ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు బప్పిలహిరి(69) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన…బుధవారం ముంబయి లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. 1952 నవంబరు 27న బప్పిలహిరి జన్మించారు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి డిస్కోను పరిచయం చేసిన ఘనత బప్పిలహిరి దే. ఓవైపు ఎన్నో సూపర్ హిట్ పాటలు సైతం ఆయన పాడారు.
బప్పిలహిరి ఆలపించిన ‘చల్తే చల్తే’, ‘డిస్కో డ్యాన్సర్’, ‘షరాబీ’ వంటి సాంగ్స్ యువతను ఉర్రూతలూగించాయి. హిందీ, తెలుగు, బెంగాళీ, తమిళం, కన్నడ, గుజరాతీ చిత్రాలకు ఆయన మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేశారు. బాలీవుడ్‌లో 50కి పైగా చిత్రాలకు సంగీతం సమకూర్చారు. తెలుగులో సింహాసనం, స్టేట్‌రౌడీ, సామ్రాట్, గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు, రౌడీ ఇన్‌స్పెక్టర్, రౌడీగారిపెళ్లాం, దొంగ పోలీసు, బ్రహ్మ, నిప్పురవ్వ, బిగ్‌బాస్, ఖైదీ ఇన్‌స్పెక్టర్ చిత్రాలకు సంగీతం అందించారు. సింహాసనం సినిమాలోని పాటలు అయితే ఓ సంచలనమే అని చెప్పాలి. అలానే చిరుతో చేసిన గ్యాంగ్ లీడర్ గురించి అయితే ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అంతగా ఆయన పాటలు యువతను ఆకట్టుకున్నాయి.