ఐదుగురు సభ్యుల ప్రాథమిక సభ్యత్వాలను రద్దు చేస్తూ జూబ్లీహిల్స్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ సంచలన నిర్ణయం తీసుకుంది. సుదీర్ఘ కాలం పాటు సొసైటీలో కీలకంగా వ్యవహరించిన ఎన్టీవీ వ్యవస్థాపకుడు నరేంద్ర చౌదరి, సీవీఆర్ వ్యవస్థాపకుడు సీవీ రావు, ప్రస్తుత కార్యదర్శి ఏ. మురళీ ముకుంద్, టీ హనుంతరావు, కిలారి రాజేశ్వరరావు అక్రమాలకు పాల్పడ్డారని సొసైటీ తేల్చింది. మేనేజింగ్ కమిటీ ఐదుగురు సభ్యులు చేసిన వివిధ అక్రమాలను చూపుతూ ఆ ఐదుగురి ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేస్తూ పెట్టిన తీర్మానాన్ని సొసైటీ ఆమోదించింది.
జూబ్లీహిల్స్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ జనరల్ బాడీ సమావేశం ఆదివారం జరిగింది.ఏకగ్రీవ ఆ ఐదుగురి సభ్యత్వాలను రద్దు చేస్తూ తీర్మానం చేసింది. సభ్యత్వాల తొలగింపు ప్రక్రియను కార్యదర్శి ముకుంద్ వ్యతిరేకించారు. శనివారం అర్థరాత్రి మాత్రమే సభ్యులకు షోకాజ్ నోటీసులు అందించారని చెబుతున్నారు. “శనివారం రాత్రి 11 గంటలకు నోటీసు అందజేయడం మరుసటి రోజు ఆదివారం తీసివేయడం ఎలా? అంటూ ముకుంద్ ప్రశ్నిస్తున్నారు. సమావేశంలో ఇతర సభ్యులను మాట్లాడేందుకు కమిటీ అనుమతించలేదని ఆయన ఆరోపించారు. ఆదివారం ఉదయం జనరల్ బాడీ సమావేశం అయిన తరువాత సభ్యత్వాల రద్దు అంశం బయటపడింది.