Site icon HashtagU Telugu

Revanth Reddy: రేవంత్ `పీసీసీ` ఏడాది సంబ‌రాలు

Revanth Reddy

Revanth Reddy

తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన రేవంత్ రెడ్డి తొలి ఏడాది అనేక ఆటుపోట్ల‌ను ఎదుర్కొన్నారు.ఏడాది పూర్తి చేసుకున్న సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని ట్విట్ట‌ర్ ఖాతాలో రేవంత్ ఓ ఆస‌క్తిక‌ర ట్వీట్‌ను పోస్ట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు సోనియా గాంధీ, పార్టీ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రాల‌తో క‌లిసి ఉన్న ఫొటోల‌తో పాటు టీపీసీసీ అధ్య‌క్షుడిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు తీసుకుంటున్న ఫొటోను ట్వీట్‌కు జ‌త చేశారు. అధి నాయ‌క‌త్వం కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించింద‌ని ఈ సంద‌ర్భంగా రేవంత్ పేర్కొన్నారు. ఈ ట్వీట్‌ను చూసిన పార్టీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి గీతారెడ్డి ఆయ‌న‌ను అభినందిస్తూ ఓ ట్వీట్ చేశారు. పార్టీకి చెందిన ఇత‌ర నేత‌ల నుంచి కూడా రేవంత్ రెడ్డికి అభినంద‌న‌లు తెలుపుతున్నారు.

ముళ్ల కిరీటాన్ని ఏడాది క్రితం పెట్టుకున్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని చాలా వ‌ర‌కు గాడిలో పెట్టారు. తొలి రోజుల్లో ఆయ‌న కొంత త‌డ‌బ‌డిన‌ప్ప‌టికీ ఆ త‌రువాత క్ర‌మంగా పైచేయిగా సాధించారు. సీనియ‌ర్ల‌ను సానుకూలంగా మ‌లుచుకోవ‌డం నుంచి ఆదేశించే స్థాయికి ఎదిగారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ల ఫ‌లితాలు మిన‌హా ఆయ‌న వేసిన రాజ‌కీయ అడుగుల‌న్నీ దాదాపుగా విజ‌య‌వంత‌మే. రాహుల్ వ‌రంగ‌ల్ స‌భ‌లో ఆయ‌న క్రేజ్ అమాంతం పెరిగింది. అధిష్టానం వ‌ద్ద తిరుగులేని నాయ‌కునిగా ఎదిగారు. ఆయ‌న మీద ఫిర్యాదు చేయ‌డానికి కూడా ఎవ‌రూ సాహ‌సించ‌ని స్థాయికి ఎదిగారు.

వ్య‌తిరేక గ‌ళం విప్పిన సీనియ‌ర్ల‌ను ప్ర‌స్తుతం మౌనంగా ఉండేలా చేశారు. రోజూ గాంధీభ‌వ‌న్లో ఇత‌ర పార్టీల నుంచి వచ్చి చేరుతోన్న లీడ‌ర్ల‌తో క‌ళ‌క‌ళ‌లాడుతోంది. అంతేకాదు, రాబోవు రోజుల్లో మ‌రింత మంది సీనియ‌ర్లు టీఆర్ఎస్, బీజేపీ నుంచి వ‌స్తార‌ని తెలుస్తోంది. రెండో ఏడాదిలోకి. అడుగుపెట్టిన పీసీసీ చీఫ్ రేవంత్ పాద‌యాత్ర‌కు శ్రీకారం చుట్టే అవ‌కాశం ఉంది. ప్ర‌త్య‌ర్థి పార్టీల వ్యూహాల‌కు ప్ర‌తిగా చ‌తుర‌త‌ను ప్ర‌ద‌ర్శిస్తోన్న ఆయ‌న భ‌విష్య‌త్ లో ఎలాంటి కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తారో చూడాలి.