Site icon HashtagU Telugu

Kashmir Files : కాశ్మీర్ ఫైల్స్ కు జాతీయ సమగ్రతా పురస్కారమా?

National Integrity Award For Kashmir Files

National Integrity Award For Kashmir Files

By: డా. ప్రసాదమూర్తి

Kashmir Files : సోషల్ మీడియాలో అల్లు అర్జున్ కి జాతీయస్థాయి ఉత్తమ నటుడిగా అవార్డు రావడం పై విమర్శలు, ప్రతి విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఈ సందడిలో మన తెలుగువాళ్లు గమనించని ఒక విషయం తెరమరుగున పడిపోయింది. అదే కాశ్మీర్ ఫైల్స్ కి కూడా అవార్డు వచ్చిన విషయం. ఇదేదో మామూలు అవార్డు కాదు. ఏకంగా జాతీయ సమగ్రత కేటగరీలో ఈ సినిమాకు అవార్డు వచ్చింది.

జాతీయస్థాయి చలనచిత్రాలకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించే అవార్డులు అంటే ఒక చరిత్ర ఉంది. ఆ అవార్డులకు ఒక విలువ, ఒక విశిష్టత, ఒక వైభవం, ఒక గర్వం ఉన్నాయి. కానీ ఇవన్నీ ఇప్పుడు చరిత్రలో ఒక భాగం అయిపోయాయి. అంటే అదంతా గత వైభవంగానే మిగిలిపోయింది. ప్రస్తుతం ఈ అవార్డుల చుట్టూ రాజకీయాలు అలుముకున్నాయి. రాజకీయం లేకుండా ఈ దేశంలో ఇప్పుడిక ఏదీ జరగదు అనేది జాతీయ స్థాయి చలనచిత్ర అవార్డులు తేల్చి చెప్పేశాయి. కళా సాంస్కృతిక రంగాలలో కూడా రాజకీయాలదే ఫైచేయి కావడం కించిత్తు బాధాకరమే కానీ అదే సత్యం. ఆ సత్యం ఏమిటో ఒకసారి చూద్దాం.

తాజాగా 69వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో అనేక కేటగిరీలలో భారతీయ భాషలలోని అనేక చిత్రాలకు ఆదరణ లభించింది. కానీ ప్రభుత్వం ప్రకటించిన ఈ తాజా అవార్డులలో ఎక్కువగా రాజకీయ కోణం కనిపిస్తుంది అన్న అభిప్రాయం స్పష్టంగా వ్యక్తమవుతోంది. ముఖ్యంగా జాతీయస్థాయిలో విమర్శ ఎదుర్కొన్న సినిమా కాశ్మీర్ ఫైల్స్ (Kashmir Files). ఈ సినిమా దేశంలో మతసామరస్యాన్ని దెబ్బతీసేదిగా ఉందని పలువురు మేధావులు, పలువురు లౌకికవాదులు, పలువురు సినీ క్రిటిక్స్, పలువురు కళాకారులు విమర్శించారు. అంతేకాదు విదేశాల సినిమా ప్రముఖులు కూడా కాశ్మీర్ ఫైల్స్ ఒక ప్రచారం మాత్రమే అని కొట్టి పడేశారు. గోవాలో జరిగిన ఫిల్మోత్సవంలో ఈ విమర్శలు తారాస్థాయికి చేరుకున్నాయి. సరే, అలా విమర్శించిన వారిపై ఎదురుదాడికి దిగిన వారు కాశ్మీర్ ఫైల్స్ చిత్రంతో ముడిపడి ఉన్న డైరెక్టరో, నిర్మాతో కాదు. సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ప్రముఖులే కాశ్మీర్ ఫైల్స్ ని విమర్శించిన వారిపై విరుచుకుపడ్డారు.

ఈ సినిమా స్పష్టంగా దేశంలో అటు హిందుత్వ వాదులకు, ఇటు లౌకిక వాదులకు మధ్య ఒక స్పష్టమైన విభజన రేఖను గీసింది. ఆ విధంగా ఈ సినిమా చాలా చర్చనీయాంశంగా మారిపోయింది‌. ఆఖరికి ఈ సినిమా ప్రభుత్వంలో ఉన్న హిందుత్వవాదులకు అత్యంత ప్రముఖమైన ప్రచారాస్త్రంగా కూడా మారిన విషయం మనకు తెలుసు. కానీ ఇలా కళా సాంస్కృతిక రంగాలను దేశంలో వివిధ వర్గాల మధ్య వైషమ్యాలు సృష్టించడానికి వినియోగించుకోవడం దేశ సమగ్రతకు, ప్రజల మధ్య సామరస్యానికి ప్రమాదకరం అని ఎందరో ప్రముఖులు, మేధావులు కళాకారులు చెబుతూనే వస్తున్నారు. సరే ఇదంతా ఈ చిత్రం సృష్టించిన కలకలం నేపథ్యం.

మరి ఇప్పుడు ఏం జరిగింది? కేంద్రం ప్రకటించిన 69వ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో కాశ్మీర్ ఫైల్స్ (Kashmir Files) చిత్రానికి పెద్ద పీట లభించింది. వేరే ఏదైనా కేటగిరీలో ఈ సినిమాకి అవార్డు ఇస్తే ఎవరూ పెద్ద పట్టించుకునే వారు కాదు. ఏకంగా ఈ చిత్రానికి జాతీయ సమగ్రతలో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ గా నర్గిస్ దత్ అవార్డును ప్రకటించారు. ఇది ఒక్కసారి దేశాన్ని ఆశ్చర్యంలో ముంచి వేసింది. ఇది చాలా బహిరంగంగా, నిస్సిగ్గుగా ప్రభుత్వం తన ఎజెండాను నెరవేర్చుకోవడానికి చేసిన పని అని ఇప్పుడు దేశమంతా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాదు దేశంలో వివిధ భాషలు వివిధ మతాలు, వివిధ కులాలు, వివిధ వర్గాలు, వివిధ ప్రాంతాలు కలిసిమెలిసి ఐకమత్యంతో జీవిస్తున్న విషయం మనకు తెలుసు.

అలాంటి సుహృద్భావ వాతావరణాన్ని దెబ్బతీసే ఏ పనైనా.. చిత్రమైనా.. కళా రంగమైనా అది దేశ సమగ్రతకు, సమైక్యతకు ప్రమాదమనే చెప్పాలి. కానీ ఏలిన వారి విషయంలో కాశ్మీర్ ఫైల్స్ దేశ సమగ్రతకు ఒక నమూనాగా కనిపించింది. అందుకే ఆ సినిమాకు దేశ సమగ్రత కేటగిరీలో అవార్డును ప్రకటించారు. అంతేకాదు ఈ సినిమా డైరెక్టర్ వివేక్ రంజన్ అగ్నిహోత్రి సహచరి, పల్లవి జోషికి ఉత్తమ సహాయక నటిగా కూడా అవార్డు ప్రకటించి ప్రభుత్వం తన విధేయుడిని వినమ్రంగా గౌరవించుకుంది.

అదీ సంగతి. సినిమాను తమ రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చే ఒక అద్భుత కళావాహికగా ప్రభుత్వం వాడుకోవాలని కృతనిశ్చయంతో ఉన్నది. ఈ విషయాన్ని కాశ్మీర్ ఫైల్స్ కి ప్రకటించిన అవార్డు దేశానికి స్పష్టం చేసింది.

Also Read:  Jio AirFiber : మండే రోజు మరో సంచలనం.. ‘జియో ఎయిర్ ఫైబర్’ వస్తోంది..