Site icon HashtagU Telugu

Politics: మళ్లీ మూడు సాగు చట్టాలు?

Template (65) Copy

Template (65) Copy

కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ నాగపూర్‌లోని ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ .. వ్యవసాయ చట్టాలను భవిష్యత్తులో ఎప్పుడైనా తిరిగి ప్రవేశపెట్టే అవకాశం ఉందని అన్నారు. తాము కేవలం ఒక అడుగు వెనక్కి వేశామని వ్యవసాయ రంగంలో ప్రైవేటు పెట్టుబడులు అవసరమని పేర్కొన్నారు. గత నెలలో ప్రధాని నరేంద్ర మోదీ వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. చట్టాల విషయంలో ఆయన ఒక్కసారిగా మడమ తిప్పడం ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌ ఎన్నికల భయంతోనేనని విపక్షాలు, రాజకీయ విశ్లేషకులు తేల్చారు. అందుకు తగ్గట్టుగా ఢిల్లీలో ధర్నా చేసిన రైతుల్లో అధికులు ఈ రెండు రాష్ట్రాల వారే కావడం గమనార్హం.

సాగు చట్టాలను ఉపసంహరించుకున్న తర్వాత కూడా యూపీ, పంజాబ్‌లలో బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి. దృఢమైన నాయకుడిగా ప్రధాని మోదీకి ఉన్న ప్రతిష్ఠ వ్యవసాయ చట్టాల ఉపసంహరణతో సన్నగిల్లిందని, పారిశ్రామిక వేత్తలు కూడా ఈ వెనుకడుగుతో అసంతృప్తి వ్యక్తం చేశారని తెలుస్తోంది. దీంతో.. మోదీ సర్కారు మళ్లీ చట్టాలను తెచ్చేందుకు సిద్ధమవుతోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తన ప్రతిష్ఠను పునరుద్ధరించుకొనేందుకే మోదీ తోమర్‌ను ప్రయోగించారని భావిస్తున్నారు. వచ్చే బడ్జెట్‌ సమావేశాల్లో సాగు చట్టాలు మరో రూపంలో వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

కాగా.. యూపీ, పంజాబ్‌ ఎన్నికల తర్వాత చట్టాలను తిరిగి అమలు చేసేందుకు కేంద్రం కుట్ర పన్నుతోందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. ఎన్నికల్లో ఓడించడం ద్వారా బీజేపీకి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.

Exit mobile version