Dhoni: చెన్నై కెప్టెన్‌గా ధోనీ రికార్డులివే

ఐపీఎల్ 15వ సీజన్ ఆరంభానికి రెండు రోజుల ముందు ధోనీ చెన్నై కెప్టెన్సీ నుంచి తప్పుకుని అందరికీ షాకిచ్చాడు. కొత్త సారథిగా జడేజా సీఎస్‌కేను లీడ్ చేయబోతున్నాడు.

  • Written By:
  • Publish Date - March 24, 2022 / 05:06 PM IST

ఐపీఎల్ 15వ సీజన్ ఆరంభానికి రెండు రోజుల ముందు ధోనీ చెన్నై కెప్టెన్సీ నుంచి తప్పుకుని అందరికీ షాకిచ్చాడు. కొత్త సారథిగా జడేజా సీఎస్‌కేను లీడ్ చేయబోతున్నాడు. నిజానికి వచ్చే సీజన్ నుంచి ధోనీ సారథిగా తప్పుకుంటాడని, ఇదే చివరి సీజన్ అంటూ వార్తలు వచ్చినా.. అనూహ్యంగా ఈ సీజన్‌కే తన నిర్ణయాన్ని ప్రకటించేశాడు. దీంతో ఫ్యాన్స్‌ షాక్‌కు గురైనా తలైవా కెప్టెన్సీ గురించి గుర్తు చేసుకుంటున్నారు. చెన్నై సూపర్‌కింగ్స్ ఆరంభం నుంచీ సారథిగా వ్యవహరిస్తున్న మహేంద్రసింగ్ ధోనీకి ఐపీఎల్‌లో తిరుగులేని రికార్డుంది. మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా , జట్టును క్లిష్ట పరిస్థితుల్లోనూ అద్భుతంగా నడిపించే సారథిగా ధోనీ ఎన్నో రికార్డులు అందుకున్నాడు. ధోనీ కెప్టెన్సీ రికార్డులను ఒకసారి చూస్తే… ఇప్పటి వరకూ ఐపీఎల్ కెరీర్‌లో 204 మ్యాచ్‌లకు సారథిగా వ్యవహరించాడు.
చెన్నై సూపర్‌కింగ్స్‌తో పాటు రైజింగ్ పూణే సూపర్‌జెయింట్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన ధోనీ గెలుపు శాతం 59.60గా ఉంది. 204 మ్యాచ్‌లలో 121 మ్యాచ్‌లను గెలిపించిన ధోనీ 82 ఓటములు చవిచూశాడు. ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు.

అభిమానులు ముద్దుగా తలైవా అని పిలుచుకునే ధోనీ చెన్నైని నాలుగు సార్లు ఛాంపియన్‌గా నిలిపాడు. ధోనీ సారథ్యంలోనే సీఎస్‌కే 2010, 2011, 2018, 2021లలో విజేతగా నిలిచింది. అలాగే రెండు సార్లు ఛాంపియన్స్ లీగ్ టైటిల్ కూడా చెన్నై గెలుచుకుంది. 2010, 2014 ఛాంపియన్స్ లీగ్‌ టైటిల్ సాధించింది.
ఐపీఎల్ చరిత్రలో ఒకటి కంటే ఎక్కువ ట్రోఫీ గెలిచిన ముగ్గురు భారత కెప్టెన్లలో ధోనీ ఒకడు. రోహిత్‌శర్మ, గంభీర్‌తో పాటు ధోనీ ఒకసారి కంటే ఎక్కువ ఐపీఎల్ టైటిల్స్ సాధించాడు. తన టీమ్‌కు ఐపీఎల్ ట్రోఫీ, ఛాంపియన్స్ లీగ్ టైటిల్‌తో కలిసి ఆరు ట్రోఫీలు అందించిన రోహిత్‌శర్మ సరసన ధోనీ కూడా నిలిచాడు. అలాగే ఛాంపియన్స్ ట్రోఫీని ఒకటి కంటే ఎక్కువసార్లు గెలిచిన ఏకైక భారత సారథిగానూ ధోనీ రికార్డులకెక్కాడు. ఇక ఐపీఎల్‌లో 200 కంటే ఎక్కువ మ్యాచ్‌లకు సారథ్యం వహించిన ఆటగాడిగా ధోనీ ఘనత సాధించాడు. మొత్తం మీద 14 ఏళ్ళ కెరీర్‌లో కెప్టెన్‌గా తనదైన ముద్ర వేసిన ధోనీకి చెన్నైలో తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ధోనీ కారణంగానే ఆ ఫ్రాంచైజీ బ్రాండ్ వాల్యూ, ఫ్యాన్ క్రేజ్‌ అత్యున్నత స్థాయిలో ఉందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే కెప్టెన్‌గా తప్పుకున్నా…రానున్న రోజుల్లో ఆటగాడిగా కూడా తప్పుకున్నా ధోనీ ఏదో ఒక పాత్రలో చెన్నై జట్టుతో పాటే ఉంటాడని ఆ ఫ్రాంచైజీ గతంలోనే వెల్లడించింది.