ఒకప్పుడు మానవులు గుహలనే ఆవాసాలుగా చేసుకుని వాటిలో ఏళ్ల తరబడి జీవిస్తూ ఉన్నారు. అయితే మానవులు గుహలో నివసించారు అనడానికి ఆ గోడలపై రకరకాల చిత్రాలే ఆనవాళ్లే అని చెప్పవచ్చు. ఇప్పటికే పరిశోధకులు అలాంటి ఎన్నో గుహలను కనుగొన్న విషయం తెలిసిందే. అవి రాతియుగం నాటి హోమోసేపియన్ మానవులు చిత్రించినవి. అయితే, వారి కంటే పూర్వీకులైన నియాండర్తల్ మానవులు చిత్రించిన గుహాచిత్రాలు ఇటీవల ఫ్రాన్స్‌లో తాజాగా బయటపడ్డాయి.
ఫ్రాన్స్‌లోని సెంటర్ వాల్ డి లోరీ ప్రాంతంలోనున్న లా రోష్ కోటార్డ్ గుహ గోడలపై చెక్కిన ఈ చిత్రాలు కనిపించాయి. వాటిని యూనివర్సిటీ ఆఫ్ టూర్స్‌కు చెందిన పరిశోధన బృందంలోని శాస్త్రవేత్తలు గుర్తించారు. పొడవాటి గీతలు, చుక్కలతో ఉబ్బెత్తుగా చెక్కిన ఈ చిత్రాలు దాదాపు 75 వేల ఏళ్ల కిందటివని పరిశోధకులు అంచనా వేశారు. ఈ గుహను వాడటం మానేసి 57 వేల ఏళ్లు అయ్యి ఉండవచ్చు అని వారు అంచనా వేస్తున్నారు.
ఆ చిత్రాలు నియాండర్తల్ మానవులు చెక్కినవేనని, ఇదివరకు దొరికిన నియాండర్తల్ మానవుల చిత్రాల కంటే ఇవి పురాతనమైనవని చెబుతున్నారు. జింక ఎముకలపై నియాండర్తల్ మానవులు చెక్కిన చిత్రాలు ఇదివరకు జిబ్రాల్టర్‌లో బయటపడ్డాయి. అవి దాదాపు 51 వేల ఏళ్ల నాటివని శాస్త్రవేతలు వెల్లడించారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.