Site icon HashtagU Telugu

Nose Surgery: అందం కోసం ముక్కు ప్లాస్టిక్ సర్జరీ.. కొంత సేపటికే మృత్యువాత!

Whatsapp Image 2023 02 08 At 23.08.12

Whatsapp Image 2023 02 08 At 23.08.12

Nose Surgery: అందంకోసం సర్జరీ చేయించుకున్న ఓ యువతీ తన ప్రాణాలే కోల్పోయిన దారుణ ఘటన ఇది. అమెరికా శాన్‌ ఫ్రాన్సిస్కోలో నివసిస్తున్న కారెన్‌ జులియెత్‌ కార్డెనాస్‌ యురిబె అనే యువతీ.. 21సం.లు, తాను సైకాలజీ కోర్సు చివరి సెమ్ చదువుతుంది. అప్పటికీ అందంగానే ఉన్న యువతీ, తాను మరింత అందంగా కన్పించేందుకు ముక్కు ఆకృతి మార్చుకోవాలనుకుని, ప్లాస్టిక్ సర్జరీ చేసుకోవాలని నిశ్చయించుకుంది. జనవరి 29న ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకునేందుకు క్లినిక్‌కు వెళ్లింది. ఆమెకు ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు ఆపరేషన్‌ నిర్వహించారు వైద్యులు.

సర్జరీ విజయవంతం అయినదని చెప్పగా.. ఇంటికెళ్లిన జులియెత్‌ కొంత సమయానికి స్పృహ తప్పి పడిపోయింది. ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు, స్పృహలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించగా.. కాసేపు తేరుకున్న ఆ అమ్మాయి తిరిగి కుప్పకూలి పడిపోయింది. ఇక వారు వెంటనే సర్జరీ చేసిన డాక్టర్ కు ఫోన్‌ చేశారు. వెంటనే తనను ఆస్పత్రికి తీసుకురావాల్సిందిగా తెలిపాడు డాక్టర్. ఇంతలో యువతీ పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో తల్లిదండ్రులు సర్జరీ జరిగిన హాస్పిటల్ కు కాకుండా, ఇంటికి సమీపంలో ఉన్న వేరొక ఆస్పత్రికి పట్టుకెళ్లారు.

ఆ యువతిని పరీక్షించిన డాక్టర్స్ షాక్‌ అయ్యారు, ఆమెను సృహలోకి తీసుకొచ్చేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం లేదు. ఆమె లేచి, మళ్లీ వెంటనే స్పృహ కోల్పోతోంది. ఇక ఆలస్యం చేయకుండా స్కానింగ్‌ చేసిన వైద్యులు.. స్కానింగ్ రిపోర్ట్ చూసి అవాక్కయ్యారు. యువతీ ఊపిరితిత్తులు మొత్తం రక్తంతో నిండిపోయాయి. దాంతో తాను శ్వాస తీసుకోలేక తీవ్ర ఇబ్బందిని  ఎదుర్కొంది. ప్రత్యామ్నాయంగా పైపుల ద్వారా శ్వాస అందించేందుకు వైద్యులు ప్రయత్నించి, విఫలమయ్యారు.

యువతి  6 సార్లు కార్డియాక్  రెస్పిరేటరీ అరెస్టులతో విలవిలలాడి ప్రాణాలు కోల్పోయింది. అయితే సర్జరీ చేసిన వైద్యుడి పొరపాటు వల్లే ఆమె ప్రాణాలు కోల్పోయిందని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఇక వైద్యుల నిర్లక్ష్యానికి బలి అయిన తన కూతురికి న్యాయం జరిగే వరకు పోరాడతామని, ఆ వైద్యునిపై కేసు పెడతామని అన్నారు. ఏదేమైనా అందం కోసం ఇలా తాను సర్జరీ చేయించుకుని మరణించడం అందర్నీ కలచి వేస్తుంది. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.