G20 Summit: మూడు రోజుల పాటు నో డెలివరీస్

ఢిల్లీలో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నారు. అనుమానితుల్ని ఎవరినీ వదలడం లేదు. రాష్ట్రంలోకి కొత్తగా వచ్చే వాహనాలకు అనుమతి లేదు.

G20 Summit: ఢిల్లీలో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నారు. అనుమానితుల్ని ఎవరినీ వదలడం లేదు. రాష్ట్రంలోకి కొత్తగా వచ్చే వాహనాలకు అనుమతి లేదు. మొత్తంగా ఢిల్లీని ఖాకీమయం చేశారు.ప్రతిష్టాత్మకమైన G20 సమ్మిట్‌కు భారత్ ఆతిథ్యం ఇస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ నెల 9, 10 తేదీల్లో జరగనున్న జీ20 దేశాధినేతల సదస్సుకు 20 దేశాల అధినేతలు, ఇతర ప్రతినిధులు హాజరుకానున్నారు. ఈ క్రమంలో ఢిల్లీలో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సభ జరిగే ప్రగతి మైదాన్‌లోని కాంప్లెక్స్‌తో సహా భారతదేశంలోని అతిథుల కోసం హోటళ్లు మరియు వసతి సౌకర్యాలను సిద్ధం చేశారు. ఢిల్లీ అంతటా పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలతో 24X7 నిఘా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఢిల్లీతోపాటు దాని పరిసర ప్రాంతాల్లో మూడు రోజుల పాటు పలు కఠిన ఆంక్షలు విధించారు.

ఇందులో భాగంగా ఈ నెల 8 నుంచి 10వ తేదీ వరకు ఢిల్లీలో ఆన్‌లైన్ డెలివరీ, క్లౌడ్ కిచెన్‌లు పూర్తిగా బంద్ కానున్నాయి. ఫుడ్ డెలివరీ కంపెనీలు స్విగ్గీ, జొమాటో సేవలను పూర్తిగా నిషేధించారు. మరియు అమెజాన్ మరియు ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ కంపెనీల డెలివరీలు కూడా పూర్తిగా నిలిపివేశారు. ఢిల్లీలోని NDMC ప్రాంతంలో డెలివరీ సేవలను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోమని ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 7వ తేదీ అర్ధరాత్రి నుంచి 10వ తేదీ వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. అదేవిధంగా ఈ నెల 7వ తేదీ అర్ధరాత్రి నుంచి 10వ తేదీ అర్ధరాత్రి వరకు ఢిల్లీలోకి కొత్తగా ప్రవేశించే వాహనాలపై కూడా ఆంక్షలు పెట్టారు.

మరోవైపు ఈ జీ20 సదస్సు నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఢిల్లీలో ఈనెల 8 నుంచి 10వ తేదీ వరకు ప్రభుత్వ సెలవు ప్రకటించింది. ఈ నెల 9, 10 తేదీల్లో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు సెలవు ప్రకటించారు. ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం అమలు చేయాలని ఢిల్లీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జీ20 సమావేశాలకు సంబంధించి అతిథులు, అధికారులు ప్రయాణించే ప్రాంతాల్లో పూర్తి ఆంక్షలు విధించారు. ఈ ఆంక్షలు అమల్లో ఉన్న నిర్దిష్ట ప్రాంతాల్లో థియేటర్లు, రెస్టారెంట్లను మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

Also Read: Digital Rupee: ఎస్‌బీఐ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. యూపీఐతో ఆ పేమెంట్స్ కూడా..!