ఇండియలో సివిల్ సర్వీసెస్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్ధులకు సంబంధించి.. వయోపరిమితి, నిర్ణీత అటెంప్ట్స్ విషయాల్లో ఎలాంటి సడలింపులకు అవకాశం లేదని పీఎంవో శాఖ మంత్రి జితేంద్ర సింగ్ ప్రకటించారు. కరోనా కారణంగా 2020 యూపీఎస్సీ సివిల్స్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్ధులకు వయోపరిమితి, నిర్ణీత అటెంప్ట్స్ విషయంలో సడలింపు ఇచ్చేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ కొందరు సివిల్స్ ఆశావహ అభ్యర్ధులు సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్లు దాఖలు చేశారని మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు.
అయితే దీనిపై గతంలో సుప్రీంకోర్టు జారీ చేసిన తీర్పులను పరిశీలించిన తర్వాత అభ్యర్ధుల వయోపరిమితి సడలింపు, అదనపు అటెంప్ట్స్‌కు అవకాశం కల్పించేలా, నిబంధనల్లో మార్పు తీసుకురావడం సాధ్యం కాదని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. పైన తెలిపిన కారణాల నేపధ్యంలో సివిల్స్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్ధులకు సడలింపులు ఇచ్చే ప్రతిపాదనేదీ ప్రభుత్వం వద్ద లేదని మంత్రి జితేంద్ర సింగ్ చేశారు. ఇక యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్ష 2022 సంవత్సరానికి గాను నోటిఫికేషన్‌ను గత వారం విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీంతో వయోపరిమితి సడలింపు, అదనపు అటెంప్ట్స్ విషయంలో సడలింపులు వస్తాయని ఆశించిన సివిల్ సర్వీసెస్ అభ్యర్ధులకు నిరాశే మిగిలింది.
