Site icon HashtagU Telugu

Nepal Plane:నేపాల్ విమాన ప్రమాదం.. 14 మృతదేహాలు గుర్తింపు

Aircrash

Aircrash

నేపాల్ లో ఆదివారం ఉదయం మిస్సయిన తారా ఎయిర్ లైన్స్ విమానం ఆచూకీ ఎట్టకేలకు లభించింది. ముస్తాంగ్ జిల్లాలోని ఒక పర్వత ప్రాంతంలో విమానం కూలిపోయినట్లు గుర్తించారు. విమాన పైలట్ ఫోన్ ను జీపీఎస్ ద్వారా ట్రాక్ చేయడంతో విమానం ఆచూకీ దొరికింది. ప్రస్తుతం విమాన శిథిలాల వద్దకు నేపాల్ సైన్యం, పోలీసులు చేరుకున్నారు. విమానంలో మొత్తం 22 మంది ఉండగా, ఇప్పటివరకు 14 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి.

మిగితా వారి మృతదేహాలను గుర్తించేందుకు పరిసర ప్రాంతాల్లో గాలింపును ముమ్మరం చేశారు. మృతుల్లో మహారాష్ట్ర లోని థానే కు చెందిన అశోక్ కుమార్ త్రిపాఠి , ఆయన భార్య వైభవి త్రిపాఠి, వారి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఘటనా స్థలికి మరింత ఎక్కువ సంఖ్యలో సిబ్బందిని పంపి మృతదేహాల గాలింపు ను వేగవంతం చేస్తామని నేపాల్ అధికార వర్గాలు వెల్లడించాయి. కాగా, ఈ విమానం ఆదివారం ఉదయం బయలుదేరిన 15 నిమిషాల తర్వాత ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టం కు కనిపించకుండా పోయింది. దీంతో గాలింపు జరిపి విమానం ఆచూకీని నిన్నే గుర్తించారు. అయితే విమానం కూలిపోయిన ప్రాంతం వాహన రవాణాకు అనువుగా లేకపోవడంతో .. సిబ్బంది కొరత కారణంగా మృతదేహాల గాలింపు లో జాప్యం జరుగుతోంది.

Exit mobile version