Site icon HashtagU Telugu

1975 Emergency Explained : ఇందిరాగాంధీ..1975 ఎమర్జెన్సీ..5 కారణాలు

1975 Emergency Explained

1975 Emergency Explained

1975 Emergency Explained  : 48 ఏళ్ళ క్రితం.. సరిగ్గా ఇదే రోజు..

1975 జూన్ 25న రాత్రి.. నాడు దేశంలో స్టేట్ ఎమర్జెన్సీ (జాతీయ అత్యవసర పరిస్థితి)ని ప్రకటించారు.. 

ఎమర్జెన్సీ విధించే ఆర్డర్‌పై నాటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ సంతకం చేశారు.. 

దేశంలో ఎమర్జెన్సీ అమల్లోకి వచ్చింది..

మరుసటి రోజు (1975 జూన్ 26న)  ఉదయం ఆలిండియా రేడియోలో నాటి ప్రధానమంత్రి  ఇందిరాగాంధీ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. 

“సోదర సోదరీమణులారా.. రాష్ట్రపతి ఎమర్జెన్సీ ప్రకటించారు. అయితే దీనికి భయపడాల్సిన అవసరం లేదు” అని ఇందిర పేర్కొన్నారు.   

ఇందిరాగాంధీ ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణమైన 5 ఘటనల గురించి తెలుసుకుందాం.. 

1974 ఫిబ్రవరి.. మొరార్జీ దేశాయ్ దీక్ష.. గుజరాత్ లో రాష్ట్రపతి పాలన 

ఇందిరాగాంధీ నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటనకు బీజాలు ఒక రకంగా గుజరాత్ లోనే పడ్డాయి. 1973 జూలై 17న గుజరాత్ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్  సీనియర్ నేత  చిమన్‌భాయ్ పటేల్ నియమితులయ్యారు. అయితే ఆయనపై 1974 సంవత్సరంలో అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఈ అవినీతికి వ్యతిరేకంగా “చిమన్ చోర్” అనే  నినాదంతో  నవ నిర్మాణ్ ఉద్యమం జరిగింది. ఒక నెలలోగా చిమన్‌భాయ్ పటేల్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలంటూ గుజరాత్ యూనివర్శిటీ విద్యార్థులు నిరసనకు దిగారు. రాష్ట్ర  ప్రజల్లోనూ  సీఎంపై ఆగ్రహం పెరిగింది. 1967, 1971 ఎన్నికల్లో ప్రధాని పదవి విషయంలో ఇందిరాగాంధీతో పోటీపడిన అగ్రనేత మొరార్జీ దేశాయ్ కూడా నవ నిర్మాణ్ ఉద్యమంలోకి  ప్రవేశించారు. దీంతో దానిపై జాతీయ స్థాయిలో చర్చ మొదలైంది. చిమన్‌భాయ్ పటేల్ ను గుజరాత్ సీఎం పోస్టు నుంచి తప్పించే వరకు ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని  మొరార్జీ దేశాయ్ ప్రకటించారు. ఫలితంగా కేంద్రంలోని ఇందిరా గాంధీ సర్కారుపై, కాంగ్రెస్ పార్టీపై ఒత్తిడి బాగా పెరిగింది. ఈ తరుణంలో 1974 ఫిబ్రవరిలో చిమన్‌భాయ్ పటేల్ ప్రభుత్వాన్ని రద్దు చేసిన ఇందిరా గాంధీ.. అక్కడ రాష్ట్రపతి పాలన విధిస్తున్నట్లు ప్రకటించారు.

బీహార్‌లో జేపీ ఉద్యమం

1974 సమయంలో బీహార్‌ సీఎంగా అప్పటి కాంగ్రెస్ సీనియర్ నేత అబ్దుల్ గఫూర్‌ ఉన్నారు. గుజరాత్ లో విద్యార్థులు నిర్వహించిన  నవ నిర్మాణ్ ఉద్యమం స్పూర్తితో పాట్నా విశ్వవిద్యాలయం విద్యార్థులు 1974 మార్చి లో కొత్త ఉద్యమాన్ని ప్రారంభించారు. సీఎం అబ్దుల్ గఫూర్‌ ప్రభుత్వం వైఫల్యాలపై విద్యార్థుల ఉద్యమం ఉధృతమైంది. ఈక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం పోలీసు బలాన్ని స్టూడెంట్స్ పై ప్రయోగించింది. అప్పట్లో విద్యార్ధి నాయకులుగా ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్‌ లు  ఈ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ప్రముఖ గాంధేయవాది జయప్రకాశ్ నారాయణ్  కు ఇందిరా గాంధీ తండ్రి జవహర్‌లాల్ నెహ్రూ కేంద్ర మంత్రి పదవి ఇవ్వడానికి నిరాకరించారు. అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన  పాట్నా విశ్వవిద్యాలయం విద్యార్థుల ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. జేపీ, పాట్నా యూనివర్సిటీ  స్టూడెంట్స్ తో కలిసి 1974 జూన్ లో “సంపూర్ణ క్రాంతి” (సంపూర్ణ విప్లవం) మార్చ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలోనే ఆయన “ఇందిరా హటావో.. ఇండియా బచావో” నినాదం ఇచ్చారు. దీంతో ఈ ఉద్యమం జాతీయ స్థాయికి చేరింది. ఇది కూడా  ఇందిరాగాంధీ సర్కారుపై ఒత్తిడి పెంచింది.

