Site icon HashtagU Telugu

Hardik Pandya:హార్దిక్ పాండ్య సిక్సర్ల రికార్డ్

Hardik Pandya

Pandya

ఐపీఎల్ 2022 సీజన్ లో భాగంగా గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో సూపర్ విక్టరీని ఖాతాలో వేసుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈ సీజన్ లో వరుసగా రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ నిర్దేశించిన 163 పరుగుల లక్ష్యాన్ని మరో 5 బంతులు మిగిలుండగానే ఉఫ్ అని ఊదేసింది. తొలుత బౌలర్లు రాణించడంతో గుజరాత్ జట్టును 162పరుగులకే పరిమితం చేసిన సన్‌రైజర్స్.. ఆ తర్వాత ఓపెనర్లు అభిషేక్ శర్మ 42 పరుగులు, కేన్ విలియమ్సన్ 57 పరుగులు , నికోలస్ పూరన్ 34 పరుగులు చేసి రాణించడంతో చక్కటి విజయాన్ని నమోదు చేసింది. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో రషీద్ ఖాన్, హార్దిక్ పాండ్య ఒక్కో వికెట్ తీశారు.

అయితే ఈ మ్యాచ్‌లో గుజ‌రాత్ టైటాన్స్ జట్టు ఓడిపోయినప్పటికీ ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఐపీఎల్‌లో ఓ అరుదైన రికార్డు సాధించాడు. స‌న్‌రైజ‌ర్స్ బౌల‌ర్ ఎయిడెన్ మాక్ర‌మ్‌ వేసిన ఇన్నింగ్స్ 9వ ఓవ‌ర్లో సిక్సు కొట్టడం ద్వారా ఐపీఎల్‌లో 100 సిక్సుల మైలురాయిని చేరుకున్నాడు. ఈ క్ర‌మంలో ఐపీఎల్‌లో త‌క్కువ బంతుల్లో 100 సిక్సులు పూర్తి చేసిన మూడో ఆట‌గాడిగా హార్దిక్ పాండ్యా నిలిచాడు. ఈ జాబితాలో 657 బంతుల్లోనే 100 సిక్సులు పూర్తి చేసి ఆండ్రూ ర‌సెల్అగ్రస్థానంలో ఉండగా ఆ త‌ర్వాత 943 బంతుల్లో 100 సిక్సులు బాది క్రిస్ గేల్ రెండో స్థానంలో ఉన్నాడు. ఇక 1046 బంతుల్లో 100 సిక్సులు కొట్టిన హార్దిక్ పాండ్యా ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. టీమిండియా ఆటగాళ్లలో మాత్రం అతి త‌క్కువ బంతుల్లో 100 సిక్సులు బాదిన ఆటగాడు హార్దిక్ పాండ్యానే.