Site icon HashtagU Telugu

USA: అమెరికాని ముంచెత్తుతున్న వరదలు.. రెండు నెలల వర్షం ఒకేసారి కురవడంతో?

Usa

Usa

ప్రస్తుతం దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కొన్ని ప్రదేశాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు మునిగిపోవడంతో పాటు వరదలు ముంచెత్తుతున్నాయి. దీంతో ఈ వరదల కారణంగా ఆస్తి నష్టం ప్రాణా నష్టం జరుగుతోంది. ఇది ఇలా ఉంటే తాజాగా అమెరికాలో ఏకంగా కుంభవృష్టి వర్షం కురిసింది. అమెరికాలోని ఈశాన్య ప్రాంతంలో ఉన్న వెర్మాంట్‌ రాష్ట్ర రాజధాని మాంట్పెలియర్‌లో కుంభవృష్టి కురిసింది. సాధారణంగా వర్షాకాలంలో రెండు నెలలపాటు కురవాల్సిన వర్షపాతం ఆదివారం రాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాములోగా నమోదైంది.

ఈ దెబ్బకు రోడ్లు పూర్తిగా కొట్టుకుపోయాయి. దాంతో ఇళ్లు, దుకాణాలను ఖాళీ చేయిస్తున్నారు. వినూస్కీ నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. ఇది సుమారు 20.8 అడుగుల స్థాయికి చేరింది. 1927 లో గ్రేట్‌ వెర్మాంట్‌ వరదల తర్వాత ఈ స్థాయిలో మరెప్పుడు నీరు ప్రవహించలేదు. అయితే అప్పట్లో 87 మంది చనిపోయారు. తాజా వరదలపై సిటీ మేనేజర్‌ విలియం ఫ్రేసర్‌ స్పందిస్తూ ఈ వరద నష్టాన్ని ఇప్పట్లో చెప్పలేమని వెల్లడించారు. ఏకధాటిగా ఒకేసారి రెండు నెలల వర్షం కురవడంతో ప్రజల భయభ్రాంతులకు లోనవుతున్నారు. అమెరికా ఈశాన్య ప్రాంతంలో చాలా చోట్ల భారీగా వర్షాలు పడుతుండటంతో జనజీవనం స్తంభించింది.

రహదారులు కొట్టుకుపోవడంతో చాలా చోట్ల ప్రయాణాలు అక్కడికక్కడ నిలిచిపోయాయి. హడ్సన్‌ వ్యాలీలో ఒక్క ఆదివారమే 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. న్యూయార్క్‌లో జనజీవనం స్తంభించింది. ఇక న్యూ ఇంగ్లాండ్‌లో 11 మిలియన్ల మంది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. డజన్ల కొద్దీ ప్రజలు కార్లలో రోడ్లపై, వరదనీరు చుట్టుముట్టిన ఇళ్లలో చిక్కుకుపోయారు. అంతేకాకుండా వరదల దాటికి కొన్ని వాహనాలు వరదలో కొట్టుకుపోయాయి. ఈ వరదల కారణంగా అమెరికా ఈశాన్య ప్రాంతంలో 1.3 కోట్ల మంది ప్రభావితమయ్యారు. ఒకరు మరణించగా 50 మందిని సహాయ సిబ్బంది రక్షించారు. ఇప్పటి వరకు వరదల్లో న్యూయార్క్‌, ఈశాన్య అమెరికాలో 5 బిలియన్‌ డాలర్ల వరకు ఆస్తినష్టం వాటిల్లింది.

Exit mobile version