Nipah Alert : కేరళలో మళ్లీ నిఫా వైరస్ (NiV) కలకలం రేగింది. దీంతో కోజికోడ్ జిల్లాలో హెల్త్ అలర్ట్ ను ప్రకటించారు. తాజాగా ఈ జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పద వైరల్ ఇన్ఫెక్షన్ లక్షణాలతో చికిత్సపొందుతూ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చనిపోయారు. చనిపోయిన వారిలో ఓ వ్యక్తి బంధువులు కూడా అవే లక్షణాలతో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో చికిత్సపొందుతున్నారు. ఈ కేసుల వ్యవహారం కేరళ ఆరోగ్య శాఖ దృష్టికి వెళ్లడంతో కోజికోడ్ జిల్లాలో సోమవారం హెల్త్ అలర్ట్ ను ప్రకటించారు. కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ దీనిపై సమీక్షించారు.
Also read : India Will Beat China: చైనాకు తగిన సమాధానం ఇవ్వనున్న భారత్.. సరిహద్దుల్లో కొత్త రోడ్లు, వంతెనలు, సొరంగాలు..!
ఇంతకుముందు 2018, 2021 సంవత్సరాల్లో కోజికోడ్ జిల్లాలో నిఫా వైరస్ వ్యాపించి పెద్దఎత్తున మరణాలు చోటు చేసుకున్నాయి. దక్షిణ భారతదేశంలో తొలి నిఫా వైరస్ కేసు 2018 మే 19న కోజికోడ్‌లో వెలుగుచూసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. నిఫా వైరస్ అనేది జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే జూనోటిక్ వ్యాధి. ఇది కలుషితమైన ఆహారం ద్వారా లేదా నేరుగా ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి కూడా సంక్రమిస్తుంది. ఇది సోకే వారిలో తీవ్ర శ్వాసకోశ సమస్యలు, ప్రాణాంతక ఎన్సెఫాలిటిస్ వంటి లక్షణలు కనిపిస్తాయి. నిఫా వైరస్ పందులపై చాలా ఫాస్ట్ గా ఎఫెక్ట్ చూపిస్తుంది. గతంలో నిఫా వైరస్ వ్యాపించిన టైంలో కేరళలో పెద్ద సంఖ్యలో పందుల మరణాలు కూడా సంభవించాయి. ఫలితంగా పందుల ఫామ్స్ నిర్వహించుకునే రైతులకు చాలా నష్టం వాటిల్లింది.