Nagoba: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో కొలువుదీరిన ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబా జాతర శుక్రవారం ప్రారంభమైంది. అంతకుముందు నాగోబా విగ్రహాన్ని నాయక్‌వాడి మెస్రం ధర్ము తలపై ఎత్తుకొని ఆలయానికి చేరుకున్నారు. మహిళలు కోనేరు నుంచి మట్టి కుండల్లో తీసుకొచ్చిన నీటితో ఆలయ ప్రాంగణంలో పుట్టలను తయారు చేశారు. రాత్రి మహాపూజలతో జాతరను ప్రారంభించారు. వేల సంఖ్యలో భక్తులు హాజరవ్వగా.. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఆదివాసీల అతిపెద్ద జాతర కేస్లా పూర్ నాగోబా జాతర వైభవంగా సాగుతోంది. జాతర కోసం వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు. ఇవాళ పలువురు కేంద్రమంత్రులు నాగోబాను దర్శించుకోనున్నారు. ఈ జాతరకు ఉమ్మడి ఆదిలాబాద్ వ్యాప్తంగానే కాకుండా వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి తమ మొక్కులు చెల్లించుకుంటారు.
ఆదివాసుల సమస్యల పరిష్కారానికి దర్బార్ ఒక వేదికగా మారినది. 1946 సంవత్సరంలో హైమన్ డార్ఫ్ ఈ దర్బార్ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. అప్పటినుంచి ఇప్పటివరకు నిరంతరంగా ప్రతి ఏడాది నాగోబా జాతర రోజున కొనసాగుతుంది. ఈ సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్, జిల్లా ప్రధానఅధికారులందరూ హాజరవుతారు. ఆదివాసులు తమ యొక్క సమస్యల విన్నవిస్తారు అలాగే సమస్యల పరిష్కారం కూడా జరుగుతుంది.