Ambani & Adani: అపర కుబేరులకు షాక్.. 20 రోజుల్లో లక్షన్నర కోట్ల నష్టం!

కోటి.. 100 కోట్లు.. 1000 కోట్లు కాదు.. ఏకంగా లక్షన్నర కోట్ల రూపాయల (14 బిలియన్ డాలర్ల) సంపద ఆవిరి అయింది.

  • Written By:
  • Updated On - May 14, 2022 / 03:23 PM IST

కోటి.. 100 కోట్లు.. 1000 కోట్లు కాదు.. ఏకంగా లక్షన్నర కోట్ల రూపాయల (14 బిలియన్ డాలర్ల) సంపద ఆవిరి అయింది. అది కూడా కేవలం 20 రోజుల వ్యవధిలో !! ఇది ఎవరి సంపద ? ఎలా ఆవిరి అయింది ? అంటే.. అపర కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ సంపద ఇది. ఏప్రిల్ 23 నాటికి ఆయన నికర సంపద విలువ రూ.8.5 లక్షల కోట్లు (104.7 బిలియన్ డాలర్లు). 20 రోజులు తిరిగే సరికే (మే 13 నాటికి) ఇది కాస్తా రూ.7 లక్షల కోట్ల (90.8 బిలియన్ డాలర్లు)కు చేరింది. అంటే లక్షన్నర కోట్ల రూపాయలు ఆవిరి అయ్యాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) షేరు ధర భారీగా తగ్గిపోవడం వల్ల ఇలా జరిగింది. RIL షేరు ధర ఏప్రిల్ 22న రూ.2,758 ఉండగా, మే 13 వచ్చేసరికి ఇది రూ.2431 కి పడిపోయింది. మదుపరులు ఈ షేరులో భారీగా అమ్మకాలకు పాల్పడటంతో ధర పతనమైంది.

ఇదే వ్యవధిలో మరో కుబేరుడు గౌతమ్ ఆదానీ నికర సంపద విలువ కూడా రూ.9.5 లక్షల కోట్ల నుంచి రూ.7.9 లక్షల కోట్లకు తగ్గిపోయింది. ఆదానీ గ్రూప్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి వల్లే ఇలా జరిగింది. ఇక ప్రపంచ టాప్ 10 బిలియనీర్ల కొత్త జాబితాలో గౌతమ్ అదానీ 6వ స్థానంలో, ముకేశ్ అంబానీ 10వ స్థానంలో ఉన్నారు. వరుసగా గత వారం రోజులుగా భారత స్టాక్ మార్కెట్లు పతనమవుతూ వస్తున్నాయి. దేశంలో ద్రవ్యోల్బణం పతాక స్థాయికి చేరడం, రూపాయి విలువ రికార్డు స్థాయిలో పడిపోవడం వంటి కారణాలతో మదుపరులు భయంలో ఉన్నారు. ముందుజాగ్రత్త చర్యగా వారు తమ వద్దనున్న షేర్లను అమ్మేసుకుంటున్నారు. దీనివల్లే స్టాక్ మార్కెట్లు కుప్ప కూలుతున్నాయి. ఇంధన ధరలు, నిత్యావసరాల ధరలు మండిపోతుండటంతో ఏప్రిల్ నెలలో ద్రవ్యోల్బణం 7.79 శాతానికి పెరిగింది.