Site icon HashtagU Telugu

LSG vs MI Eliminator: రోహిత్ సేన ఆల్ రౌండర్ షో.. ముంబై దెబ్బకు లక్నో ఔట్

LSG vs MI

Mi Vs Srh Dream11 Prediction1684654801539

LSG vs MI Eliminator: ఐపీఎల్ 16వ సీజన్ లో మాజీ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ రెండో క్వాలిఫైయర్ కు దూసుకెళ్ళింది. ఎలిమినేటర్ మ్యాచ్ లో ఆ జట్టు 81 పరుగుల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ పై విజయం సాధించింది. అటు బ్యాటింగ్ , ఇటు బౌలింగ్ లో అదరగొట్టిన రోహిత్ సేన ఆల్ రౌండ్ షోతో లక్నోను ఇంటికి పంపించింది. (LSG vs MI)

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్ కు ఆశించిన ఆరంభం దక్కలేదు. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ త్వరగానే ఔటయ్యారు. అయితే కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ జోరుతో ముంబై ఇన్నింగ్స్ ఫస్ట్ గేర్ లోనే సాగింది. వీరిద్దరూ భారీ షాట్లతో లక్నో బౌలర్లపై విరుచుకుపడ్డారు. దీంతో పవర్ ప్లేలో ముంబై 62 పరుగులు చేసింది. గ్రీన్, సూర్యకుమార్ మూడో వికెట్ కు 66 పరుగులు జోడించారు. కామెరూన్ గ్రీన్ 23 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సర్ తో 41 , సూర్యకుమార్ యాదవ్ 20 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 33 పరుగులు చేశారు. వీరిద్దరూ వెంటవెంటనే ఔటైనప్పటకీ.. తెలుగుతేజం తిలక్ వర్మ, టిమ్ డేవిడ్ , వధేరా మెరుపులు మెరిపించారు. దీంతో ముంబై స్కోర్ వేగం తగ్గలేదు. తిలక్ వర్మ 22 బంతుల్లో 2 సిక్సర్లతో 26 పరుగులు చేయగా.. వధేరా ధాటిగా ఆడి 12 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 23 పరుగులు చేశాడు. దీంతో ముంబై ఇండియన్స్ 8 వికెట్లకు 182 పరుగులు చేసింది. లక్నో బౌలర్లలో నవీనుల్ హక్ 4 , యశ్ ఠాకూర్ 3 వికెట్లు పడగొట్టారు. (MI Beats LSG)

పిచ్ పూర్తిగా బ్యాటర్లకు అనుకూలంగా లేకపోవడంతో ఛేజింగ్ అంత ఈజీ కాదని లక్నోకు ముందే అర్థమైంది. ఓపెనర్లు కైల్ మేయర్స్ 18 , మంకడ్ 3 పరుగులకే ఔటయ్యారు. ఈ దశలో కెప్టెన్ కృనాల్ పాండ్యా, స్టోయినిస్ ధాటిగా ఆడి స్కోర్ ముందుకు నడిపించారు. కృనాల్ పాండ్యా 8 పరుగులకే ఔటవగా…ఆయూశ్ బదౌనీ 1 పరుగు చేసి వెనుదిరిగాడు. ఇక ప్రమాదకరమైన నికోలస్ పూరన్ ను మథ్వాల్ డకౌట్ చేయడంతో లక్నో కష్టాల్లో పడింది. అయితే స్టోయినిస్ ధాటిగా ఆడడంతో లక్నో విజయంపై ఆశలు నిలిచాయి. తనదైన షాట్లతో ఆకట్టుకున్న స్టోయినిస్ 27 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్ తో 40 పరుగులు చేయగా..దురదృష్టవశాత్తూ రనౌటయ్యాడు. దీంతో లక్నో ఓటమి ఖాయమైపోయింది. తర్వాత కృష్ణప్ప గౌతమ్ రనౌటవడం… మిగిలిన బ్యాటర్లు కూడా చేతులెత్తేయడంతో లక్నో 101 రన్స్ కే ఆలౌటై టోర్నీ నుంచి నిష్క్రమించింది. ముంబై బౌలర్లలో ఆకాశ్ మధ్వాల్ 5 కీలక వికెట్లతో మ్యాచ్ ను మలుపు తిప్పాడు. ఈ విజయంతో రెండో క్వాలిఫైయిర్ కు చేరిన ముంబై , గుజరాత్ టైటాన్స్ తో తలపడుతుంది. దీనిలో గెలిచిన జట్టు ఆదివారం జరిగే ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడుతుంది.

Read More: Ban On Dhoni: ధోనీపై నిషేధం.. చెన్నై సారథి ఫైనల్ ఆడతాడా ?