CSK New Captain: చెన్నై కెప్టెన్సీకి ధోనీ గుడ్‌ బై

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపిఎల్ 2022 సీజన్ ముంగిట చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు ఆ జట్టు సారథి మహేంద్ర సింగ్ ధోని కొలుకోలేని షాక్ ఇచ్చాడు.

  • Written By:
  • Updated On - March 24, 2022 / 04:13 PM IST

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపిఎల్ 2022 సీజన్ ముంగిట చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు ఆ జట్టు సారథి మహేంద్ర సింగ్ ధోని కొలుకోలేని షాక్ ఇచ్చాడు. తాజాగా ఆ జట్టు సారథ్య బాధ్యతల నుంచి ధోని తప్పుకుంటున్నట్లు ట్విట్టర్ వేదికగా చెన్నై ఫ్రాంచైజీ వెల్లడించింది. అలాగే చెన్నై జట్టు సీనియర్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు జట్టు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఈసారి ఐపీఎల్ కో మాత్రం ధోని ఆటగాడిగా మాత్రం కొనసాగనున్నాడు. ఇక ఐపీఎల్ 2022 సీజన్ మార్చి 26 నుంచి ప్రారంభంకానుండగా.. తొలి మ్యాచ్‌లోనే కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో వాంఖడే వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ పోటీపడనుంది.. అయితే తొలి మ్యాచ్‌ ముంగిట ధోనీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో మునిగిపోయారు.

మెగా వేలానికి ముందే ర‌వీంద్ర జడేజాను చెన్నైసూప‌ర్ కింగ్స్ 16 కోట్ల రూపాయ‌ల‌కు రిటైన్ చేసుకుంది. అప్ప‌టి నుంచే జడేజానే ఈ సీజ‌న్‌లో చెన్నైకి కెప్టెన్‌గా ఉంటాడ‌నే వార్త‌లు వ‌చ్చాయి. కానీ ఆ త‌ర్వాత సీఎస్కే మేనేజ్‌మెంట్ ఈ వార్త‌ల‌ను ఖండించింది. దీంతో ఈ సారి కూడా ధోనినే కెప్టెన్‌గా ఉంటార‌ని అంతా భావించారు. ఐపీఎల్ 2022 ప్రారంభానికి స‌రిగ్గా రెండు రోజులు ముందు ర‌వీంద్ర జ‌డేజాకు కెప్టెన్సీ అప్ప‌గిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించి 40 ఏళ్ల‌ ధోని అంద‌రికీ షాక్ ఇచ్చాడు.

ఇదిలావుంటే.. ఐపీఎల్ 2008 సీజన్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా ఉన్న ఎంఎస్ ధోనీ.. చెన్నై జట్టుని అద్భుతంగా ముందుండి నడిపించాడు. ఈ క్రమంలోనే నాలుగు సార్లు టైటిల్ విన్నర్ గా నిలిపాడు. ఇక ఐపిఎల్ చరిత్రలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ అత్యంత విజయవంతమైన జట్టుగా పేరొందింది. ధోని సారథ్యంలో 2010, 2011, 2018, 2021 సీజన్లలో విన్నర్‌గా నిలిచింది. ఇక మరోవైపు ఐపీఎల్ 15వ సీజన్ కోసం చెన్నై ఫ్రాంచైజీ ధోనీతో పాటుగా రవీంద్ర జడేజా, మొయిన్ అలీ, రుతురాజ్ గైక్వాడ్‌ని రిటైన్ చేసుకుంది.