Jail For Cheating Builder: ఫ్లాట్లు ఇవ్వనందుకు బిల్డర్ కు జైలు శిక్ష విధించిన తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల కమిషన్

వినియోగదారులను మోసం చేసే రియల్టర్లకు గుండెలు అదిరిపోయే తీర్పు ఇది.

  • Written By:
  • Publish Date - April 29, 2022 / 10:00 AM IST

వినియోగదారులను మోసం చేసే రియల్టర్లకు గుండెలు అదిరిపోయే తీర్పు ఇది. వినియోగదారుల కమిషన్ కు ఏం అధికారులు ఉంటాయిలే అని అందులో కేసులను లైట్ గా తీసుకునేవారికి హెచ్చరిక ఇది. ఫ్లాట్ లు నిర్మించి ఇస్తానని చెప్పి లక్షల్లో సొమ్ము తీసుకుని ఎగ్గొట్టిన ఘోరండ బిల్డర్స్ ఓనర్ అయిన సునీల్ జె.సచ్ దేవ్ కు తెలంగాణ రాష్ట్ర వినియోగదారు కమిషన్ సంచలన తీర్పునిచ్చింది.

డబ్బులు తీసుకుని ఫ్లాట్ లు అప్పగించడం లేదని కొందరు కొనుగోలుదారులు రాష్ట్ర వినియోగదారుల కమిషన్ లో పిటిషన్ లు వేశారు. దీంతో ఈ కేసులను విచారించిన కమిషన్.. 2017లో తీర్పులు ఇచ్చింది. మూడు కేసుల్లో 6 నెలల చొప్పున శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఒక శిక్ష తరువాత మరో శిక్ష అమలవుతుందని స్పష్టంగా చెప్పింది. సికింద్రాబాద్ వాసి అయిన టి.ఆర్.కుమార్ తోపాటు మరొకరికి 12 శాతం వడ్డీతో రూ.12.43 లక్షలను, ఆర్.ఈశ్వరి ప్రసాద్ తోపాటు మరో ముగ్గురికి 9 శాతం వడ్డీతో రూ.40.62 లక్షలను, ఏపీలో నరసరావుపేటకు చెందిన సీహెచ్.ఆనంద్ కు 9 శాతం వడ్డీతో రూ.21.97 లక్షలను చెల్లించాలని ఆదేశించింది. కానీ బిల్డర్ మాత్రం ఈ డబ్బును తిరిగి ఇవ్వలేదు. కమిషన్ తీర్పుపై అప్పీలుకూ వెళ్లలేదు.

కమిషన్ తీర్పును అమలు చేయకపోవడంతో బాధితులు మళ్లీ కమిషన్ ను ఆశ్రయించారు. దీంతో ఈ కేసును విచారించిన కమిషన్.. బిల్డర్ కు జైలు శిక్ష విధించింది. తీర్పునిచ్చి ఐదేళ్లయినా దానిని అమలు చేయకపోవడం, పద్మారావునగర్ లోని ఆస్తిని అమ్మి బాధితులకు సొమ్ము చెల్లిస్తానని అఫిడవిట్ ఇచ్చినా ఆ పనీ చేయకపోవడం వల్ల శిక్ష తప్పలేదు. పైగా తనను దివాలాదారుగా ప్రకటించాలన్న పిటిషన్ సివిల్
కోర్టులో వేశానని.. అందులో తీర్పు వచ్చేవరకు కమిషన్ తీర్పును వాయిదా వేయాలని కోరారు. కానీ కమిషన్ ఆయన పిటిషన్ ను కొట్టేసింది.

అసలు వినియోగదారుల కమిషన్ కు శిక్ష విధించే అధికారం ఉందా? వినియోగదారుల పరిరక్షణ చట్టం ప్రకారం ఎవరైనా సరే.. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తే.. వారికి నెల నుంచి మూడేళ్ల వరకు శిక్ష విధించే అధికారం కమిషన్ కు ఉంది. గతంలో హైకోర్టు ఫుల్ బెంచ్ ఈ తీర్పునిచ్చింది. సివి రత్నం వర్సెస్ కేంద్రం కేసులో కూడా సుప్రీంకోర్టు దీనిని చెప్పింది. అందుకే వాటి ప్రకారమే శిక్ష విధిస్తూ తీర్పునిచ్చామని కమిషన్ చెప్పింది.