NIA Raids: తెలుగు రాష్ట్రాల్లో NIA దాడులు, ఎందుకో తెలుసా?

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ దాడులు కలకలం రేపుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో మావోయిస్టు సానుభూతిపరులుగా అనుమానిస్తున్న వారిపై జాతీయ దర్యాప్తు సంస్థ

NIA Raids: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ దాడులు కలకలం రేపుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో మావోయిస్టు సానుభూతిపరులుగా అనుమానిస్తున్న వారిపై జాతీయ దర్యాప్తు సంస్థ సోమవారం మూకుమ్మడిగా దాడులు నిర్వహించింది. పౌర హక్కుల కార్యకర్తలు, అమర బంధు మిత్రుల సంఘం, కుల నిర్మూల సమితి, చైతన్య మహిళా సంఘం వంటి సంస్థల నాయకులు, వారి బంధువులు, వారితో సన్నిహితంగా ఉండే వారి ఇళ్లలో ఎన్‌ఐఏ అధికారులు ఈ రోజు తెల్లవారుజామున సోదాలు ప్రారంభించారు. అనుమానితులుగా భావిస్తున్న వారి కార్యకలాపాలు, మావోయిస్టులతో వారికి ఉన్న సంబంధాలపై అధికారులు వారిని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. సిఆర్‌పిసి సెక్షన్ 160 కింద వారికి నోటీసులు అందజేసి, ఏజెన్సీ ముందు హాజరుకావాలని ఆదేశించింది సదరు దర్యాప్తు సంస్థ. .

హైదరాబాద్‌లోని కార్యకర్త భవానీ, న్యాయవాది సురేష్‌ ఇళ్లలో కేంద్ర యంత్రాంగం సోదాలు నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, పొన్నూరు, మంగళగిరి, బాపట్ల, నెల్లూరు, ఆమదాలవలస, అనంతపురం తదితర ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. పొన్నూరులోని ప్రముఖ వైద్యుడు, గుంటూరు జిల్లా పౌర హక్కుల కమిటీ అధ్యక్షుడు రాజారావు ఇంట్లో ఎన్‌ఐఏ అధికారులు సోదాలు చేపట్టారు. ప్రజా తంత్ర పార్టీని నడుపుతున్న అతని స్నేహితుడు టి.సుబ్బారావు నివాసంలో కూడా సోదాలు జరిగాయి.

నెల్లూరులోని యెల్లంకి వెంకటేశ్వర్లు, తిరుపతిలోని క్రాంతి చైతన్య, తిరుపతిలోని కావలి బాలయ్య ఇళ్లలోనూ సోదాలు జరిగాయి. మాజీ ముఖ్యమంత్రి ఎన్.జనార్దన్ రెడ్డిపై బాంబు దాడి కేసులో కావలి బాలయ్య కుమార్తె పద్మ, అల్లుడు శేఖర్ నిందితులుగా ఉన్నారు.ప్రకాశం జిల్లా డి.వెంకట్‌రావు, సంతమాగులూరులో శ్రీనివాసరావు, రాజమండ్రిలో నాజర్, శ్రీకాకుళంలో కృష్ణయ్య, అనంతపురంలోని శ్రీరాములు ఇళ్లలో కూడా ఎన్‌ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

Also Read: KTR: ఈ నెల 6న వరంగల్ కు కేటీఆర్ రాక, భారీగా సంక్షేమ బహిరంగ సభ!