ట్రైనీ ఎయిర్ హోస్టెస్(Air Hostess), సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ రూపాలి ఓగ్రే(Rupali Ogre) హత్యకేసులో కీలక విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఆదివారం (ఆగస్టు 3) రూపాలీ హత్యకు గురవ్వగా.. ఈ కేసులో నిందితుడిగా భావిస్తున్న విక్రమ్ అత్వాన్ (35)ను పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించగా.. నేరాన్ని అంగీకరించాడు. నిందితుడు రూపాలీని హతమార్చిన తర్వాత.. 2 గంటలకు పైగా ఆమె ఫ్లాట్ లోనే ఉన్నట్లుగా పోలీసులు(Police) గుర్తించారు.
ఆ రోజు ఉదయం 10.30-11.30 గంటల సమయంలో హత్య జరిగి ఉంటుందని భావించిన పోలీసులు.. ఆ సమయంలో భవనంలోకి వచ్చిన వ్యక్తుల వివరాలను సేకరించారు. సుమారు 45 మందిని ప్రశ్నించగా.. వారిలో చెత్త తీసుకెళ్లేందుకు వచ్చిన విక్రమ్ అత్వాన్ కదలికలు మాత్రం అనుమానాస్పదంగా ఉన్నట్లు గుర్తించారు.
సుమారు 2 గంటలకు పైగా ఆ భవనంలోనే గడిపిన అతను లోపలకు యూనిఫామ్ తో వెళ్లి బయటకు వచ్చే సమయంలో వేరే దుస్తుల్లో కనిపించాడు. దాంతో అనుమానించిన పోలీసులు.. తమదైన శైలిలో ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. ఆదివారం ఉదయం 11.30 గంటల సమయంలో రూపాలీ ఫ్లాట్ లోకి వెళ్లిన అతను ఆమె గొంతుకోసి హత్యచేశాడు. ఈ క్రమంలో తన శరీరంలో ఉన్న యూనిఫారమ్ పై రక్తపు మరకలు పడటంతో.. వాటిని కడుక్కుని, దుస్తులు మార్చుకుని ఫ్లాట్ నుంచి బయటకు వచ్చాడు. ఆ తర్వాత భవనంలో 2 గంటలు గడిపి బయటకు వెళ్లిపోయాడు.
అక్కడి నుండి నేరుగా పవాయిలోని తుంగా గ్రామానికి వెళ్లి ఏమీ ఎరుగనట్లు సోమవారం (ఆగస్టు4) యదావిధిగా విధుల్లో చేరాడు. పోలీసులు విక్రమ్ ను అక్కడే అరెస్ట్ చేసి విచారించారు. విక్రమ్ మెడ, చేతులపై గాయాలుండటాన్ని గమనించిన పోలీసులు రూపాలీపై అతను అత్యాచారం చేయడానికి ప్రయత్నించగా ఆమె ప్రతిఘటించడంతో హత్యచేసినట్లు అనుమానిస్తున్నారు. విక్రమ్ కు భార్య, ఇద్దరు పిల్లలు ఉండగా అతని భార్య అదే అపార్ట్మెంట్ లో పనిచేస్తోంది.
Also Read : Karnataka: కన్న బిడ్డని కడతేర్చిన కసాయి తండ్రి