Hijab : హిజాబ్‌తో ప‌రీక్ష‌కు అనుమ‌తించ‌ని కాలేజీ యాజ‌మాన్యం

  • Written By:
  • Updated On - June 21, 2022 / 07:02 AM IST

జంషెడ్‌పూర్‌లోని మహిళా కళాశాలలో కొందరు విద్యార్థినులను హిజాబ్ ధరించి పరీక్షకు  అనుమతించకపోవడంతో వివాదం చెలరేగింది. హిజాబ్‌ను తొలగించాలని కళాశాల అధ్యాపకులు కోరడంతో దాదాపు గంటపాటు అక్క‌డ ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఈ విషయంపై ఆల్ ఇండియా మైనారిటీ సోషల్ వెల్ఫేర్ ఫ్రంట్ (AIMSWF) నిరసన తెలిపింది. ఈ సమస్యపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ AIMSWF ప్రతినిధి బృందం సోమవారం జంషెడ్‌పూర్ డిప్యూటీ కమిషనర్‌కు మెమోరాండం సమర్పించింది. ఈ విషయాన్ని పరిశీలిస్తామని డిప్యూటీ కమిషనర్‌ హామీ ఇచ్చారని ఫ్రంట్‌ అధ్యక్షుడు బాబర్‌ఖాన్‌ తెలిపారు. ఈ ఘటన జూన్ 18న జరిగింది. జార్ఖండ్ అకడమిక్ కౌన్సిల్ నిర్వహిస్తున్న 12వ తరగతి పరీక్ష కోసం మహిళా కళాశాలలో పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

జంషెడ్‌పూర్‌లోని కరీం సిటీ కాలేజీకి చెందిన కొంతమంది ముస్లిం విద్యార్థులు పరీక్ష రాయడానికి హిజాబ్ ధరించి ఇక్కడికి వచ్చారు. సెంటర్‌లో ఉన్న‌ ఉపాధ్యాయులు హిజాబ్‌ను తొలగించాలని కోరారు. దాదాపు అరగంట పాటు తమను పరీక్షకు హాజరుకాకుండా అడ్డుకున్నారని విద్యార్థులు తెలిపారు. హిజాబ్‌ తీసి మరుసటి రోజు నుంచి పరీక్షా కేంద్రానికి రావాలని కళాశాల యాజమాన్యం వారిని హెచ్చరించిందని… ఇది పరీక్ష నిబంధనలకు విరుద్ధమని కళాశాల అధికారులు చెప్పారు. ఫర్హీన్ యాస్మీన్ అనే విద్యార్థి హిజాబ్ ధరించి పరీక్షకు హాజరవడంపై మైనారిటీ సంస్థకు ఫిర్యాదు చేసింది. సోమవారం కూడా మళ్లీ వివాదం చెలరేగే అవకాశం ఉన్నప్పటికీ భారత్ బంద్ కారణంగా పరీక్ష వాయిదా పడింది. జార్ఖండ్‌లో కర్ణాటక తరహాలో వివాదం సృష్టించే ప్రయత్నం జరుగుతోందని బాబర్ ఖాన్ అన్నారు.