Site icon HashtagU Telugu

Generic Drugs: వైద్యులు రోగులకు జనరిక్ మందులే రాయాలి..జాతీయ వైద్య కమిషన్..!!

Dangerous Medicines

Dangerous Medicines

వైద్యులు ఇక నుంచి జనరిక్ మందులే రాయాలి..షాపులు పెట్టి మందులు విక్రయించకూడదంటూ నేషనల్ మెడికల్ కమిషన్, రిజిస్టర్డ్ ప్రాక్టీషనర్ రెగ్యులేషన్ -2022 పేరుతో జాతీయ వైద్య కమిషన్ ఓ నియామావళిన తన వెబ్ సైట్లో పొందుపర్చింది. వైద్యులు వృత్తి నియమావళి ముసాయిదాపై ఏవైనా సలహాలు, సూచనలు, అభ్యంతరాలు ఉన్నట్లయితే ..వచ్చే నెల 22 లోగా తమకు తెలియజేయాలని కమిషన్ కోరింది.

NMC నియమావళి ప్రకారం.. వైద్యులు బ్రాండెడ్ మందులు రాయకూడదు. వాటికి బదులుగా జనరిక్ మందులనే రాయాలి. అనవసరమైన మందులు, కాంబినేషన్స్ సిఫార్సు చేయవద్దు. అలాగే, వైద్యులు మందుల షాపులు పెట్టి రోగులకు ఔషధాలను ఎట్టిపరిస్థితిలోనూ విక్రయించకూడదు. అయితే, తమ వద్దకు వచ్చే రోగులకు అవసరమైన మందులను విక్రయించుకోవచ్చు.

ఇక ఒక డాక్టర్ రాసిన మందులను మరొక డాక్టర్ రోగులకు విక్రయించకూడదు. ఆపరేషన్‌కు ముందు రోగుల నుంచి అంగీకార పత్రాన్ని తప్పకుండా తీసుకోవాలి. రోగికి ఒకవేళ అత్యవసరంగా సర్జరీ చేయాల్సి వచ్చిన సందర్భంలో అతడి అటెండెంట్స్ ఎవరూ లేకపోతే వైద్యుడే నిర్ణయం తీసుకోవచ్చని NMC తన ముసాయిదాలో వెల్లడించింది. అలాగే, రోగికి ఒకేసారి రెండుమూడు ఆపరేషన్లు చేయాల్సి వచ్చిన సందర్భంలోనూ అవేంటో, ఎందుకు చేయాలో చెబుతూ రోగి నుంచి అంగీకార పత్రం తీసుకోవల్సి ఉంటుంది.

తన వద్దకు వచ్చిన రోగికి చికిత్స ఖర్చు ఎంత అవుతుందో వారికి ముందుగానే తెలియజేయాలి. ఆ మొత్తాన్ని అతడు భరించలేకుంటే చికిత్స నిరాకరించే హక్కు డాక్టర్లకు ఉండదు. అన్నింటికంటే ముఖ్యమైంది ఏంటంటే. బహుళజాతి ఫార్మా కంపెనీల నుంచి తాము ఎలాంటి ప్రతిఫలం పొందలేదని తెలుపుతూ వైద్యులు ఓ అఫిడవిట్‌ను ప్రతి ఐదేళ్లకోసారి NMCకి ఇవ్వాల్సి ఉంటుంది. రోగుల వివరాలను చట్టపరంగా అవసరమైతే తప్ప ఎట్టిపరిస్థితుల్లోనూ బటయకు పొక్కనివ్వద్దు. NMC వైద్య వృత్తి నియమావళిని అతిక్రమిస్తే మాత్రం వైద్యుల లైసెన్స్‌ను రద్దు చేస్తారని కమిషన్ తన వెబ్ సైట్లో పేర్కొంది.