకోవడంతో తమిళనాడు రాజకీయాలు మారిపోయాయి. అందుకే ఇప్పుడు మళ్లీ చిన్నమ్మ పంచన ఆయన చేరాలనుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

అయినా గతంలో ఆర్ముగస్వామి కమిషన్ 8 సార్లు సమన్లు జారీ చేసినా పట్టించుకోని పన్నీరు సెల్వం.. ఇప్పుడు ఎందుకు ఆదరాబాదరాగా కమిషన్ ముందు హాజరయ్యారు? జయలలితకు వ్యతిరేకంగా శశికళ కాని, ఆమె కుటుంబ సభ్యులు కాని ఎలాంటి కుట్రా చేయలేదని ఆయన చెప్పడంతో.. అసలేం జరుగుతోందా అన్న చర్చ జరుగుతోంది. దీనిని బట్టి తమిళనాడు రాజకీయాలు.. అందులోనూ అన్నాడీఎంకే పాలిటిక్స్ ఎంత హాట్ గా మారాయో అర్థమవుతుంది.