టీమిండియా సీనియర్ ఆల్‌రౌండర్ , గుజరాత్ టైటాన్స్ హార్దిక్ పాండ్యా ప్రస్తుతం చక్కటి ఫామ్ లో ఉన్నాడు. విధ్వంసక ఆటతీరును కేరాఫ్ అడ్రస్ గా ఉండే హార్దిక్ తాజాగా ఐపీఎల్ 15వ సీజన్ లో కూల్ కెప్టెన్సీతో ఆకట్టుకుంటున్నాడు. తొలుత వాంఖడే స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా ఆల్‌రౌండర్ షో కనబర్చాడు. కెప్టెన్సీతో పాటు అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్‌లోనూ ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్ లో 28 బంతులు ఆడిన పాండ్య ఐదు ఫోర్లు, ఒక సిక్స్‌తో 33 పరుగులు చేశాడు. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో కూడా పాండ్య రాణించాడు. ఈ మ్యాచ్ లో 27 బంతులు ఆడిన హార్దిక్ నాలుగు ఫోర్లతో 31 పరుగులు సాధించాడు… అయితే ఈసారి ఐపీఎల్ లో నిలకడైన ప్రదర్శన కనబరుస్తున్న హార్దిక్ పాండ్యాపై టీమిండియా మాజీ చీఫ్ సెలక్టర్ ఎమ్మేస్కే ప్రసాద్ పొగడ్తల జల్లు కురిపించాడు.
ఐపీఎల్ 15వ సీజన్ లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా హార్దిక్ దుమ్మురేపుతున్నాడని పేర్కొన్నాడు. మైదానంలో హార్దిక్ పాండ్య వ్యవహరిస్తున్న తీరు అద్భుతంగా ఉందని అన్నాడు. తాజాగా ఓ కార్యక్రమంలో ఎంఎస్కె ప్రసాద్ మాట్లాడుతూ.. హార్దిక్ పాండ్యా 2016లో టీమిండియాకు ఎంపిక కావడంలో నేనే ముఖ్య పాత్ర పోషించాను. వచ్చిన అవకాశాలను చక్కగా వినియోగించుకున్న అతడు స్టార్ ఆల్‌రౌండర్‌గా ఎదిగాడు. ప్రసుతం హార్దిక్ పాండ్య ఆటగాడిగా చాలా పరిణతి చెందాడు.గుజరాత్ టైటాన్స్ సారథిగా వ్యవహరించడం తన అంతర్జాతీయ కెరీర్ కు ఎంతగానో ఉపయోగపడుతుంది త్వరలోనే హార్దిక్ మళ్ళీ భారత జట్టులోకి రావడం ఖాయమని అని ఎంఎస్కె ప్రసాద్ చెప్పుకొచ్చాడు. ఇదిలాఉంటే.. హార్దిక్ పాండ్య సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ జట్టు ఆడిన తొలి మ్యాచ్ లోనే లక్నో సూపర్ జాయింట్స్ పై 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.. ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక ఈ మెగా టోర్నీలో భాగంగా ఏప్రిల్ 8న పంజాబ్ కింగ్స్‌తో గుజరాత్ టైటాన్స్ తమ తదుపరి మ్యాచ్ ఆడనుంది.