Site icon HashtagU Telugu

Kaushik Reddy: నీళ్లు ఇచ్చేదాక నిన్నొదల రేవంత్ రెడ్డి.. ముఖ్యమంత్రికి కౌశిక్ రెడ్డి వార్నింగ్

Huzurabad BRS Candidate Padi Kaushik Reddy started Promotions for Elections

Huzurabad BRS Candidate Padi Kaushik Reddy started Promotions for Elections

Kaushik Reddy: హుజురాబాద్ నియోజకవర్గంలో రైతులకు మరో తడి నీళ్లు అందించేదాకా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వదిలిపెట్టనని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. శనివారం బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ పిలుపుమేరకు హుజరాబాద్ పార్టీ కార్యాలయం వద్ద చేపట్టిన ఒక్కరోజు రైతు దీక్షలో భాగంగా ఆయన మాట్లాడారు. బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ ఆదేశాల మేరకు 118 నియోజకవర్గాలతో పాటు ఈ నియోజకవర్గంలో కూడా రైతులకు ప్రభుత్వం వెంటనే సాగునీరు అందించాలని ఉద్దేశంతో దీక్ష చేపట్టామన్నారు. ఈ దీక్ష రాజకీయాల కోసం చేయడం లేదని, రైతుల బాధ ఆవేదన చూసి నా హృదయం బరువెక్కిందని అందుకోసమే రైతుల పక్షాన నిలబడుతున్నామని అన్నారు. నియోజకవర్గంలోని రైతులందరూ నీళ్ల కోసం పడే గోస చాలా దయనీయంగా ఉందన్నారు.

నియోజకవర్గంలోని కమలాపూర్ ఇల్లంతకుంట జమ్మికుంట మండలాలలోని చాలా గ్రామాల రైతులు నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కెసిఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఒక్క ఎకరం కూడా ఎందుకు ఎండ లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఈ దుస్థితి ఎందుకు ఎదురయింది అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయానికి రైతులకు సరిపడా నీళ్లు ఎందుకు అందించడం లేదో చెప్పాలని అని ఆయన డిమాండ్ చేశారు. రైతు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఎంత అందంగా ఉంటుందో కెసిఆర్ రాష్ట్రం తో పాటు దేశం మొత్తానికి చూపించారన్నారు. కెసిఆర్ ముఖ్యమంత్రిగా దిగిపోగానే రైతులకు నీళ్లు బంద్, రైతుబంధు అయిపోతాయి, కరెంటు కట్ అయిపోతుందా అని ఆయన ప్రశ్నించారు. పరిపాలన చేయడం చాతకాక పోవడంతోనే రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. రైతుల కోసం కేసీఆర్ కష్టపడుతూ పొలాల వంటి తిరుగుతుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం సరదాగా ఐపీఎల్ మ్యాచ్ వీక్షించడం సిగ్గుచేటు అన్నారు.

రేవంత్ రెడ్డి రైతు కాదని ఒక బ్లాక్ మేయర్, బ్రోకర్, చీటర్ అని అన్నారు. హుజురాబాద్ రైతుల కోసం ఎంత దూరమైనా వెళ్తానని అవసరమైతే వేల మంది రైతులతో గేట్ల వద్దకు వెళ్లి గేట్లు కూడా బద్దలు కొడతానని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు హామీల్లో కనీసం ఒక్క హామీ కూడా పూర్తిస్థాయిలో నెరవేరలేదని రేపటి నుంచి గ్రామాల్లో వాళ్ళు ఎలా తిరుగుతారో చూస్తానన్నారు. రైతులకు నీళ్లు ఇచ్చేదాకా వదిలేదే లేదని, నీళ్లు ఇవ్వకుండా ఊర్లలో తిరుగుతే వీపులు పగిలిపోతాయని హెచ్చరించారు. నీలి ఇవ్వడం చేతగాక కాలేశ్వరం మీద పడి ఏడ్చిన కాంగ్రెస్ నాయకులు కెసిఆర్ బయటకి రాగానే కాలేశ్వరం నుంచి నీళ్లు ఎలా వచ్చాయని ఆయన ప్రశ్నించారు. రైతుల పక్షాన దండం పెట్టి అడుగుతున్నానని ఇంకో తడి కి అవసరమైన నీరు వెంటనే అందించాలని అన్నారు.