Nara Lokesh: తెలుగు ప్రజానీకానికి నారా లోకేష్ బహిరంగ లేఖ!

చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో నారా లోకేశ్ తెలుగు ప్రజలకు బహిరంగ లేఖను రాశారు.

  • Written By:
  • Publish Date - September 11, 2023 / 05:48 PM IST

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ తో ఏపీలో టీడీపీ నేతలు ఆందోళన బాట పట్టారు. రాస్తారోకోలు, ధర్నాలతో హోరెత్తించారు. వెంటనే బాబును విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే టీడీపీ ముఖ్య నేతలు గవర్నర్ కలిశారు. తాజాగా టీడీపీ ముఖ్యనేత నారా లోకేశ్ ఏపీ ప్రజలకు లేఖ రాశారు.

‘‘బాధతో, బరువెక్కిన హృదయంతో, కన్నీళ్లు నిండిన కళ్ళతో ఈరోజు మీకు ఈ లేఖ రాస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తెలుగు ప్రజల అభ్యున్నతి కోసం మా నాన్నగారు తన హృదయాన్ని మరియు ఆత్మను ధారపోయడం చూస్తూ నేను పెరిగాను. లక్షలాది జీవితాలను మార్చడానికి నిర్విరామంగా ప్రయత్నిస్తున్న ఆయనకు విశ్రాంతి రోజు అన్నది తెలియదు. రాజకీయాల్లో ఆయన ఆచరణలు ఎల్లప్పుడూ గౌరవం మరియు నిజాయితీతో గుర్తించబడ్డాయి. తాను సేవ చేసిన వారి ప్రేమ మరియు కృతజ్ఞతల నుండి ఆయన లోతైన ప్రేరణ పొందడం నేను చూశాను. వారి హృదయపూర్వక కృతజ్ఞతలు ఆయన మనసును పిల్లల ఆనందానికి సమానమైన స్వచ్ఛమైన సంతోషంతో నింపేవి.

నేను కూడా నాన్నగారు నడిచిన ఉన్నతమైన మార్గం నుండి ప్రేరణ పొంది ఆయన అడుగుజాడలను అనుసరించాలనుకున్నాను. అందుకే అమెరికాలో సౌకర్యవంతమైన ఉద్యోగాన్ని వదిలి భారతదేశానికి తిరిగి వచ్చాను. నాకు మన దేశం, మన వ్యవస్థలు, మన సాంస్కృతిక మూలాలు… అన్నిటినీ మించి మన రాజ్యాంగంపై ఉన్న అపారమైన నమ్మకం నన్ను జన్మభూమికి రప్పించాయి. కానీ ఈ రోజు, మా నాన్నగారు ఎప్పుడూ చేయని నేరానికి అన్యాయంగా రిమాండ్‌కు వెళ్లడం చూస్తుంటే, నాకు కోపం తన్నుకొస్తోంది. రక్తం ఉడికిపోతుంది. రాజకీయ పగలకు హద్దులు లేవా? తన దేశం కోసం, రాష్ట్రం కోసం, తెలుగు ప్రజల కోసం ఇంతగా శ్రమించిన వ్యక్తి ఇంత అన్యాయాన్ని ఎందుకు భరించాలి? ఆయన ఏ రోజు కూడా పగ లేదా విధ్వంసక రాజకీయాలకు దిగలేదు? అయినా ఆయనకు ఎందుకిలా జరిగింది? ఇతరుల కంటే ఎంతో ముందుగా తన రాష్ట్ర ప్రజలకు అభివృద్ధి, సంక్షేమం మరియు అవకాశాలను అందించాలని కోరుకున్నందుకా?

ఈరోజు ఇదొక నమ్మకద్రోహంలా అనిపిస్తుంది. అయినప్పటికీ బెదిరేది లేదు. మా నాన్నగారొక పోరాట యోధుడు. నేనూ అంతే. ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల కోసం… చెదరని సంకల్పంతో కార్యకర్తలకు, ప్రజలకు మార్గనిర్దేశం చేస్తూ… తిరుగులేని శక్తిగా ఎదుగుతాం. సర్వ శక్తులనూ కలగలుపుకుని అన్యాయంపై, అక్రమంపై పోరాడుతాం. ఈ ధర్మ యుద్ధంలో నాతో కలిసి రావాలని నేను మీ అందరినీ కోరుకుతున్నాను’’ అంటూ లేఖలో నారా లోకేశ్ ప్రస్తావించారు.

Also Read: Pushpa 2 Release Date: అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్, పుష్ప2 రిలీజ్ డేట్ ఫిక్స్!