జార్జ్ ఫెర్నాండెజ్  రైల్వే సమ్మె

జార్జ్ ఫెర్నాండేజ్.. 1970ల ప్రారంభంలో ట్రేడ్ యూనియన్ నాయకుడిగా ఉండేవారు. భారత రైల్వేలో దాదాపు 14 లక్షల మంది ఉద్యోగుల యూనియన్ కు అప్పట్లో  ఆయన నాయకత్వం వహించారు. జార్జ్ ఫెర్నాండేజ్ కు గాంధేయవాది జయప్రకాశ్ నారాయణ్  అంటే ఎంతో అభిమానం. ఈ అభిమానంతో బీహార్ లో జరుగుతున్న “సంపూర్ణ క్రాంతి” ఉద్యమానికి మద్దతు ప్రకటించారు.  జార్జ్ ఫెర్నాండెజ్.. 1974 మేలో దేశంలోని రవాణా వ్యవస్థను స్తంభింపజేశారు.  జార్జ్ ఫెర్నాండెజ్ నేతృత్వంలో 3 వారాల పాటు రవాణా కార్మికుల దేశవ్యాప్త సమ్మె చేశారు. ఈవిధంగా ఆయన ఇందిరాగాంధీ శక్తికి ఒక సవాలు విసిరారు. ఈక్రమంలో 1975 జనవరిలో బీహార్ లోని సమస్తిపూర్ రైల్వే స్టేషన్‌లో బాంబు పేలింది. ఈ ఘటనలో నాటి రైల్వే మంత్రి , బీహార్ కీలక నేత  LN మిశ్రా చనిపోయారు. బాంబు పేలిన తర్వాత రక్తపు మడుగులో పడి ఉన్న ఆయనకు చికిత్స చేసేందుకు డాక్టర్లను కూడా అనుమతించలేదని అప్పట్లో మీడియాలో కథనాలు వచ్చాయి. ఇది కూడా నాటి బీహార్ రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారుపై ప్రజా వ్యతిరేకత పెంచింది.   జేపీ ఉద్యమం మరింత బలపడింది.

జడ్జి జగ్మోహన్ లాల్ సిన్హా ఆదేశం

1971 ఎన్నికలలో ఉత్తర ప్రదేశ్ లోని రాయ్‌బరేలీ లోక్ సభ స్థానం నుంచి ఇందిరాగాంధీ గెలిచారు.  అయితే ఆ ఎన్నికలో ఓడిపోయిన సోషలిస్ట్ నాయకుడు రాజ్ నారాయణ్ కోర్టును ఆశ్రయించారు. ఎన్నికల ఫలితాన్ని.. ఇందిరా గాంధీ గెలుపును సవాలు చేస్తూ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇందిరా గాంధీ ప్రధాని పదవిని దుర్వినియోగం చేయడంతో పాటు ఎన్నికల అవకతవకలకు పాల్పడ్డారని రాజ్ నారాయణ్ ఆరోపించారు. ఎన్నికల దుర్వినియోగానికి పాల్పడినందుకు ఇందిరాగాంధీని దోషిగా పేర్కొంటూ 1975 జూన్ 12న  అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జగ్మోహన్ లాల్ సిన్హా తీర్పును వెలువరించారు. ఇందిరా గాంధీ ఎన్నిక చెల్లదని ప్రకటించారు. ఈ ఉత్తర్వుపై ఇందిరాగాంధీ  సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేశారు. సరిగ్గా అదే రోజు (1975 జూన్ 12న).. గుజరాత్ ఎన్నికల రిజల్ట్ వచ్చింది. జేపీ, మొరార్జీ దేశాయ్ మద్దతు ఉన్న ఐదు పార్టీల కూటమి చేతిలో కాంగ్రెస్ ఓడిపోయిందనే వార్తను ఇందిర విన్నారు. మరోవైపు.. ఇందిరా గాంధీ సుప్రీంకోర్టులో తన తరఫున వాదించడానికి అప్పటి టాప్ లాయర్ నాని ఫాల్కీవాలాను నియమించారు. జస్టిస్ వి.ఆర్.కృష్ణయ్యర్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ 1975న జూన్ 24న ఇందిరా గాంధీ అప్పీల్ పిటిషన్ ను విచారించింది.  అలహాబాద్ హైకోర్టు తీర్పుపై స్టే విధించింది. ఇందిరా గాంధీ రాజీనామా చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

రాంలీలా మైదాన్‌లో జేపీ, మొరార్జీ దేశాయ్ ర్యాలీ 

సుప్రీం కోర్టు స్టే ఆర్డర్ పై జేపీ, మొరార్జీ దేశాయ్ భగ్గుమన్నారు. కోర్టు తీర్పు వచ్చిన మరుసటి రోజే (1975 జూన్ 25న)..  వారు న్యూఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు.  ఇందిరా గాంధీ ప్రభుత్వ ఆదేశాలను పాటించవద్దని సైన్యం, పోలీసులకు జేపీ పిలుపునిచ్చారు. “మేము ఆమె సర్కారును పడగొట్టాలని అనుకుంటున్నాం..  ఆమెను రాజీనామా చేయమని డిమాండ్ చేస్తున్నాం. మా ఉద్యమ ఉధృతిని తట్టుకొని ఇందిర  నిలబడలేరు” అని   మొరార్జీ దేశాయ్ ఆ రోజు కామెంట్ చేశారు. ఈ ర్యాలీ ముగిసిన కొన్ని గంటల తర్వాత ఇందిరా గాంధీ, ఆమె కుమారుడు సంజయ్ గాంధీ సమావేశమై జాతీయ అత్యవసర పరిస్థితిని(1975 Emergency Explained)  విధించాలని నిర్ణయించారని అప్పట్లో మీడియా కథనాలు వచ్చాయి. 21 నెలల పాటు(1977 మార్చి 21 వరకు) ఎమర్జెన్సీ  కొనసాగింది.. మీడియా, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల కార్యకలాపాలపై ఆంక్షలు అమలయ్యాయి.