Site icon HashtagU Telugu

Delhi Corona: ఢిల్లీ పోలీసుల‌పై క‌రోనా పంజా.. 300 మందికి పాజిటివ్‌

Covid Police

Covid Police

దేశ రాజ‌ధాని ఢిల్లీలో క‌రోనా కేసులు పెరుగుతున్నాయి. మ‌రోవైపు క‌రోనా వైర‌స్ పోలీసుల‌పై పంజా విసురుతుంది. క‌రోనా నియంత్రించేందుకు కృషి చేస్తున్న పోలీస్ శాఖ‌లో ఒక్క‌సారిగా క‌రోనా కేసులు రావ‌డం ఆందోళ‌న క‌లిగిస్తుంది. పోలీస్ డిపార్ట్‌మెంట్ లో పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్, అదనపు కమిషనర్ చిన్మోయ్ బిస్వాల్‌తో సహా 300 మంది ఢిల్లీ పోలీసు సిబ్బందికి క‌రోనా పాజిటివ్ గా నిర్ధార‌ణ అయింది. పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌తో సహా అన్ని యూనిట్లు, అన్ని పోలీస్ స్టేషన్‌లలో పెద్ద సంఖ్యలో పోలీసు సిబ్బంది క‌రోనా బారిన ప‌డ్డారు. ఢిల్లీలో ఆదివారం 22,751 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. ఇది గత ఏడాది మే 1 త‌రువాత అత్యధికం అని రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఢిల్లీలో ప్ర‌స్తుతం పాజిటివిటీ రేటు 23.53 శాతానికి పెరిగింది.

దేశ రాజధాని ఢిల్లీ 55 గంటల సుదీర్ఘ వారాంతపు కర్ఫ్యూలో ఉంది. ఇది సోమ‌వారం ఉద‌యం 5గంట‌ల‌కు ముగిసింది. ఇప్పటికే ఢిల్లీలో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ అమలులో ఉంది. క‌ర్ఫ్యూ నిబంద‌న‌లు ఉల్లంఘించిన వారిని పట్టుకోవడానికి ఢిల్లీ పోలీసులు అనేక రహదారులపై బారికేడ్లను ఏర్పాటు చేశారు. వారాంతపు కర్ఫ్యూ సమయంలో విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, అంతర్ రాష్ట్ర బస్ టెర్మినల్‌ నుండి వ‌చ్చే, వేళ్లే వ్యక్తులను తరలించడానికి మాత్ర‌మే అనుమ‌తి ఉంది. గర్భిణీ స్త్రీలు, రోగులు వైద్య, ఆరోగ్య సేవలను పొందడానికి వెళ్లేవారితో పాటుగా, చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డులు లేదా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ చూపిస్తే ప్ర‌యాణానికి అనుమ‌తి ఇస్తున్నారు. వారాంతపు కర్ఫ్యూ సమయంలో కిరాణా, వైద్య పరికరాలు, మందులు వంటి నిత్యావసర వస్తువులను విక్రయించే దుకాణాలను మాత్రమే తెరవడానికి అధికారులు అనుమ‌తి ఇచ్చారు. కోవిడ్-19 ఆంక్షల దృష్ట్యా పోలీసులు పెట్రోలింగ్‌ను ముమ్మరం చేశారు. పెరుగుతున్న కేసుల దృష్ట్యా దేశ రాజధానిలో మరిన్ని నియంత్రణలపై చర్చించడానికి ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (డిడిఎంఎ) జనవరి 10న మరో సమావేశాన్ని నిర్వహించనుంది.