Nara Lokesh: కల్తీ సారాపై ప్రభుత్వానికి నారా లోకేశ్ సవాల్.. దాని వెనుక అసలు కథ ఇది!

ఆంధ్రప్రదేశ్ లో ఓ రేంజ్ లో బ్రాండ్ వార్ జరుగుతోంది. కల్తీ సారా మరణాలను సహజ మరణాలుగా చూపించడం దారుణమని.. నిజానిజాలను నిగ్గు తేలుస్తామని తెలుగుదేశం పార్టీ చెబుతోంది.

Published By: HashtagU Telugu Desk
Nara Lokesh J Brand

Nara Lokesh J Brand

ఆంధ్రప్రదేశ్ లో ఓ రేంజ్ లో బ్రాండ్ వార్ జరుగుతోంది. కల్తీ సారా మరణాలను సహజ మరణాలుగా చూపించడం దారుణమని.. నిజానిజాలను నిగ్గు తేలుస్తామని తెలుగుదేశం పార్టీ చెబుతోంది. అందుకే రాష్ట్రంలో ఏ మద్యం షాపుకైనా రండి.. నమూనాలను ల్యాబ్స్ కు పంపిద్దాం.. అందులో రసాయనాలు ఉన్నాయని నిరూపిస్తాం.. అంటూ సవాల్ విసిరారు నారా లోకేశ్.

కొత్త బ్రాండ్లను తీసుకువచ్చిన జగన్ ప్రభుత్వం ప్రజల ప్రాణాలను బలితీసుకుంటోందని ఆరోపించారు. అందుకే జగన్ ప్రభుత్వం రాకముందు.. ఏడాది ఆదాయం ఆరు వేల కోట్ల రూపాయిలుంటే.. ఇప్పుడది 22 వేల కోట్ల రూపాయిలు అయ్యిందన్నారు. మద్యం ఆదాయాన్ని ఇంతలా పెంచడం జగన్ రెడ్డికే సాధ్యమైందని ఎద్దేవా చేశారు.

కల్తీ సారా వల్లే 26 మంది చనిపోయారన్నది టీడీపీ ఆరోపణ. కానీ అవన్నీ సహజ మరణాలే అని ప్రభుత్వం అంటోంది. పైగా టీడీపీ హయాంలోనే కొత్త బ్రాండ్లను తీసుకువచ్చారని.. తమ ప్రభుత్వం ఒక్క కొత్త బ్రాండ్ ను కూడా తీసుకురాలేదని వివరణ ఇచ్చారు. దీంతో తెలుగుదేశం పార్టీ.. ఇందులో నిజమెంత.. అబద్ధమెంత అన్న దానిపై వివరణ ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తోంది.

టీడీపీకి ఈ కల్తీ సారా అంశం రాజకీయ అస్త్రంగా ఉపయోగపడుతోంది. రాష్ట్రం మొత్తం మీద ప్రభావం చూపించే అంశం కావడంతో దీనికి ప్రాధాన్యత ఇస్తోంది. అందుకే చంద్రబాబు, లోకేశ్ నేరుగా రంగంలోకి దిగారు. పైగా బాధితులకు ఏకంగా రూ.లక్ష చొప్పున ఎక్స్ గ్రేషియా ఇస్తామన్నారు. దీనిని బట్టి ఇది రాజకీయంగా ఎంతటి ప్రాధాన్యతను సంతరించుకుందో అర్థం చేసుకోవచ్చు.

 

 

 

  Last Updated: 24 Mar 2022, 11:48 AM IST