Telangana Medical Colleges: తెలంగాణాలో జిల్లాకో మెడికల్ కాలేజీ

తెలంగాణాలో మరో 9 మెడికల్ కాలేజీలు ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ 15న ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్‌లో ఈ మెడికల్ కాలేజీలను ప్రారంభించనున్నారు.

Telangana Medical Colleges: తెలంగాణాలో మరో 9 మెడికల్ కాలేజీలు ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ 15న ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్‌లో ఈ మెడికల్ కాలేజీలను ప్రారంభించనున్నారు. వచ్చే ఏడాది మరో ఎనిమిది కాలేజీలు ఏర్పాటు చేయనున్నారు. దీంతో తెలంగాణాలో మొత్తం ప్రభుత్వ మెడికల్ కాలేజీల సంఖ్య 34కి చేరనుంది. తద్వారా దేశంలోనే ప్రతి జిల్లాలో ఒక ప్రభుత్వ వైద్య కళాశాల ఉన్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ అవతరిస్తుంది.

రాష్ట్రంలో ఎనిమిది ప్రభుత్వ వైద్య కళాశాలల ఏర్పాటుకు జూలైలో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం, యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రి, మెదక్ జిల్లా మెదక్, వరంగల్ జిల్లా నర్సంపేట, ములుగు జిల్లా ములుగు, నారాయణపేట జిల్లా నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లా గద్వాల్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్‌లో కొత్తగా మెడికల్ కాలేజీలు రానున్నాయి. వీటిలో రెండు కళాశాలలు మహేశ్వరం, కుతుబుల్లాపూర్‌ హైదరాబాద్‌ శివార్లలో రానున్నాయి.

సీఎం కేసీఆర్ ఆశయం ప్రకారం ఒక జిల్లాకు ఒక వైద్య కళాశాల సాకారం కాబోతోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆరోగ్య తెలంగాణ దార్శనికతకు అనుగుణంగా, ఈ కళాశాలలు విద్యార్థులకు వైద్య విద్యను అభ్యసించేందుకు మరిన్ని అవకాశాలను పెంపొందిస్తాయని మరియు జిల్లాల్లో వైద్య సేవలను మరింత మెరుగుపరుస్తాయని ఆయన అన్నారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన సమయంలో కేవలం ఐదు ప్రభుత్వ వైద్య కళాశాలలు ఉస్మానియా, గాంధీ, వరంగల్ కాకతీయ, నిజామాబాద్, ఆదిలాబాద్ రిమ్స్ మాత్రమే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిదేళ్లలో 29 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను మంజూరు చేసింది.

Also Read: Kohli Fan Girl: వైరల్ అవుతున్న పాక్ బ్యూటీ కామెంట్స్.. పాక్ లో కోహ్లీ రేంజ్