Neeraj Chopra: ఎదిగినా ఒదిగి ఉండటం అంటే ఇదే.. అభిమానులతో నీర‌జ్‌చోప్రా ప్రవర్తనకు ఫిదా !

"ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే వాళ్లే గొప్పవాళ్లు" అంటారు పెద్దలు. ఇలాంటి గొప్ప లక్షణం మన గోల్డెన్ ఒలంపియన్, ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ నీరజ్ చోప్రాలో కనిపించింది.

  • Written By:
  • Publish Date - July 2, 2022 / 10:30 PM IST

“ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే వాళ్లే గొప్పవాళ్లు” అంటారు పెద్దలు. ఇలాంటి గొప్ప లక్షణం మన గోల్డెన్ ఒలంపియన్, ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ నీరజ్ చోప్రాలో కనిపించింది. ఒలింపిక్స్ లో దేశానికి బంగారు పతకం సాధించాననే అహంభావం ఆయనలో మచ్చుకు కూడా కనిపించడం లేదు. ఇందుకు నిదర్శనంగా నిలిచే ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో నీరజ్ చోప్రా.. తన కంటే పెద్ద వయస్కుడైన ఒక ఫ్యాన్ కాళ్లను తాకి ఆశీర్వాదం తీసుకోవడాన్ని స్పష్టంగా చూడొచ్చు. ఈ వీడియోను ట్విట్టర్ లో ఓ వ్యక్తి పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే వేలాది లైక్స్, వ్యూస్ వచ్చాయి. నీర‌జ్ చోప్రా త‌న ఫ్యాన్స్‌కు ఎంత గౌర‌వ‌మిస్తాడో దీన్నిబట్టి తెలుసుకోవచ్చని పేర్కొంటూ నెటిజన్స్ కామెంట్స్ వెల్లువెత్తాయి. నీర‌జ్ చోప్రా.. డౌన్ టు ఎర్త్ వ్య‌క్తి అని ఇంకొందరు ప్రశంసించారు. కాగా, అథ్లెటిక్స్ విభాగంలో ప్రస్తుతం నీరజ్ చోప్రాది ప్రపంచ రెండో ర్యాంక్. భారత సైన్యంలో జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ గానూ జాబ్ చేస్తున్నారు.

జాతీయ రికార్డును బ‌ద్ద‌లు కొట్టాడు

గతంలో తాను నెల‌కొల్పిన జాతీయ రికార్డును ఇటీవల జ‌రిగిన ఒక ఈవెంట్‌లో నీరజ్ చోప్రా బ‌ద్ద‌లు కొట్టాడు. జూన్ 14న తుర్కులో జ‌రిగిన పావే నుర్మి గేమ్స్‌లో నీర‌జ్ త‌న జావెలిన్‌ను 89.30 మీట‌ర్ల దూరం విసిరి జాతీయ రికార్డును నెల‌కొల్పాడు. ఈ గురువారం స్వీడ‌న్‌లోని స్టాక్‌హోమ్‌లో జ‌రిగిన ఈవెంట్‌లో నీర‌జ్ త‌న జావెలిన్‌ను 89.94 మీట‌ర్ల దూరం విసిరి సిల్వ‌ర్ ప‌త‌కాన్ని సొంతం చేసుకున్నాడు. దీంతో అతడి జాతీయ రికార్డు కూడా బ్రేక్ అయింది.