School Holidays Extended : నిఫా వైరస్ కేసులు కేరళలో కలకలం క్రియేట్ చేస్తున్నాయి. దీంతో కోజికోడ్ జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు వచ్చే ఆదివారం (సెప్టెంబరు 24) వరకు రాష్ట్ర ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. జిల్లాలోని పాఠశాలలు, ప్రొఫెషనల్ కాలేజీలు, ట్యూషన్ సెంటర్లు , ఇతర విద్యా సంస్థలను ఈ సెలవుల ప్రకటన వర్తిస్తుందని వెల్లడించింది. శుక్రవారం రోజు కూడా కోజికోడ్ జిల్లాలో మరో నిఫా వైరస్ కేసు బయటపడిన నేపథ్యంలో అలర్ట్ అయిన రాష్ట్ర సర్కారు.. ఈమేరకు ప్రకటన విడుదల చేసింది. నిఫా సోకిన వారి కాంటాక్ట్ లిస్టులో 130 మందిని శుక్రవారం ఒక్కరోజే గుర్తించారు. కోజికోడ్ పొరుగు జిల్లాలకు చెందిన 29 మంది కూడా ఇందులో ఉన్నారు. దీంతో ఆ జిల్లాలకు కూడా వైరస్ వ్యాపిస్తుందనే ఆందోళన నెలకొంది. నిఫా సోకిన వ్యక్తులతో పరిచయం ఉన్న దాదాపు 1,080 మందిని గుర్తించి చికిత్స అందిస్తున్నారు. హై రిస్క్ కేటగిరీలో 175 మంది సాధారణ వ్యక్తులు, 122 మంది ఆరోగ్య కార్యకర్తలు ఉన్నారని కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ వెల్లడించారు.
Also read : I Am With CBN : చంద్రబాబుకి మద్ధతుగా నేడు హైదరాబాద్ ఓఆర్ఆర్‌పై కార్ల ర్యాలీ
నిఫా ఇన్ఫెక్షన్ తో తొలుత ఆగస్టు 30న 49 ఏళ్ల వ్యక్తి మరణించాడు. సెప్టెంబరు 11న 40 ఏళ్ల వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఇద్దరూ కూడా జ్వరం, న్యుమోనియా లాంటి లక్షణాలతో బాధపడ్డారు. చనిపోయిన వ్యక్తి ఇంటికి 20 కిలోమీటర్ల దూరంలో తొలి నిఫా కేసు బయటపడిందని అధికారులు (School Holidays Extended) తెలిపారు. నిఫా ఇన్ఫెక్షన్ అనేది జూనోటిక్ వ్యాధి. ఇది జంతువుల నుంచి మనుషులకు సంక్రమిస్తుంది. కలుషితమైన ఆహారం ద్వారా లేదా నేరుగా ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి ఇది వ్యాపిస్తుంది. ఇది సోకిన వ్యక్తులు తీవ్రమైన శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్‌కు గురవుతారు. జ్వరం ఎక్కువగా వస్తుంది. మరణాల రేటు దాదాపు 70 శాతం ఉంటుందని డబ్ల్యుహెచ్‌ఓ వెల్లడించింది. ఈ వైరస్‌కు ఇప్పటివరకు వ్యాక్సిన్ లేదు.