TTD: సామాన్యుల కోసం ఆఫ్ లైన్ లో దర్శనం టోకెన్లు

సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేలా త్వరలోనే ఆఫ్ లైన్ ద్వారా దర్శనం టోకెన్ల జారీ ప్రకియ ప్రారంభిస్తామని టీటీడీ చైర్మెన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

Published By: HashtagU Telugu Desk
Tirumala New

Tirumala New

సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేలా త్వరలోనే ఆఫ్ లైన్ ద్వారా దర్శనం టోకెన్ల జారీ ప్రకియ ప్రారంభిస్తామని టీటీడీ చైర్మెన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కోవిడ్ కారణంగా, ఉద్యోగులు, భక్తుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని విధిలేని పరిస్థితిలో ఆన్ లైన్ ద్వారా సర్వదర్శన టోకెన్లు జారీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

కోవిడ్ వ్యాప్తి చెందుతుందన్న ఆందోళనతో తిరుపతిలో ఆఫ్ లైన్ ద్వారా టోకెన్లు జారీ విధానాన్ని గత ఏడాది సెప్టెంబరు 25 వ తేదీ నుంచి రద్దు చేశామని ఛైర్మన్ వివరించారు. ఆన్ లైన్ లో సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తున్నప్పటికీ, అవి గ్రామీణ ప్రాంతంలో వున్న సామాన్య భక్తులకు అందడం లేదన్న భావనలో టిటిడి వుందన్నారు.
సామాన్య భక్తులకు సౌకర్యవంతంగా వుండేలా తిరుపతి లో ఆఫ్ లైన్ విధానం లో సర్వదర్శన టోకెన్లు జారీ చేయాలని అనేక సార్లు భావించినా, కోవిడ్ తీవ్రత కారణంగా వాయిదా వేయక తప్పడం లేదని శ్రీ సుబ్బారెడ్డి చెప్పారు. ఫిబ్రవరి 15వ తేదీ నాటికి ఒమిక్రాన్ తీవ్రత తగ్గుముఖం పడుతుందని నిపుణులు చెబుతున్నందు వల్ల వారి సూచన మేరకు ప్రస్తుతం ఆన్ లైన్ లో ఫిబ్రవరి 15వ తేదీ వరకు సంబంధించిన సర్వదర్శనం టోకెన్లు మాత్రమే జారీ చేస్తున్నామని ఆయన తెలిపారు.

ఫిబ్రవరి 15వ తేదీ కోవిడ్ వ్యాప్తి పరిస్థితిని అంచనా వేసి సర్వదర్శనం టోకెన్లు సామాన్య భక్తులకు సులభతరంగా అందేలా ఆఫ్ లైన్ విధానంలో జారీ చేసే అంశం పై నిర్ణయం తీసుకుంటామని చైర్మన్ శ్రీ సుబ్బారెడ్డి భక్తులకు తెలియజేశారు.

  Last Updated: 28 Jan 2022, 08:04 PM IST