Site icon HashtagU Telugu

Non BJP CMs:కూటమి దిశగా మరో ముందడుగు…ముంబై వేదికగా బీజేపీయేతర ముఖ్యమంత్రుల భేటీ..!!

Telangana Chief Minister K Chandrashekar Rao With Maharashtra Chief Minister Uddhav Thackeray During A Press Conference

Telangana Chief Minister K Chandrashekar Rao With Maharashtra Chief Minister Uddhav Thackeray During A Press Conference

దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా కూటమికి అడుగులు పడుతున్నాయా..? త్వరలోనే బీజేపీయేతర రాష్ట్రాల సీఎంలు భేటీ కానుందా..?దీనికి ముంబై వేదిక కానుందా..?అంటే అవుననే అంటున్నారు శివసేన నేత సంజయ్ రౌత్. దేశంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులపై చర్చించేందుకు…ముంబై వేదికగా బీజేపీయేతర రాష్ట్రాలు సీఎంలు ఏకం కానున్నారు. ఆ దిశగా అడుగులు పడుతున్నట్లు శివసేన ఎంపీ…ఆ పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ సంకేతాలిచ్చారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ పనితీరు వ్యతిరేకిస్తూ ఆయా రాష్ట్రాల సీఎంలు అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ…ఈ మధ్యే అన్ని బీజేపీయేతర రాష్ట్రాల సీఎంలకు లేఖ రాశారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ నొక్కి చెప్పారని..సంజయ్ రౌత్ తెలిపారు. దీనిపై మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే, NCP అధినేత శరద్ పవార్ కలిసి చర్చించినట్లు ఆయన వెల్లడించారు. దీనిలో భాగంగా ముంబై వేదికగా బీజేపీయేతర ముఖ్యమంత్రుల సమావేశానికి ఏర్పాట్లు జరుగుతున్నట్లు వెల్లడించారు.

ఈ భేటీలో ముఖ్యంగా దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగం, మతపరమైన అల్లర్లు వంటి అంశాలు భేటీకి వచ్చే అవకాశం ఉన్నట్లు ఆయన తెలిపారు. అలాగే దేశవ్యాప్తంగా శ్రీరామనవమి, హనుమాన్ జయంతి వేడుకల సందర్బంగా జరిగిన ఘటనలు రాజకీయ ప్రేరేపితమైనవిగా ఆరోపించారు. త్వరలోనే ఎలక్షన్స్ జరగబోయే రాష్ట్రాల్లోనే ఓ వర్గం ఓటర్లను ఆకట్టుకునేందుకు ఇలాంటి కుట్రలు చేస్తున్నాయని వ్యాఖ్యానించారు. దేశంలో ఈ మధ్య చోటుచేసుకున్న విద్వేష ప్రసంగాలు, మతపరమైన హింసకు సంబంధించి కాంగ్రెస్ సహా 13 విపక్ష పార్టీల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఓ ప్రకటన రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బీజేపీయేతర ముఖ్యమంత్రుల సమావేశం కానుండటం…దేశ రాజకీయాల్లో హాట్ టాపిగ్గా మారింది.