నేపాల్‌లోని పోఖారా ఎయిర్‌పోర్టు సమీపంలో జరిగిన విమాన ప్రమాదంపై అక్కడి ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసింది. ఈ ఘటనలో మొత్తం 72 మంది మరణించినట్టు (72 People Died) వెల్లడించింది. అందులో 68 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నారని పేర్కొంది. వీరిలో ఐదుగురు భారతీయులు కూడా ఉన్నారు. ఖాట్మాండు నుంచి పొఖారా వెళ్తుండగా అదుపుతప్పిన విమానం ఒక్కసారిగా కూలిపోయింది. విమానంలో 53 మంది నేపాల్, ఐదుగురు భారత్, నలుగురు రష్యా, ఐర్లాండ్ నుంచి ఒకరు, కొరియా నుంచి ఇద్దరు, అర్జెంటీనా నుంచి ఒకరు, ఫ్రాన్స్ నుంచి ఒకరు ప్రయాణిస్తున్నట్లు ఎయిర్‌పోర్టు అథారిటీ నివేదించింది.
ప్రమాదం జరిగిన వెంటనే విమానంలో పెద్దఎత్తున మంటలు చెలరేగాయని, అప్రమత్తమైన ఎయిర్‌పోర్టు అధికారులు హుటాహుటిన రెస్క్యూ ఆపరేషన్ మొదలు పెట్టారని ఖాట్మండు పోస్ట్ పేర్కొంది. ప్రమాదం కారణంగా పొఖారా ఎయిర్‌పోర్టులోకి విమానాల రాకపోకలను నిలిపివేశారు. కాగా ప్రమాదం నేపథ్యంలో నేపాల్ క్యాబినెట్ అత్యవసరంగా సమావేశమైంది. ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.