Site icon HashtagU Telugu

Karnataka : కర్ణాటకలో ముస్లిం యువకుడి హ‌త్య‌… నాలుగు స్టేష‌న్ల ప‌రిధిలో నిషేధాజ్ఞ‌లు

Suicide

Deadbody Imresizer

కర్ణాటకలో ముస్లిం యువ‌కుడి హ‌త్య క‌ల‌క‌లం రేపుతుంది. మరణించిన ముస్లిం యువకుడిని మంగళూరు శివార్లలోని సూరత్‌కల్ సమీపంలోని మంగల్‌పేట నివాసి మహమ్మద్ ఫాజిల్‌గా గుర్తించారు. మంగళూరు జిల్లాలో హత్యకు గురైన బీజేపీ కార్యకర్త ప్రవీణ్ కుమార్ కుటుంబాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై పరామర్శించిన కొన్ని గంటలకే దుండగుల ముఠా ఓ ముస్లిం యువకుడిని నరికి చంపినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. హిందూత్వ కార్యకర్తలు ఆరోపించిన ప్రతీకార హత్యగా పోలీసు వర్గాలు అనుమానిస్తున్నాయి. అయితే హత్య వెనుక ఉద్దేశ్యంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

సూరత్‌కల్‌ పరిసర ప్రాంతాల్లోని నాలుగు పోలీస్‌ స్టేషన్ల పరిధిలో నిషేధాజ్ఞలు విధించినట్లు మంగళూరు పోలీస్‌ కమిషనర్‌ ఎన్‌. శశికుమార్‌ గురువారం తెలిపారు. సూరత్‌కల్‌, ముల్కీ, బజ్‌పే, పనంబూర్‌లలో శనివారం వరకు నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయి. మద్యం దుకాణాలు మూసివేయించారు. హత్య వెనుక గల కారణాలను తాము వెల్ల‌డిస్తామ‌ని.. ప్రజలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని పోలీసు కమిషనర్ కోరారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ బట్టల దుకాణం బయట నిలబడి ఉన్న ఫాజిల్‌పైకి కొందరు వ్యక్తులు కారులో వచ్చి దాడికి పాల్పడ్డారు. ఫాజిల్‌ను వెంబడించి దుండగులు మారణాయుధాలతో దారుణంగా దాడి చేశారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఫాజిల్‌ను ఆసుపత్రికి తరలించినప్పటికీ చికిత్స పొందుతూ మృతి చెందాడు.