Musical chair: మ్యూజికల్ ఛైర్ గా మారిన భారత కెప్టెన్సీ

ఏడు నెలలు..ఏడుగురు కెప్టెన్లు... సగటున నెలకు లేదా సిరీస్ కు ఒక కెప్టెన్.. ప్రస్తుతం ఇదీ భారత క్రికెట్ జట్టు పరిస్థితి.

  • Written By:
  • Updated On - July 7, 2022 / 05:09 PM IST

ఏడు నెలలు..ఏడుగురు కెప్టెన్లు… సగటున నెలకు లేదా సిరీస్ కు ఒక కెప్టెన్.. ప్రస్తుతం ఇదీ భారత క్రికెట్ జట్టు పరిస్థితి. రొటేషన్ పేరుతో సిరీస్ కో కొత్త సారథిని ప్రకటిస్తూ బీసీసీఐ కొత్త సమస్య సృష్టిస్తుందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా విండీస్ తో సిరీస్ కు శిఖర్ ధావన్ ను సారథిగా ఎంపిక చేయడంతో ఈ కెప్టెన్సీ మ్యూజికల్ ఛైర్ పై మళ్ళీ చర్చ మొదలైంది. నిజానికి ఏ జట్టుకైనా నాయకుడు, హెడ్ కోచ్ కీలకం. వీరిద్దరి మధ్య మంచి సమన్వయం ఉంటేనే మంచి ఫలితాలు వస్తాయి. అయితే ఇప్పుడు బీసీసీఐ వ్యవహరిస్తున్న తీరుతో ద్రావిడ్ తో పాటు జట్టు పరిస్థితి కూడా అగమ్యగోచరంగా తయారైందన్న వాదన వినిపిస్తోంది. ద్రావిడ్ హెడ్ కోచ్ గా బాధ్యతలు తీసుకున్నాక గడిచిన 7 నెలల్లో ద్రావిడ్ ఏకంగా ఏడుగురు కెప్టెన్లతో పనిచేశాడు. బహుశా గతంలో టీమిండియా హెడ్ కోచ్ గా ఉన్న ఏ వ్యక్తి కూడా ఇంతమంది కెప్టెన్లతో పని చేయలేదు.
గతేడాది టీ20 ప్రపంచకప్ ముగిసి ఇంటికి చేరాక టీమిండియా ప్రధాన కోచ్ గా ద్రావిడ్ బాధ్యతలు తీసుకున్నాడు. అదే సమయంలో రోహిత్ శర్మ కూడా కోహ్లి నుంచి బాధ్యతలు తీసుకుని కెప్టెన్ అయ్యాడు. ఇక్కడ నుంచీ భారత కెప్టెన్లు మారుతూ వస్తున్నారు. కాన్పూర్ టెస్టులో అజింక్యా రహానే, ముంబై టెస్టులో విరాట్ కోహ్లి సారథిగా న్యవహరించారు.

అనంతరం సౌతాఫ్రికా సిరీస్ లో తొలి టెస్టుకు కోహ్లి కెప్టెన్ కాగా.. రెండో టెస్టుకు కెఎల్ రాహుల్ బాధ్యతలు తీసుకున్నాడు. తిరిగి మూడో టెస్టుకు కోహ్లి మళ్ళీ వచ్చాడు. సఫారీ గడ్డపై 1-2తో సిరీస్ కోల్పోవడంతో కోహ్లీ టెస్ట్ కెప్టెన్సీకి కూడా గుడ్ బై చెప్పాడు. టెస్టు సిరీస్ ముగిశాక వన్డే సిరీస్ కు కెఎల్ రాహుల్ సారథిగా ఉన్నాడు. అనంతరం భారత జట్టు స్వదేశంలో వెస్టిండీస్ తో మూడు వన్డేలు, మూడు టీ20లు.. శ్రీలంకతో మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడింది. ఈ సిరీస్ లకు మళ్లీ రోహితే కెప్టెన్ గా తిరిగి వచ్చాడు. అటు ఐపీఎల్ తర్వాత స్వదేశంలో దక్షిణాఫ్రికాతో ముగిసిన టీ20 సిరీస్ లో రోహిత్ కు రెస్ట్ ఇచ్చిన సెలక్టర్లు కెఎల్ రాహుల్ కు గాయం కావడంతో రిషభ్ పంత్ ను కెప్టెన్ గా ఎంపిక చేశారు. మరోవైపు ఇంగ్లాండ్ టూర్ లో భాగంగా చివరి టెస్టుకు రోహిత్ కరోనా బారిన పడడంతో బూమ్రాకు పగ్గాలు అప్పగించారు. అటు ఐర్లాండ్ తో రెండు టీ20లకు హార్థిక్ పాండ్యా సారథిగా వ్యవహరించాడు. ఇప్పుడు ఇంగ్లాండ్ తో టీ ట్వంటీ సిరీస్ కు మళ్లీ రోహిత్ శర్మ రీ ఎంట్రీ ఇచ్చాడు. అయితే త్వరలో జరగనున్న విండీస్ టూర్ కోసం కొత్త కెప్టెన్ గా శిఖర్ ధావన్ ఎంపికయ్యాడు. ఇలా సిరీస్ సిరీస్ కూ కెప్టెన్లను మార్చడం జట్టుకు మంచికాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. రొటేషన్, విశ్రాంతి , గాయాలు వంటి కారణాలతో కెప్టెన్లను మారుస్తున్నామని బీసీసీఐ చెబుతోంది. అయితే ఇలాంటి ప్రయోగాలు చేటు చేస్తాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఇలా సిరీస్ కు ఒక కెప్టెన్ తో పనిచేయడం ప్రధాన కోచ్ ద్రావిడ్ కు చాలా ఇబ్బందేనని చెప్పాలి. రెగ్యులర్ కెప్టెన్ గా ఉండే వ్యక్తితో సమన్వయం చేసుకుంటేనే జట్టు ఆటతీరును సరిగ్గా అంచనా వేసేందుకు వీలుంటుంది. సిరీస్ కు ఒక కెప్టెన్ ను మారుస్తూ పోతే మాత్రం జట్టు కూర్పుతో పాటు ఏ విషయంలోనూ సరైన నిర్ణయం తీసుకునే వీలుండదు. ఇది ఇలాగే కొనసాగితే ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీల్లో జట్టు ఆటకీరుపై ప్రభావం చూపిస్తుందని భావిస్తున్నారు.