BSP: బీఎస్ పీ నుంచి నీలం మధు నామినేషన్

  • Written By:
  • Updated On - November 10, 2023 / 06:24 PM IST

BSP: నామినేషన్ వేసేదాక అభ్యర్థులు ఏ పార్టీలో ఉంటారు అనేది చెప్పలేం. చివరి టైంలో కొన్ని పార్టీలు తిరస్కరించే అవకాశాలు కూడా ఉన్నాయి. దీంతో అభ్యర్థులు వేరే పార్టీలో చేరి నామినేషన్ వేస్తుంటారు. ఇక పటాన్‌చెరు స్థానిక నేత నీలం మధు తొలుత బీఆర్ఎస్‌లో ఉన్నారు. అయితే.. బీఆర్ఎస్ నుంచి పటాన్‌చెరు టికెట్‌ తనకే లభిస్తుందని ఆశలు పెట్టుకున్నారు. అయితే.. అధిష్టానం మాత్రం ఆయన ఆశలపై నీళ్లు చల్లింది. సిట్టింగ్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డికే టికెట్‌ కేటాయించింది. దాంతో.. నీలం మధు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్‌ పార్టీని వీడారు. ఆ తర్వాత నీలం మధు కాంగ్రెస్‌, బీజేపీలో టికెట్‌ కోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఆ పార్టీలు కూడా ఆయన్ని ఆహ్వానించాయి.

కానీ.. తనకు పటాన్‌చెరు టికెట్‌ కేటాయిస్తేనే వస్తానని పట్టుబట్టారు. చివరకు ఆయన డిమాండ్‌కు కాంగ్రెస్‌ ఒప్పుకుని హామీ ఇచ్చింది. దాంతో.. కొద్ది రోజుల క్రితమే నీలం మధు కాంగ్రెస్‌లో చేరారు. అయితే.. కాంగ్రెస్‌ కూడా ఆయనకు టికెట్‌ ఇచ్చినట్లే అంటూ ప్రకటన చేసి.. పెండింగ్‌లో పెట్టింది. నీలం మధుకు టికెట్‌ ఇస్తామనడాన్ని ఆ పార్టీ మరో నేత కాటా శ్రీనివాస్‌ తీవ్రంగా వ్యతిరేకించారు. తొలి నుంచీ పార్టీలో కష్టపడిన తమకు కాకుండా కొత్తగా చేరిన వ్యక్తికి టికెట్‌ ఖరారు చేయడమేంటని పార్టీ పెద్దలను నిలదీశారు. గాంధీ భవన్‌ వద్ద ఆందోళనలు కూడా నిర్వహించారు. చివరకు ఆయన బీఎస్ పీ నుంచి నామినేషన్ వేశారు.