Navneet Vs Uddhav:మహారాష్ట్ర సీఎంకు మాజీ తెలుగు హీరోయిన్ సవాల్.. ఎంపీ నవనీత్ కౌర్ బ్యాక్ గ్రౌండ్!

నవనీత్ కౌర్ ను చూస్తే.. అరే.. మన తెలుగు మాజీ హీరోయిన్ కదా అని చాలామంది అనుకుంటారు. కాస్త పాలిటిక్స్ తో టచ్ ఉన్నవాళ్లయితే..

  • Written By:
  • Publish Date - April 24, 2022 / 10:54 AM IST

నవనీత్ కౌర్ ను చూస్తే.. అరే.. మన తెలుగు మాజీ హీరోయిన్ కదా అని చాలామంది అనుకుంటారు. కాస్త పాలిటిక్స్ తో టచ్ ఉన్నవాళ్లయితే.. అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ రానా అని గుర్తుచేసుకుంటారు. కానీ ఇప్పుడు దేశమంతా నవనీత్ కౌర్ పేరు వినిపిస్తోంది. ఎందుకంటే ఆమె, ఆమె భర్తా నేరుగా మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రేనే ఢీకొడుతున్నారు. ఉద్దవ్ ఠాక్రే వ్యక్తిగత నివాసం మాతోశ్రీకి వచ్చి హనుమాన్ చాలీసా చదువుతాము.. ధైర్యముంటే అడ్డుకోవాలని సవాల్ విసిరి.. మరోసారి వార్తల్లో నిలిచారు. పంజాబ్ కు చెందిన నవనీత్ కౌర్ కు ఇంతటి రాజకీయ అనుభవం ఎలా వచ్చింది? అసలు ఆమె వెనక ఉన్నది ఎవరు?

సినిమాల నుంచి రాజకీయాల్లోకి చాలామంది హీరోయిన్లు వస్తారు. కానీ వారిలో చాలామంది ఒకసారో, రెండుసార్లో గెలిచి వెళ్లిపోతారు. కానీ కొద్దిమంది మాత్రమే జనం గుండెల్లో నిలిచిపోతారు. ప్రజా సమస్యలపై పోరాడి దూసుకుపోతారు. అలాంటివారిలో నవనీత్ కౌర్ ఒకరు. ఈ పంజాబ్ ఆడపడుచు.. మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రేనే ఢీకొట్టడంతో అటు ఆ రాష్ట్రంలోను, ఇటు పంజాబ్ లోను, ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లోనూ నవనీత్ కౌర్ విధానాలపై ఆసక్తి పెరిగింది. ఆమెకు ఈ స్థాయిలో పోరాడేశక్తి ఎలా వచ్చిందా అని ఆరా తీస్తున్నాయి.

నవనీత్ కౌర్ రానాకు తెలుగు బాగా వచ్చు. అందుకే లోక్ సభలో చాలాసార్లు తెలుగులో మాట్లాడి తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఎవరైనా తెలుగు ఎంపీలు తన ప్రసంగానికి అడ్డు తగిలినా, వ్యతిరేకంగా మాట్లాడినా సరే..ఆమె కూడా తెలుగులోనే మాట్లాడేవారు. ఉద్దవ్ ఠాక్రే హిందుత్వను మరిచిపోయారని.. ఆయన మార్గం మారిందని.. అందుకే ఆ చర్యలను అడ్డుకోవడానికే హనుమాన్ చాలీస్ ప్రోగ్రామ్ కు స్కెచ్ వేశామన్నారు నవనీత్ కౌర్ రాణా. నవనీత్ కౌర్ మాతోశ్రీకి వచ్చి నిరసన తెలుపుతానని 2020లో కూడా అనడంతో అప్పుడూ ఆమెపై అందరి ఫోకస్ పడింది.

ఈమధ్యకాలంలో మహారాష్ట్ర రాజకీయాల్లో నవనీత్ కౌర్ రానాతోపాటు ఆమె భర్త రానా పేర్లు ఎక్కువగా విపిస్తున్నాయి. హిందుత్వ విధానంతో వీరు బీజేపీకి దగ్గరవుతున్నారన్న టాక్ ఉంది.
నవనీత్ కౌర్ రానా భర్త పేరు రవి రానా. ఆయన ఎమ్మెల్యే. మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ కు సన్నిహితంగా మెలుగుతారు. ఇక నవనీత్ కౌర్ 2019 ఎన్నికల్లోనే లోక్ సభకు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు ఆమెకు లోకల్ గా కాంగ్రెస్ పాటు ఎన్సీపీలు సపోర్టి ఇచ్చాయి. దీంతో ఆమె విజయం సులభమైంది.

తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా చేసినప్పుడు నవనీత్ కౌర్ గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. అప్పుడెప్పుడో 2003లో వచ్చిన శ్రీను వాసంతి లక్ష్మి సినిమాతో కెరీర్ మొదలుపెట్టిన నవనీత్ కౌర్ సుమారు 20 సినిమాల్లో యాక్ట్ చేశారు. రామ్ దేవ్ బాబా యోగా శిబిరంలో నవనీత్ కౌర్.. రవి రాణా ఒకరికొకరు కలుసుకున్నారు. అప్పటికే రవిరాణా ఎమ్మెల్యే. ఆ తరువాత ఒకరికొకరు నచ్చడంతో కుటుంబాలను ఒప్పించి 2011లో పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లికి అప్పటి మహారాష్ట్ర సీఎం పృథ్విరాజ్ చవాన్, మంత్రి నారయణ్ రానే, వివేక్ ఒబెరాయ్, సహారా చీఫ్ సుబ్రతోరాయ్.. ఇలా ఎంతోమంది వీవీఐపీలు, వీఐపీలు వచ్చారు. సుమారు మూడున్నర వేల మంది అతిథుల సమక్షంలో వైభవంగా వీరిపెళ్లి జరిగింది.

రవి రాణాతో పెళ్లయిన తరువాత 2014 లోక్ సభ ఎన్నికల్లో అమరావతి నుంచి నవనీత్ రాణా పోటీ చేశారు. కానీ అప్పటికే అక్కడ శివసేన నాయకుడు ఆనంద్ రావ్ బరిలో ఉన్నారు. లోకల్ సెంటిమెంట్ ఆయనకు కలిసొచ్చింది. అందుకే తొలి పోటీలో నవనీత్ కు ఓటమి తప్పలేదు. అయినా ఆమె కుంగిపోలేదు. నెక్స్ట్ టైమ్ ఎలాగైనా గెలవాలని.. పేదల ఇళ్లకు వెళ్లి భోజనం చేయడం, రోటీలు చేసి పెట్టడం..ఇలా ఎన్నో కార్యక్రమాలు చేసి సగటు ఓటరు మనసును గెలుచుకున్నారు. విదర్బ ప్రాంతంలో చాలామంది మరాఠీ మాట్లాడడానికి ఇష్టపడకపోయినా సరే.. నవనీత్ కౌర్ రానా మాత్రం మరాఠీ నేర్చుకుని మరీ మాట్లాడతానని చెప్పారు. దీనిని బట్టి ఆమె పట్టుదల ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

నవనీత్ కౌర్ రాణా చేసిన ప్రయత్నాలు 2019 ఎన్నికల్లో బాగా కలిసొచ్చాయి. దీనికి కాంగ్రెస్, ఎన్సీపీల మద్దతు ప్లస్సయింది. ఇంకేముంది స్వతంత్ర అభ్యర్థిగానే అదే అమరావతి నియోజకవర్గం నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. కాకపోతే నవనీత్ కౌర్.. తన కులధ్రువీకరణ పత్రం నకిలీదన్న కేసును ఎదుర్కోవాల్సి రావడం, హైకోర్టు కూడా అదే విధంగా తీర్పు ఇవ్వడంతో నవనీత్ కు చిక్కులు మొదలయ్యాయి అనుకున్నారు. కానీ ఆమె ఈ కేసు విషయంలో సుప్రీంకోర్టుకు వెళ్లారు. సర్వోన్నత న్యాయస్థానం ఈ కేసును పెండింగ్ లో పెట్టింది.

2019 లో కాంగ్రెస్, ఎన్సీపీల మద్దతుతోనే ఎన్నికైనా.. ఇప్పుడు మాత్రం నవనీత్ చేస్తున్న రాజకీయాలు బీజేపీకి దగ్గరగా ఉన్నాయి. అందుకే హిందుత్వ విధానాలను మరిచిపోయారంటూ.. ఏకంగా మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రేపైనా రాజకీయ దండయాత్ర చేశారు. దీంతో మహారాష్ట్రతోపాటు జాతీయస్థాయిలో ఆమెకు పాపులారిటీ పెరిగింది. ఇక నవనీత్ భర్త రవిరాణా ఏ పార్టీ అధికారంలో ఉంటే దానివైపే ఉంటారు. కానీ ఈసారి అలా జరగలేదు. ఎందుకంటే మహారాష్ట్రలో పవర్ లో ఉన్న శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీని కాదని.. బీజేపీకి దగ్గరవుతున్నారు. అందుకే ఉద్దవ్ ఠాక్రేకు వ్యతిరేకంగా నవనీత్ రానా దంపతులు వెళుతున్నారు. రాజకీయాల్లో ఎలా ఎదగాలో నవనీత్ కౌర్ రానా దంపతులకు బాగా తెలుసంటారు విశ్లేషకులు. మరి ఈ రాజకీయ పయనం.. వారి భవితను ఎలాంటి మలుపు తిప్పుతుందో చూడాలి.