వెయ్యి కాదు.. రెండు వేలు కాదు.. ఏకంగా 8వేల మంది ఉద్యోగుల పై పలు స్టార్టప్ కంపెనీలు ఉద్వాసన పలికాయి. ఇంతభారీ సంఖ్యలో ఉద్యోగ కోతలు విధించిన సంస్థల జాబితాలో ఓలా, మీషో, అన్ అకాడమీ, కార్స్ 24, వేదాంతు, ట్రెల్, ఫ్యుర్ లెంకో ఉన్నాయి. కంపెనీల నిర్వహణ వ్యయాలను తగ్గించుకునే క్రమంలోనే ఉద్యోగులను తొలగించినట్లు తెలుస్తోంది.
స్టార్టప్ కంపెనీలకు నిధుల ప్రవాహం తగ్గింది. దీంతోపాటు మదుపరుల నుంచి ఒత్తిడి పెరిగిన నేపథ్యంలో నిర్వహణ వ్యయాలను తగ్గించుకునే దిశగా స్టార్టప్ లు అడుగులు వేస్తున్నాయి. అత్యధికంగా 2100 మంది ఉద్యోగులను ఓలా, 926 మందిని అన్ అకాడమీ, 424 మందిని వేదాంతు, 600 మందిని కార్స్24 కంపెనీ తొలగించాయి.
మీషో కంపెనీ 150 మందికి పింక్ స్లిప్ లు ఇచ్చి ఇళ్లకు సాగనంపింది. మీషో కంపెనీ వినియోగదారుల సంఖ్య ఇటీవల 10 కోట్లు దాటింది. అయినా సంస్థ పునర్ వ్యవస్థీకరణ అవసరాల దృష్ట్యా ఉద్యోగ కోతలు విధించాల్సి వచ్చిందని మీషో వెల్లడించింది.