Site icon HashtagU Telugu

YCP : ఐదేళ్ల పాలనలో జగన్ ఆర్థిక విధ్వంసం.. లెక్కలతో బయటపెట్టిన లోకేష్

YS Jagan Tweet

YS Jagan Tweet

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Jagan) పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుదేలైందని మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం ఆర్థిక నియంత్రణ లేకుండా వృధా ఖర్చులు చేస్తూ, భారీగా అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసిందని మండిపడ్డారు. ముఖ్యంగా జగన్ ఐదేళ్ల పాలనలో తీసుకున్న అప్పులు, వాటికి కట్టాల్సిన వడ్డీ లెక్కలను బయటపెట్టారు. గత ముఖ్యమంత్రుల కాలంలో 2019 నాటికి రాష్ట్ర ప్రభుత్వం అప్పులకు కట్టాల్సిన వడ్డీ రూ.14,155 కోట్లు కాగా, జగన్ ఐదేళ్ల పాలనలో అది రూ.24,944 కోట్లకు పెరిగిందని ఆరోపించారు. అంటే కేవలం ఐదేళ్లలోనే రూ.11 వేల కోట్ల అదనపు వడ్డీ భారం ప్రజలపై పడిందని తెలిపారు.

జగన్ పాలనలో ఏపీ ఆర్థిక వ్యవస్థ నష్టపోయిందని, ఆర్థిక ఉద్ధృతి కోసం చేసిన అప్పులు ప్రజలకు లాభంగా కాకుండా మరింత భారం అయ్యాయని స్పష్టం చేశారు. జగన్ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని, ఏపీ భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చిందని ఆరోపించారు. రాబోయే సంవత్సరాల్లో ఈ అప్పుల భారం మరింత పెరిగే ప్రమాదం ఉందని లోకేష్ హెచ్చరించారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా గత ప్రభుత్వ హయాంలో అప్పులపై స్పందించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని.. ప్రభుత్వ పథకాలను అమలు చేసేందుకు కొంత సమయం పట్టే అవకాశం ఉందని చెప్పిన సంగతి తెలిసిందే. ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తామన్నారు.