Site icon HashtagU Telugu

Yasin Malik Death Penalty : యాసిన్ మాలిక్‌కు ఆ నోటీసు..ఎందుకంటే ?

Yasin Malik Death Penalty

Yasin Malik Death Penalty

ఉగ్రవాద నిధుల కేసులో తీహార్ జైలులో జీవిత ఖైదు శిక్షను అనుభవిస్తున్న కాశ్మీర్ వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్‌కు ఢిల్లీ హైకోర్టు నోటీసు జారీ చేసింది. అతడికి మరణశిక్ష (Yasin Malik Death Penalty) విధించాలంటూ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దాఖలు చేసిన పిటిషన్‌పై విచారించిన న్యాయస్థానం సోమవారం ఈ నోటీసును ఇష్యూ చేసింది. న్యాయమూర్తులు సిద్ధార్థ్ మృదుల్, తల్వంత్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం ఆగస్టు 9న మాలిక్‌ను తమ ఎదుట హాజరుపర్చాలని జైలు సూపరింటెండెంట్ కు వారెంట్లు ఇచ్చింది.

Also read : Yasin Malik: యాసిన్ మాలిక్ కు రెండు యావజ్జీవ శిక్షలు

యాసిన్ మాలిక్‌ గతంలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడ్డాడని.. అతడి చర్యల వల్ల కాశ్మీర్ లో ఎంతోమంది సైనికులు చనిపోయారని, ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఎన్‌ఐఎ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు. యాసిన్ మాలిక్‌ లాంటి వాళ్లను ఉపేక్షిస్తే.. చిన్న శిక్షలే పడతాయనే అభిప్రాయానికి ఉగ్రవాదులు వస్తారని పేర్కొన్నారు. అతడి కేసును అతి అరుదైనదిగా పరిగణించి జీవిత ఖైదును మరణశిక్షగా(Yasin Malik Death Penalty) మార్చాలని బెంచ్ ను సొలిసిటర్ జనరల్ కోరారు. “ఈ అప్పీల్‌లో ప్రతివాదిగా ఉన్న యాసిన్ మాలిక్ ఇప్పటికే సెక్షన్ 121 ఐపీసీ కింద నేరాన్ని అంగీకరించినందున మేం అతడికి నోటీసును జారీ చేస్తున్నాం. దీన్ని జైలు సూపరింటెండెంట్ అతడికి అందించాలి” అని కోర్టు ఆదేశించింది.